అక్రెడిటేషన్లు, ప్రొఫెషనల్ కమిటీల ఏర్పాటు !

👉 మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ !


J.SURENDER KUMAR,


జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఒక్కొక్కటిగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.


శుక్రవారం  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే. విరాహత్ అలీ, కే. రాంనారాయణల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం మంత్రి శ్రీనివాస్ రెడ్డితో సచివాలయంలోని ఆయన ఛాంబర్ లో  సమావేశమై జర్నలిస్టుల వివిధ సమస్యలపై చర్చించింది.

ఎన్నికల సమయంలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమాన్ని పొందుపర్చడంతో జర్నలిస్టులు ఎంతో హర్షించారని, అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా ఏ ఒక్క సమస్యకు పరిష్కారం దక్కకపోవడంతో జర్నలిస్టుల్లో నిరాశ చోటుచేసుకుందని విరాహత్, రాంనారాయణలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రెడిటేషన్ల నియమావళి రూపకల్పనా కోసం ప్రభుత్వం కమిటీ వేసిందని, ఆ కమిటీ నివేదిక సమర్పించి నెల రోజులు  గడుస్తున్నా ఇంకా జీవో జారీ కాలేదన్నారు.

గత ప్రభుత్వం జారీ చేసిన అక్రెడిటేషన్లను ఏడాదిన్నర కాలంగా జర్నలిస్టులు రెన్యూవల్ చేసుకుంటున్న పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే కొత్త అక్రెడిటేషన్లు జారీ చేసేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు వ్యతిరేకంగా ఇటీవల సుప్రీం కోర్టు  ఇచ్చిన తీర్పు కేవలం అర్బన్ ప్రాంతాల్లో సొసైటీల వరకే వర్తిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కాదని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

జర్నలిస్టులు తమ విధులను స్వేచ్ఛగా నిర్వర్తించేందుకు గాను వారికి రక్షణ కల్పించేందుకు, సామాజిక సేవలో నిమగ్నమైన జర్నలిస్టుల సంక్షేమం కోసం  ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు అనేక జీవో లు జారీ చేసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాయని, గత పదేళ్లుగా వాటిని నిర్వీర్యం చేసారని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
జర్నలిస్టులపై  దాడుల నిరోధక హైపవర్ కమిటీ, వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ, వేజ్ బోర్డు సిఫారసులను పర్యవేక్షించే త్రైపాక్షిక కమిటీని  ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.


చిన్న, మధ్యతరగతి పత్రికల బిల్లులు పెండింగులో ఉండడం, అప్ గ్రేడేషన్ ప్రక్రియ జరగక పోవడంతో వాటి  నిర్వాహకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.
  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు గ్రామ శివారులో ఎల్.బి.నగర్ జర్నలిస్టులకు ఏడాదిన్నర క్రితం ఇంటి స్థలాలు కేటాయించగా  వారు ఇండ్లను సైతం నిర్మించుకున్నారని, అయితే ఆ స్థలాలను ఖాళీ చేయాలని గత కొన్ని  రోజుల నుండి రెవెన్యూ అధికారులు లబ్దిదారులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని, వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వారు మంత్రిని కోరారు.


టీయూడబ్ల్యూజే విన్నవించిన ఆయా సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి, త్వరలోనే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు కే. శ్రీకాంత్ రెడ్డి, జి. మధు గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, రాష్ట్ర నాయకులు మాతంగి దాస్, హెచ్.యూ.జే అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్ లు  పాల్గొన్నారు.

👉 అర్హులైన జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డులు !
మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి హామీ !


అర్హులైన జర్నలిస్టులందరికీ  తెల్ల రేషన్ కార్డులను జారీ చేసేందుకు సత్వర చర్యలు చేపడతామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తం కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.


దీనస్థితిలో జీవితాలు కొనసాగిస్తున్న జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డులను అందించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ శుక్రవారం  మంత్రిని కోరారు.


గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డుల జారీకి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.