జపాన్ లోని జైకా సంస్థతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు !

J.SURENDER KUMAR,


రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఆర్థిక సహాయ సంస్థ జైకా (JICA) (జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ – Japan International Cooperation Agency) తో చర్చలు జరిపింది.

జపాన్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  నాయకత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం టోక్యోలోని జైకా ప్రధాన కార్యాలయంలో గురువారం జైకా యాజమాన్యంతో సమావేశమైంది.


👉 ఈ సమావేశంలో ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్  షోహెయ్ హరా , జైకా సీనియర్ మేనేజర్లు పాల్గొన్నారు.


👉  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు రెండవ దశ, మూసీ నది పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని జైకాను కోరింది.


👉  హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి  వివరించారు.


👉  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ₹ 24,269 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మెట్రో రైలు రెండవ దశ ప్రతిపాదనలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తుది పరిశీలనలో ఉన్నాయని ముఖ్యమంత్రి  జైకా బృందానికి తెలియజేశారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం వ్యయంలో 48 శాతం, అంటే  ₹ 11,693 కోట్లను రుణంగా అందించి సహకరించాలని కోరారు. భారత ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని హామీ ఇచ్చారు.


👉  మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు మూసీ నది పునరుజ్జీవనం, కొత్త రేడియల్ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు సమకూర్చాలని ముఖ్యమంత్రి గారు జైకా యాజమాన్యాన్ని కోరారు. హైదరాబాద్‌ను న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ నగరాల స్థాయికి అభివృద్ధి చేయాలనే తన దీర్ఘకాలిక లక్ష్యాన్ని వారితో పంచుకున్నారు.


👉  ఈ సందర్భంగా జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా గారు మాట్లాడుతూ, తెలంగాణతో జైకాకు సుదీర్ఘమైన సంబంధం ఉందని గుర్తుచేశారు. మెట్రో రైలు విస్తరణతో పాటు ఇతర అర్హమైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాలని సూచించారు.