Y.U అక్షరాలతో మహిళ ఇన్స్పెక్టర్ హత్య మిస్టరీ వీడింది !

👉 హంతకుడు సీనియర్ పోలీస్ అధికారి !

👉 9 సంవత్సరాల క్రితం జరిగిన పోలీసు అధికారి హత్యోదంతం మహారాష్ట్రను కుదిపేసింది.

👉 Y, U ఇంగ్లీష్ అక్షరాలలే  హంతకుడి నీ
పట్టించాయి !


J.SURENDER KUMAR,


దాదాపు 9 ఏళ్ల కిందట జరిగిన మహిళా పోలీసు అధికారి అశ్విని బిద్రే గోరె హత్య మహారాష్ట్రను కుదిపేసింది. అశ్విని మృతదేహం కానీ, హత్యకు ఉపయోగించిన ఆయుధం కానీ, ఇతర ఏ ఆధారాలు లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది.

ఒ మహిళ కనిపించకుండా పోవడం, అందులోనూ పోలీసు అధికారి కావడంతో అనేక ప్రశ్నలు తలెత్తాయి.
ఆమె భర్త, కుటుంబ సభ్యుల పోరాటం, కోర్టులో ప్రభుత్వ ప్రాసిక్యూటర్ల బలమైన వాదనలు, మరో మహిళా పోలీసు అధికారి సమగ్ర దర్యాప్తు కారణంగా అశ్విని హత్య కేసులో నిందితుడిగా ఉన్న డిస్మిస్ అయిన సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అభయ్ కురుంద్కర్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది
.


👉 ఏమి జరిగిందంటే ..

అశ్విని 2016 ఏప్రిల్ 15న నవీ ముంబయిలోని కళంబోలి ప్రాంతం నుంచి అదృశ్యమయింది. అయితే,  అశ్విని అదృశ్యానికి సీనియర్ పోలీసు అధికారి అభయ్ కారణమని ఆమె కుటుంబ ఆరోపణలు.
ఈ కేసు దర్యాప్తు కూడా సరిగ్గా చేయడం లేదని అశ్విని కుటుంబం అప్పట్లో ఆరోపించింది.


అశ్విని జయకుమార్ బిద్రేది కొల్హాపూర్ జిల్లా, హాత్కణంగలే తాలూకాలోని ఆల్తే గ్రామం. ఆమెకు 2005లో హాత్కణంగలేకి చెందిన రాజు గోరేతో వివాహమైంది. అయితే, పెళ్లికి ముందు నుంచే, అంటే 2000 నుంచి ఆమె పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
పెళ్లైన ఏడాది తర్వాత, అశ్విని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ అయ్యారు.


పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన తర్వాత, ఆమె మొదటి పోస్టింగ్ పుణెలో. ఆ తర్వాత సాంగ్లీలో పనిచేశారు. ఆ సమయంలో ఆమెకు అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సీనియర్ పోలీస్ అధికారి అభయ్ కురుంద్కర్‌తో పరిచయమైంది.
ఇద్దరూ దగ్గరయ్యారు. ఆ తర్వాత 2013లో, అశ్విని పదోన్నతిపై రత్నగిరికి వెళ్లారు.
అశ్వినిని కలిసేందుకు అభయ్ తరచూ అక్కడికి వెళ్లేవారు. అశ్విని భర్తకు, ఆమె తండ్రికి ఈ విషయాలు తెలుసు.
అయితే, కొద్దికాలం తర్వాత అశ్విని కనిపించకుండాపోయారు. చివరకు, ఆమె హత్యకు గురైనట్లు తేలింది.

ఆమెను హత్య చేసినట్లు అభయ్ చిన్ననాటి స్నేహితుడు మహేశ్ ఫల్నీకర్ చెప్పారు.
ఆమెను హత్య చేసి, మొద్దులు కోసేందుకు ఉపయోగించే యంత్రంతో ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి, వసాయి సరస్సు ( సముద్రంలో )
వేశారు.

👉 ల్యాప్‌టాప్‌లో కీలక సమాచారం !

తన తల్లి ఆచూకీ తెలియక అశ్విని కుమార్తె సిద్ధి, ఆమె భర్త రాజు గోరె ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు, వారు కళంబోలి స్టేషన్‌కు వెళ్లి, అక్కడ విచారించారు. అక్కడ వారికి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో అశ్విని కనిపించకుండా పోయినట్లు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.

అశ్విని ఉంటున్న ఫ్లాట్ తాళం పగలగొట్టి, ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో అశ్విని, ఇంకా సీనియర్ అధికారి అభయ్ మధ్యనున్న సంబంధం గురించి మరింత సమాచారం వెల్లడైంది. ఆ తర్వాతే, అశ్వినికి ఏదో జరిగిందనే అనుమానంతో కళంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు, పోలీస్ అధికారి అభయ్‌తో పాటు రాజు పాటిల్, మహేశ్ ఫల్నీకర్, కుందన్ భండారిలపై కేసు నమోదైంది.

హత్యకు గురి అయిన మహిళా ఇన్స్పెక్టర్ అశ్విని (ఫైల్ ఫోటో)


అయితే, ఆ తర్వాత బిద్రే, గోరె కుటుంబాలకు రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చాయి. ఒత్తిడి ఉన్నప్పటికీ, రాజు గోరె వారం వారం విచారణ నిమిత్తం పన్వేల్, ముంబయి వెళ్లొస్తూనే ఉన్నారు.
ఈ కేసు దర్యాప్తు పై కోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అభయ్ అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో పాటు ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. చివరకు, హైకోర్టు ఆదేశాల అనంతరం అసలు కోణంలో ఈ కేసు విచారణ మొదలైంది.

👉 9 సంవత్సరాలు తర్వాత నిందితుడి అరెస్టు !

గోరె కుటుంబం 9 ఏళ్ల పోరాటం తర్వాత ఈ కేసు విజయవంతమైంది. పన్వేల్ కోర్టు అభయ్ సహా ఆయనకు సహకరించిన వారిని దోషులుగా నిర్ధరించింది. తొమ్మిదేళ్ల తర్వాత అశ్వినికి న్యాయం జరిగింది. అయితే, నిందితులకు ఇంకా శిక్షలు ఖరారు కాలేదు.

👉 ఇలా దొరికిపోయారు..

హత్యకు కొద్దిగంటల ముందు అశ్విని థానేలో అభయ్‌ను కలిశారు. ఆరోజు సాయంత్రం థానే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక హోటల్‌లో ఇద్దరూ టీ తాగారు.
ఆ తర్వాత, వాళ్లిద్దరూ ఒకే కారులో మీరా రోడ్డులోని అభయ్ ఇంటికి వెళ్లినట్లు పోలీసు విచారణలో, ఎంటీఎన్ఎల్ మొబైల్ సిమ్ లొకేషన్ ద్వారా వెల్లడైంది.


2016 ఏప్రిల్ 11, రాత్రి అశ్విని హత్యకు గురయ్యారు.
మరుసటి రోజు, ఆమె మృతదేహాన్ని పారవేయడంలో అభయ్‌కు కుందన్ భండారి సాయం చేశారని, వారి ఎంటీఎన్ఎల్ మొబైల్ సిమ్ లొకేషన్ ద్వారా వెల్లడైంది.
నిందితులిద్దరూ ఆ సమయంలో అక్కడే ఉన్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.

అయితే, అశ్విని బతికే ఉందని నమ్మించేందుకు అభయ్ ఒక ఎత్తుగడ వేశారు.
అశ్విని మొబైల్ ఫోన్‌‌తో చాటింగ్‌ను కొనసాగించారు. ఈ చాటింగ్‌తోనే అభయ్ దొరికిపోయారు.
అశ్విని మొబైల్ ఫోన్ నుంచి ఆమె మరిది అవినాశ్ గంగాపురేకి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
తన మానసిక పరిస్థితి అంత బాలేదని, చికిత్స కోసం ఐదారునెలల పాటు ఉత్తరాంచల్, లేదా హిమాచల్ ప్రదేశ్ వెళ్లాలనుకుంటున్నట్లు అందులో ఉంది.

👉 Y అక్షరం పట్టించింది..

అశ్విని మెసేజ్ చేస్తున్నట్లుగా అభయ్ చాట్ చేశారు. అందులో ‘Y’ అనే అక్షరంతో ఆయన పోలీసుల చేతికి చిక్కారు. ఆయన ‘how are you’ అని అశ్విని మొబైల్ నుంచి మెసేజ్ చేశారు.


పోలీసులు ఈ ‘Y’ అనే అక్షరంతో కేసును ఛేదించారు. అశ్విని ఎప్పుడూ ‘you’ అనే సందర్భంలో ‘U’ వాడేవారు. కానీ, అశ్విని చాటింగ్‌లో అనూహ్యంగా ‘Y’ కనిపించడాన్ని పోలీసులు గమనించారు.


అభయ్ ‘U’ కి బదులు ‘Y’ వాడేవారు.
అభయ్ బంధువులు, స్నేహితులతో సహా నలుగురైదురి నుంచి పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నారు.
అభయ్ ‘you’ అనే సందర్భంలో ముందు ‘Y’ వాడేవారని పోలీసులు నిర్ధరించుకోవడంతో పాటు అశ్విని ‘you’అని సంబోధించే సమయంలో ఎప్పుడూ ‘y’ వాడేవారు కాదని ఆమె బంధువులు, స్నేహితుల ద్వారా ధ్రువీకరించుకున్నారు.
పోలీసుల వద్ద సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. అశ్విని అదృశ్యం కావడానికి ముందు అభయ్ ఆమెతోనే ఉన్నారు. ఆమె బతికే ఉందని చూపించేందుకు అభయ్ ఆమె మొబైల్‌తో చాట్ చేస్తూనే ఉన్నారని దర్యాప్తులో తేలింది.


అలాగే, అభయ్ బ్యాట్‌తో అశ్విని తలపై కొట్టి చంపేసినట్లు అభయ్ స్నేహితుడు మహేశ్ ఫల్నీకర్ పోలీసుల విచారణలో చెప్పారు.


సైబర్ నిపుణులు రోషన్ బంగేరా హత్యకు గురైన అశ్విని మొబైల్ ఫోన్, ప్రధాన నిందితుడు అభయ్ కురంద్కర్ మొబైల్ ఫోన్, ఫేస్‌బుక్, వాట్సాప్, ల్యాప్‌టాప్‌తో సహా ఇతర సోషల్ మీడియా యాప్‌ల నుంచి కీలకమైన డేటాను సేకరించారు.
ఈ కేసులో ఆధారాలపరంగా ఈ డేటా చాలా కీలకమైనదిగా నిరూపితమైంది. అలాగే, మృతదేహం, హత్యకు ఉపయోగించిన ఆయుధం కనిపించకపోవడంతో సాంకేతిక ఆధారాలు కీలకంగా మారాయి.


అందుకోసం, గూగుల్, నీటి అడుగున స్కానింగ్, ఓషనోగ్రఫీ డిపార్ట్‌మెంట్, శాటిలైట్ ఇమేజెస్ వంటి సాంకేతిక సాయం తీసుకున్నారు.

👉ఏప్రిల్ 5 న కోర్టులో ఏం జరిగింది .

అశ్విని హత్య కేసులో ఏప్రిల్ 5న తుది తీర్పు వెలువడింది. పన్వేల్ సెషన్స్ కోర్టు జడ్జి కేజీ పాల్దేవార్ ఈ కేసులో తీర్పునిచ్చారు.
నిందితుడు అభయ్ కురుంద్కర్ దోషిగా తేలింది. సెక్షన్ 302, 218 కింద మోపిన అభియోగాలు రుజువయ్యాయి. మరో ఇద్దరు సహ నిందితులు కుందన్ భండారి, మహేశ్ ఫల్నీకర్‌లను కూడా దోషులుగా నిర్ధరించారు.
ఈ కేసు విచారణ కోసం ఏర్పాటైన సిట్ మొత్తం 80 మంది నుంచి సాక్ష్యాలు సేకరించింది, అభయ్‌తో సహా ముగ్గురిపై హత్యాభియోగాలు మోపింది.


సిట్ అధికారులు నీలేశ్ రౌత్, సంగీత అల్ఫోన్సో నిర్వహించిన దర్యాప్తులో అశ్విని బ్రిదేను అభయ్ కురంద్కర్ హత్య చేసి, మృతదేహాన్ని మాయం చేసినట్లు తేలింది.
ఈ కేసులో మరో నిందితుడు రాజేశ్ పాటిల్ అలియాస్ రాజు పాటిల్ నిర్దోషిగా విడుదలయ్యారు.


ఈ కేసు తుది విచారణ ఏప్రిల్ 11, మధ్యాహ్నం జరగనుంది. శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు విననుంది.


( బీబీసీ  సౌజన్యంతో )