శ్రీవారి సేవకులకు మరింత  శిక్షణ  టిటిడి ఈవో  శ్యామలరావు !

👉 శ్రీవారి సేవలో వివిధ రంగాల నిపుణుల భాగస్వామ్యం !


J.SURENDER KUMAR,

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో  జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు.
తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష, సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా దక్షిణ భారత దేశం నుంచి శ్రీవారి సేవ చేసేందుకు శ్రీవారి సేవకులు అధిక సంఖ్యలో తిరుమల వస్తున్నారని వారందరికి ప్రణాళికా బద్ధంగా శిక్షణ ఇచ్చి అత్యుత్తమ సేవకులుగా తీర్చి దిద్దేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని సూచించారు.

అంతేకాక మెడికల్, విద్య, ఇంజనీరింగ్, ఐటీ, క్యాటరింగ్, కల్చరల్, గోసేవ తదితర రంగాల నుండి నిపుణులను శ్రీవారి సేవలో భాగస్వామ్యం చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ప్రవాసాంధ్రులు కూడా శ్రీవారి సేవ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకుగాను ఐటీ అప్లికేషన్ లో అవసరమైన మార్పులు చేయాలన్నారు.


ఇప్పటికే మరింత మెరుగైన శ్రీవారి సేవపై శిక్షణ కోసం పుట్టపర్తి, ఈశా పౌండేషన్ , ఆర్ట్ ఆప్ లివింగ్ తదితర సంస్థల నుండి అభిప్రాయాలను సేకరించారని, సదరు నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించాలని సూచించారు.
శిక్షణలో మెడిటేషన్, యోగా, నైపుణ్యాభివృద్ధి, వైద్య సేవలు, సామర్థ్యాల పెంపు, అభిప్రాయ సేకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే శిక్షణ తీసుకున్న సీనియర్ శ్రీవారి సేవకులను మాస్టర్ ట్రైనర్స్ గా తీర్చిదిద్దాలని సూచించారు.


శ్రీవారి మహాత్యం, తిరుమల ప్రాముఖ్యత, శ్రీవారి సేవ విధి, విధానాలు, సేవా నిరతి, మరింత నాణ్యమైన సేవలు, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ శిక్షణ జిల్లా స్థాయిలోను, ప్రాంతీయ స్థాయిలలోను, తిరుమలలోను ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.


ఈ కార్యక్రమంలో అదనపు ఈవో  సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో  వి. వీరబ్రహ్మం, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా. రామ్, డీన్  అల్లాడి మోహన్, జీఎం ట్రాన్స్ ఫోర్ట్  శేషా రెడ్డి, అన్నదానం ప్రత్యేక అధికారి  జీఎల్ ఎన్ శాస్త్రీ, డిప్యూటీ ఈవో  రాజేంద్ర కుమార్, డివైసిఫ్  శ్రీనివాసులు, బర్డ్ వైద్యులు డా. రామమూర్తి, సీఎంవో డా. నర్మద తదితరులు పాల్గొన్నారు.