J.SURENDER KUMAR,
సోలార్ విద్యుత్ ఆధారిత వ్యవసాయం చేసే నియోజకవర్గంగా అచ్చంపేటను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
వచ్చే వంద రోజుల్లో ఈ నియోజకవర్గంలో రైతులందరికీ వంద శాతం సబ్సిడీతో సోలార్ విద్యుత్ పంపుసెట్లను అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
👉 నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే స్ప్రింక్లర్ డ్రిప్‌ను స్విచ్ ఆన్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక పథక ఉద్దేశాన్ని వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు.

👉 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , తుమ్మల నాగేశ్వరరావు , జూపల్లి కృష్ణారావు ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ , ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి గారు, సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తో కలిసి ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు.
👉 దేశానికే ఒక మాడల్‌గా, గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ పథకం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి 29 మంది పోడు భూముల రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ, కీలక విషయాలను చెప్పారు. అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

👉 నియోజకవర్గంలో వచ్చే వంద రోజుల్లో రైతులందరికీ సోలార్ విద్యుత్ పంపుసెట్లను అమర్చాలి.
👉 ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్‌ను వ్యవసాయానికి, గృహావసరాలకు వినియోగించగా కొంత మిగులు ఉండేలా, ఆ మిగులు విద్యుత్‌ను ప్రభుత్వ గ్రిడ్‌కు అనుసంధానం చేయడానికి అనుగుణంగా ఉండే ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి.
👉 మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా నెలకు ₹ 3 నుంచి ₹ 5 వేల రూపాయల మేరకు ఆదాయం లభించాలి.

👉 ఈ గ్రామంలో ప్రారంభించిన ఈ పథకం నియోజకవర్గం మొత్తంలో విస్తరించడంతో పాటు ఈ పథకంపై లబ్దిదారులకు అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి.
👉 ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలి. వచ్చే సంవత్సరం ఇదే రోజు మరోసారి పర్యటించి ఇక్కడ ప్రారంభించిన ఇందిర సౌర గిరి జల వికాసం పురోగతిని పరిశీలిస్తా.
👉 ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు విషయంలో భూమి లేని చెంచులను ప్రత్యేకంగా పరిశీలించడం ద్వారా పది రోజుల్లోగా అందరికీ ఇండ్లు కేటాయిస్తాం.
👉 ఈ కార్యక్రమంలో లోక్‌సభ సభ్యులు మల్లు రవి , బలరాం నాయక్ , స్థానిక శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.