తెలంగాణకు పరిశ్రమలు రావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  !

👉 జపాన్ తెలుగు సమాఖ్య సమావేశంలో..


J.SURENDER KUMAR,

“తెలంగాణకు పరిశ్రమలు రావాలి. పెట్టుబడులు పెరగాలి. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచాలన్నదే  ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి ప్రవాసులు ఎవరికి చేతనైనంత వారు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.


👉 జపాన్ దేశ పర్యటనలో భాగంగా టోక్యో నగరంలో  ‘జపాన్ తెలుగు సమాఖ్య’  ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి  ముఖ్యఅతిథిగా పాల్గొని  ప్రసంగించారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా చెప్పారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఎంతో ఉంటుందని అన్నారు.


👉  న్యూయార్క్‌లో హడ్సన్ రివర్ ఫ్రంట్, లండన్‌లో థేమ్స్, సియోల్ నగరంలో రివర్ ఫ్రంట్లతో పాటు టోక్యో నగరంలో వాటర్ ఫ్రంట్లను పరిశీలించామని, ఇదే కోవలో హైదరాబాద్ నగర అభివృద్ధికి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ నగరం స్తంభించిపోయే పరిస్థితులను గమనిస్తున్నాం, ఇలాంటి పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకోవలసిన అవసం ఉందని అన్నారు.


👉  మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల వంటి ప్రాజెక్టులు తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని ముఖ్యమంత్రి  చెప్పారు. ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో సాధించాల్సినంత ప్రగతి సాధించామని, ఇతర రంగాల్లో అభివృద్ధి సాధించాలని చెప్పారు.


👉  ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ అభివృద్ధి సాధించడంలో అందరి సహకారం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జపాన్ తెలుగు సమాఖ్య ప్రతినిధులు, టోక్యో నగరంలో స్థిరపడిన ప్రవాస తెలుగు వారు పాల్గొన్నారు.