👉 ఆత్మ హత్యనా ? హత్యనా ?
J.SURENDER KUMAR,
అభం శుభం తెలియని చిన్నారి గిరిజన బాలిక (8) అర్ధాంతంగా అసువులు బాసింది. ఆడుతూ పాడుతూ అల్లారు ముద్దుగా తిరిగే తన కూతురు ఆత్మహత్య చేసుకుందా ? ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారా ? అనే విషయం తెలియని అమాయక గిరిజన దంపతులు ఆ సంఘటన చెప్పడానికి భయపడుతున్నారు.

ఏం జరిగింది ? ఎలా జరిగింది ? అని చెప్పుకోలేని దైన్య స్థితిలో వారు భయం భయంగా దిక్కులు చూస్తున్నారు. తమ చిన్నారి కూతురి మరణం కు కారణమైన ఆ ” చున్ని ” తమ ఇంటిలోకి ఎలా వచ్చిందో ? ఫ్యానుకు ఆ చున్నీతో ఎలా ఉరివేయబడ్డదో ? అని గుండెలు బాదుకుంటూ ఏడవలేని , ఎవరిని ప్రశ్నించలేని, గొంతుక వారిది. కర్కష హృదయలు సైతం కన్నీరు కార్చే దుర్భర దుస్థితి వారిది.
👉 వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనే కుంట ( నాయకపు గూడెం ) లో గత శుక్రవారం ( ఈనెల 11 న ) గడ్డం వెంకటేష్ కూతురు (8) ఇంటిలో ( తడకల గుడిసె ) ఒంటరిగా ఉంది. తల్లిదండ్రులు గడ్డం వెంకటేష్ రజితలు బర్రెలు కాయడానికి అడవికి వెళ్లారు. మరో సోదరుడు స్వాత్విక్. పోరుగున ఉన్న నరసింహుల పల్లె పాఠశాలకు ( 7 వ తరగతి ) చిన్న కుమారుడు ( 3 ) తల్లిదండ్రుల తో వెళ్లాడు. వెంకటేష్ తల్లి మేకలు మేపడానికి అడవికి వెళ్ళింది.

కొడుకు స్వాతిక పాఠశాల నుంచి ఇంటికి రాగానే తెల్లటి చున్నీకి తన సోదరి ( ఇంటిలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది ) చున్నీ మేడ నుంచి తీశాడు. ఇరుగుపొరుగు వారు చిన్నారి మృతి సమాచారం బర్రెలు కాస్తున్న గడ్డం వెంకటేష్ రజితలకు తెలిపారు.

బీర్పూర్ పోలీసులు వచ్చి శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టంకు తరలించారు. తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు చిన్నారి మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి మృతదేహంతో ఆ అమాయక గిరిజన దంపతులు శనివారం వరకు జాగారం చేశారు. శనివారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహం అప్పగించారు. శనివారం రాత్రి కందెన కుంటలో చిన్నారి మృతదేహం ఖననం చేశారు.
👉 దొంగతనం కోసమా .. ?

గడ్డం వెంకటేష్ వృత్తి పశువుల, బర్రెల కాపరి, పశువుల యజమానులు ఇచ్చిన జీతం డబ్బులు దాదాపు కొన్నివేలు తెచ్చి ఇంటిలోని పురాతన బీరువా లో ( ఆ గుడిసెలో విలువైన వస్తు అది ఒక్కటే ) దాచుకొని వెళ్ళాడు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆ డబ్బుల కోసం ఆ గుడిసిలోకి రాగానే వారిని మృతి చెందిన చిన్నారి గుర్తించడంతో. తమ బండారం బయటపడుతుంది అనే ఉద్దేశంతో వారు హతమార్చారా ? హతమార్చి మెడకు చున్ని తగిలించి ఫ్యానుకు ఉరితీసారా ? అని నాయకపు గూడెం వాసులు భయం భయంగా గుసగుస లాడుతున్నారు.
👉 తెల్లటి చున్ని ఎక్కడిది ?

ఆ ఇంటిలో చున్నీ ఎవరికి లేదు. చున్నీ ధరించే వయస్సు ఆ చిన్నారి ది కాదు, ఆ ఇంటిలో అంతటి శుభ్రమైన వస్త్రాలే లేవు. ఆ ఇంటిలో టీవీ లేదు. అది ఇల్లు అనడానికి బదులు తడకల పందిరి అనవచ్చు. చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకునే జ్ఞానం ఆ చిన్నారికి ఉన్నట్టు అనిపించదు, అగుపించదు.

చిన్నారి ఉరి వేసుకున్నట్టు చెప్పబడుతున్న స్థలం లో ఓ బల్లపై సామాన్లు ఉన్నాయి వాటిపైకి చిన్నారి ఎక్కి ఫ్యానుకు చున్ని పేలాడదీసి మెడకు తగ్గించుకొని మృతి చెందడం అనేది ఎలా సాధ్యమవుతుందో ? పోలీసుల విచారణలో వెలుగు చూస్తుంది కాబోలు.
👉 కేసు ఎలా నమోదు చేశారో ?

చిన్నారి మృతి తీరును ఆత్మహత్యగా ? అనుమానస్పద మృతిగా ,? బీర్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారో ? లేదు ? అనే విషయం తెలియదు. సంఘటన స్థలంలో సైబర్ సాంకేతిక పరిజ్ఞానంతోనో, శాటిలైట్ ఇమేజ్, ఎంటిఎన్ఎల్ మొబైల్ సిమ్ లోకేషన్, క్లూస్ టీమ్స్ , పోలీస్ డాగ్స్ తో కానీ పోలీసులు విచారణ జరిపారా ? లేదా ? అనే అంశంలో స్పష్టత లేదు. చిన్నారి మృతి సంఘటన ప్రచార మాధ్యమాల్లో కూడా ఆగుపించకపోవడం ప్రత్యేకత.
దీనికి తోడు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష ప్రాథమిక నివేదికలో ఏముందో ? ప్రస్తుతం జగిత్యాల ఆస్పత్రిలో ప్రముఖ ఫోరెన్సిక్ వైద్యనిపుణుడు అందుబాటులో ఉన్నారు. పోలీస్ వర్గాలకు ప్రాథమిక పోస్టుమార్టం సమాచారం ముందస్తుగా తెలిసే అవకాశం ఉండి ఉండవచ్చు.
👉 కుల సమావేశం ఎందుకో ?
ఇదిలా ఉండగా ఓ పోలీస్ అధికారి కందనేకుంట నాయకపు గ్రామ పెద్దలు కొందరితో, ” మీరు కూర్చుండి ఏం జరిగింది ? అనే విషయం మాట్లాడుకొని నాకు చెప్పండి. లేదా ఇంటికి ఒకరిని పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తా ” అని ఆదేశించినట్టు చర్చ.
ఈ మేరకు మంగళవారం సాయంత్రం కుల సమావేశానికి గ్రామ పెద్ద పిలిచిన ఎవరు రానట్టు తెలిసింది.
👉 ఫోన్ చేస్తే స్పందించని ఎస్ఐ !
కందనకుంటలో చిన్నారి అనుమానాస్పద మృతి కేసు నమోదు తీరు, ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక, తదితర పోలీస్ లు చేపట్టిన విచారణ తీరు పై గురువారం బీర్పూర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ను 08712656828 కు ఫోన్ చేసిన సదరు ఎస్సై ఫోన్ కు స్పందించలేదు.
2023 నుంచి అమలులోకి వచ్చిన 194 BNNS ( భారతీయ నాగరిక సురక్ష సంహిత ) చట్టం మేరకు ( గతంలో 174 IPC ఉండేది ) గిరిజన చిన్నారి మృతి లో విచారణ చేపట్టారో ? లేదో ? తెలియదు.
👉 ఎస్పీ పర్యవేక్షణలో విచారణ జరిపితే న్యాయం జరగవచ్చు !

జిల్లా ప్రజల, మహిళల, విద్యార్థుల ,నిరుద్యోగ యువత అభిమానం చురగొన్న జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో చిన్నారి. మృతి తీరుపై విచారణ జరిపితే వాస్తవాలు, వెలుగు చూడడంతో పాటు అమాయక గిరిజన దంపతుల కడుపు శోఖానికి ఉపశమనం కలిగి వారికి న్యాయం జరగడంతో పాటు అభం శుభం తెలియని చిన్నారి ఆత్మకు శాంతి కలుగుతుంది కాబోలు.