👉 రేపు శ్రీపాదరావు 26వ వర్ధంతి సందర్భంగా ..
J.SURENDER KUMAR
సమాజ జీవన గమనంలో మార్పులు సహజం తరాలు మారుతున్న, తరతరాలుగా ప్రజలు మర్చిపోలేని చిరస్థాయిగా గుర్తుండిపోయే ఎందరో మహానుభావులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు ఒక్కరు. కారణం ఆయన రాజకీయ జీవనం ఆపాదమస్తకం ప్రజా సంక్షేమమే బహుశా కావచ్చు, ఆయనను నక్సల్స్ హతమార్చిన సంఘటన రేపటికి 26 సంవత్సరాలు.
కాకులు దూరని దండకారణ్యం, నదులు, వాగులు, కొండ కోనలలో కాలినడకన,.ఎండ్ల బండ్లపై గ్రామ గ్రామానికి వెళుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే నాయకుడు శ్రీపాదరావు అంటే అతియో శక్తి కావచ్చు, కానీ ఇది అక్షర సత్యం. నేటి రాజకీయ తరానికి ఆశ్చర్యం గా అనిపించవచ్చు.
👉 మంథని గడ్డ.. మహనీయుల అడ్డ !
గోదావరి, ప్రాణహిత, మానేరు నదులు పారుతూ అడవులు విస్తారంగా ఉన్న మంథని ఓ విలక్షణ ప్రాంతం. వేద పండితులకు, శాస్త్ర సాంకేతిక నిపుణులకు, పాకశాస్త్ర ప్రవీణులకు , వేదమంత్రాల ఘోషతో మంత్రపురిగా పేరొందిన మంథని ఎమ్మెల్యేగా స్వర్గీయ పీవీ నరసింహారావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా సేవలందించిన విషయం జగమెరిగిన సత్యం.
ప్రముఖ విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య లాంటి ఎందరో మహానుభావులను రాష్ట్రానికి, భారతదేశానికి అందించిన ఘన చరిత్ర మంథనిది. అలాంటి మహానుభావులలో ఒకడు స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు.
నిస్వార్థంగా, నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పని చేసే ప్రజా ప్రతినిధుల యుగం దాదాపుగా కనుమరుగైపోతున్నది. తను, తన వారి ప్రయోజనాల కోసమే రాజకీయాలలోకి వచ్చి అధికారం చలాయించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో నాటి తరం ప్రజా నాయకులను స్మరించుకోవడం నేటి సమాజ కనీస బాధ్యతగా, భవిష్యత్ తరాలకు మనం గుర్తు చేసే మన బాధ్యత గా భావించాల్సిందే.
👉 స్వర్గీయ శ్రీపాదరావు …
జయశంకర్ జిల్లా కాటారం మండలం ధన్యవాదాలు మార్చి 2, 1935 న శ్రీ పాదరావు జన్మించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ధన్వాడ సర్పంచ్ గా పోటి చేసి వరుసగా రెండుసార్లు సర్పంచ్ గా విజయం సాధించారు.
మహాదేవపూర్ సమితి అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత ఎల్ ఎం బి ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.
ఆయన రాజకీయ ఎదుగుదలకు ఎల్ ఎం బి బ్యాంకు ఛైర్మన్ ఎంతో సహకరించింది. దీంతో నియోజకవర్గానికి శ్రీపాదరావు సుపరిచితుడు.
అర్ధాంతంగా పదవులు వస్తే అహంకారంతో ప్రవర్తించే కొందరు నాయకులకు భిన్నంగా శ్రీపాదరావు ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్ట, సుఖాలలో పాలు పంచుకొని ప్రజానాయకునిగా ఎదిగాడు.
1983 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుండి ఏమ్మేల్లెగా పోటి చేసే అవకాశం వచ్చింది. అప్పుడే పురుడు పోసుకున్న తెలుగు దేశం పార్టీ ప్రభావం, ఎన్టిఆర్ ప్రభంజనం ముందు శ్రీపాదరావు విజయం సాధిస్తాడా ? అనే అంశం ఫై కాంగ్రెస్ పార్టీలో విపక్షాలలో చర్చ జరిగింది. దీనికి తోడు తెలుగుదేశం, సంజయ్ విచార మంచ్ మధ్య ఎన్నికల ఒప్పందం కారణంగా మంథని శాసనసభ నియోజకవర్గం నుండి పోటి కి విచార మంచ్ అభ్యర్థిగా చంద్రుపట్ల రాజి రెడ్డి నిలిచారు. వీరిద్దరి మధ్య నువ్వా ? నేనా ? అనే తరహాలో పోటీ జరిగింది చివరకు శ్రీపాదరావు విజయం సాధించారు.
ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు శాసన సభ్యులుగాఎన్నికైన శ్రీపాదరావు శాసనసభ స్పీకర్ గా అన్ని పార్టీల మధ్హతుతో పదవి చేపట్టారు. ఎంతోమంది ప్రముఖులు, రాజకీయా విశ్లేసకులతో ప్రశంశలు పొందారు. ఒకవైపు స్పీకర్ పదవి బాధ్యతతో నిర్వహిస్తునే మరోవైపు తన స్వంత నియోజకవర్గ ప్రజలను మాత్రం మరిచిపోకుండా, మరింత దగ్గరయ్యారు. విమర్శలకు నిరాశ చెందకుండా, ప్రశంసలకు పరవశించి పోకుండా తన అసెంబ్లీ పరిధి అభివృద్ధి, ప్రజాసంక్షేమంపై దృష్టి సాధించి తన రాజకీయ ప్రయాణం కొనసాగించారు.

మంథని అసెంబ్లీ అటవీ ప్రాంత పరిధిలో అభివృద్ధి పనులు పరిగెత్తించారు. శ్రీపాద రావు స్పీకర్ ఉన్న సమయంలోనే 1994 ఎన్నికల ముందు నక్సల్స్, పోలీసుల మధ్య జరిగిన ప్రత్యేక్ష యుద్ధ ప్రభావం తీవ్రంగా శ్రీపాదరావు రాజకీయ పయనంపై చూపిందని చెప్పుకోవచ్చు. తీవ్రఉద్రిక్త పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలలో. శ్రీపాదరావు ఓడిపోయాడు.
ఓడిన ప్రజలకు మాత్రం దూరం కాలేదు. వారి మధ్య లోనే ఉంటూ వారికి తన శక్తి మేరకు సేవ చేస్తూనే వచ్చాడు. పాలకపక్షం, ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి శాసన సభ్యులు రామ్ రెడ్డి ఫై ఎలాంటి రాజకీయ ఆరోపణలు, పల్లెత్హు మాట, విమర్శలు చేయకుండా హుందాగా వ్యవహరించి, ప్రజాభిమాన్ని సొంతం చేసుకున్న నాయకుడు స్వర్గీయ శ్రీపాదరావు. ఒ దశలో ముఖ్యమంత్రి పదవికీ అన్ని అర్హతలు ఉన్న నేతగా సొంత పార్టీ, ప్రతిపక్ష పార్టీలు లోను గుర్తింపు పొందిన విలక్షణ నేత శ్రీపాదరావు.

తెలంగాణ లో అతి పెద్ద నియోజకవర్గమైన మంథనిలో టెలిఫోన్ సౌకర్యం లేని ఆ కాలంలో ఉత్తరాల ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకుంటూ వాటి పరిష్కారానికై ఆర్టీసీ బస్సులో నాటి జిల్లా కేంద్రం కరీంనగర్, హైదరాబాద్‌కు రాకపోకలు సాగించిన శ్రీపాదరావు తరహా నాయకుడు బహుశా నేటి రాజకీయ రంగ లో ఉంటారా ? అనేది చర్చ.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు తన నియోజకవర్గ చివరి గ్రామాలకు సాగు నీరు అందండం లేదన్న ఫిర్యాదుతో ఆయన కొన్ని గంటల పాటు బస్సు ప్రయాణం చేసి జగిత్యాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కార్యానికి వచ్చి ప్రాజెక్టు అధికారుల తో సాగునీటి విడుదలకు ఒత్తిడి తెచ్చిన సందర్భాలు అనేకం.
ఎలాంటి వ్యక్తిగత భద్రత లేకుండా అటవీ గ్రామాలలో తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉండేవారు. ( స్పీకర్ గా కొనసాగిన సమయంలో ప్రభుత్వ ప్రోటోకాల్ మేరకు మాత్రమే భద్రతను ఆయన అనుమతించేవారు )

నాడు మంథని అసెంబ్లీ పరిధిలో విధులు నిర్వహించడానికి ప్రభుత్వ ఉద్యోగులు శిక్షగా భావించే వారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులను నాడు కలెక్టర్లు, ఆర్డీవోలు మిమ్మల్ని మంథని, మహాదేవపూర్ తాలుకాలకు బదిలీ చేస్తామంటూ హెచ్చరించడం పరిపాటిగా ఉండేది.
ఇలాంటి పరిస్థితులలో తన నియోజకవర్గంలో విధులు నిర్వహించడానికి శ్రీపాదరావు ప్రభుత్వ ఉద్యోగులను ఒప్పించి, బుజ్జగించి తీసుకువచ్చేవారు.
👉 పీవీ నరసింహారావు కు ఆప్తుడు !
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు కు శ్రీపాదరావు ఆప్తుడు. అయినా తన రాజకీయ, ప్రజాజీవితంలో నరసింహారావు, సహాయ సహకారాన్ని ఏనాడు వాడుకొని నాయకుడు శ్రీపాదరావు. నాటి లోక్‌సభ స్పీకర్, మాజీ కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్‌తో కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో హస్టల్‌లో ఒక గదిలో ఉండి శ్రీపాదరావు చదువుకున్నారు.
శ్రీపాదరావు తన భద్రత గూర్చి పట్టించుకునేవారు కాదు. తాను ప్రజల మనిషినని, వారి మధ్య ఉంటూ సమయం వచ్చినప్పుడు అదే మట్టిలో కన్ను మూస్తానని ఆయన తరచు అనేవారు.
ఓ కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి కి దట్టమైన అటవీ గ్రామం మహాదేవపూర్ మండలం అన్నారం కు 1999 ఏప్రిల్ 13న శ్రీపాదరావు అడవి మార్గం గుండా వెళ్లారు. ఆ దారిలో నక్సలైట్లు శ్రీపాదరావు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు.
‘మా సమస్యల గురించి మీతో మాట్లాడాలి’ మాతో మీరు ఒంటరిగా రావాలని శ్రీపాదరావు నక్సలైట్లు కోరారు. ఆయన వెంట ఉన్న అనుచరులను మీరు రావద్దని ఆదేశించారు.
అనేక సందర్భాల్లో పలువురు నక్సల్స్ సానుభూతిపరులను, మిలిటెంట్లను పోలీస్ స్టేషన్, కేసుల నుంచి, శ్రీపాదరావు విడిపించారు.
ఈ నేపథ్యంలో సార్ తో నక్సల్స్ మాట్లాడుతారని అనుచరులు అక్కడ ఆగిపోయారు. కొన్ని గంటల వ్యవధిలోని శ్రీపాదరావు ను హతమార్చిన సమాచారం బయటికి ప్రపంచానికి తెలిసింది. అప్పటి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి శ్రీపాదరావు పార్టీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.
👉 తండ్రి బాటలో తనయుడు మంత్రి శ్రీధర్ బాబు !

శ్రీపాదరావు మరణాంతరం ఆయన కుమారుడు దుద్దిలో శ్రీధర్ బాబు, న్యాయవాద వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. 1999, 2003, 2009, 2018, 2024 ఎన్నికల్లో మంథని ఓటర్లు శ్రీధర్ బాబు ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వంలో శాసనసభ వ్యవహారాలు మంత్రిగా కొనసాగారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి స్వర్గీయ శ్రీపాదరావు అడుగుజాడల్లో రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఇంటి ఇలవేల్పు, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఇష్ట దైవం !