సీఎం రేవంత్ రెడ్డికి ప్రజావాణి లైవ్ యాక్సెస్ ఏర్పాటు !

👉 2023 డిసెంబర్ నుంచి నేటి వరకు 117 సార్లు ప్రజావాణిలు – 54,619 అర్జీలు !


J.SURENDER KUMAR,

ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్‌ను తనకు అందించాలని, తనకు లైవ్ యాక్సెస్ ఉండేలా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
తద్వారా తాను ఎక్కడ ఉన్నా ప్రజావాణి అర్జీల పరిష్కారం తీరును, ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయో తెలుసుకునే వీలుంటుందని, అర్జీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేయటం సులభమవుతుందని అన్నారు.

ప్రజల అర్జీలను పరిష్కరించడంలో విజయవంతంగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో మరింత పారదర్శకమైన  విధానాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి   ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాభవన్‌లో కొనసాగుతున్న ప్రజా వాణి డ్యాష్ బోర్డుతో అనుసంధానం చేయాలని చెప్పారు. 

👉 మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో వారంలో రెండు రోజులు కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం పై సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి  సమీక్షించారు. ప్రజలు ఇప్పటివరకు సమర్పించిన అర్జీలు, వాటిల్లో పరిష్కారమైనవి, పరిష్కారానికి అధికారులు అనుసరిస్తున్న విధానాలను ముఖ్యమంత్రి  సమీక్షించారు.

👉 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించగా, అందులో 54,619 అర్జీలను ప్రజలు నమోదు చేసుకున్నారు. వీటిలో 68.4 శాతం (37,384) అర్జీలు పరిష్కారమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు.

👉 అర్జీల వివరాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వాటి అమలు పురోగతి పారదర్శకంగా అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఉండేలా ఈ పోర్టల్ రూపొందించాలని సూచించారు.

👉  వివిధ విభాగాలకు ప్రజావాణిలో ప్రత్యేక డెస్క్‌లు ఏర్పాటు చేశామని, గల్ఫ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. అర్జీదారులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అత్యవసరమైన అర్జీలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తామని, అంబులెన్స్ సదుపాయం కూడా ప్రజావాణి జరిగే రోజుల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

👉  ప్రజల వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది లేకుండా అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఏయే సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి,  వేటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది ముందుగా సమీక్షించుకోవాలన్నారు. అధికారుల స్థాయిలో కమిటీ వేసి అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

👉  ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పొన్నం ప్రభాకర్ , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.