కొండగట్టులో మకాం వేసి భద్రతా పై సమీక్షించిన కలెక్టర్!

J.SURENDER KUMAR,


హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి. ఆలయంలో భక్తుల రద్దీ తీవ్రమైన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం తెల్లవారుజాము వరకు  వరకు ఆలయంలో ఉండి అధికారులతో సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్బంగా ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవల సమీకరణను సమీక్షించారు.  పోలీస్ శాఖ, రవాణా, వైద్యం తదితర సంబంధిత విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, వాటి సమన్వయంతో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.


మాల విరమణ, దర్శనం తదితర కార్యక్రమాలు భక్తులకు అంతరాయం లేకుండా సాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ లో ఇబ్బందులు తలెత్తకుండా, రాకపోకలు సులభతరం అయ్యేలా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.


అనుకోని సంఘటనలకు ఆస్కారం లేకుండా రాత్రి వేళల్లో కూడా పోలీసు బలగాలు, సిబ్బంది పూర్తిస్థాయిలో మోహరించాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం అన్ని విభాగాల యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.


భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలు, భక్తుల సౌకర్యాలు గురించి కలెక్టర్ స్వయంగా భక్తులతో మట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తుల భద్రతే అత్యంత ప్రాధాన్యమని, అన్ని శాఖల సమన్వయంతో హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని  కలెక్టర్ అన్నారు.