👉 బుగ్గారం మండల భూభారతి రెవెన్యూ సదస్సులో...
J.SURENDER KUMAR,
భూభారతి చట్టం దేశంలోని రోల్ మోడల్ గా నిలుస్తుందని, 18 రాష్ట్రాలలో భూ చట్టాలపై అధ్యయనం చేశామని, అక్కడ భూ సమస్యలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టరాదో తెలుసుకున్నామన్నారు. లక్షలాది మంది ప్రజలు, మేధావుల అభిప్రాయాలు ఆకాంక్షల మేరకు భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద శనివారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తోపాటు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ హాజరయ్యారు.
👉 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ….

గతంలో కేసీఆర్ నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు కలిసి ధరణి అనే చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను తిప్పలు పెట్టారని పేర్కొన్నారు.
👉 పేదవారికి న్యాయం జరగాలని, భూమి ఉన్న ఆసాములకు ఇబ్బందులు కలగవద్దని ఉద్దేశంతోనే అద్భుతమైన చట్టాన్ని తెచ్చామని తెలిపారు.
👉 రాష్ట్రంలో మళ్లీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, అందులో భాగంగానే జూన్ రెండు నుంచి రాష్ట్రంలోని పదివేల పైగా రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులకు కేటాయిస్తామని చెప్పారు.
👉 భూ భారతి చట్టం రైతుల చుట్టమని, రైతులు, ప్రజల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో లక్షలాదిమంది ప్రజలు, మేధావుల అభిప్రాయాలు సేకరించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
👉 పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన రెవెన్యూ గ్రామ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
👉 వివిధ భూ సమస్యలకు సంబంధించి 13 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిని సత్వరమే పరిష్కరించేందుకు దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
👉 ప్రతి భూ సమస్యకు పరిష్కారం లభించే విధంగా భూభారతి చట్టాన్ని రూపొందించామని, తాసిల్దార్ స్థాయి నుంచి సిసిఎల్ఏ వరకు అధికారాలను వికేంద్రీకరించి రైతులకు మేలు జరిగేలా చూస్తామన్నారు.

👉 భూ సమస్యలకు సంబంధించి ఆపిల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 28 మండలాల్లో 28 గ్రామాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, వీటిలో అత్యధికంగా సాదా బైనామాలకు సంబంధించిన భూ సమస్యలే వచ్చాయని తెలిపారు.
👉 గత ప్రభుత్వ హయాంలో ధరణి చట్టం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, భూ సమస్యలు పరిష్కారంకాక కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు.
👉 ధరణిలో ఉన్న లోపాల వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేకపోయాయని, గత ప్రభుత్వ హాయంలో ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు పది లక్షల భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు కంప్యూటర్లోనే ఉంచింది తప్పా పరిష్కారం చూపలేకపోయిందన్నారు.
👉 భూభారతి చట్టంలో ట్రిబ్యూనల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని, భూమికి సరిహద్దులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు భూ పంచాయతీలు రాకుండా చట్టంలో పలు అంశాలను పొందుపరిచామని పేర్కొన్నారు.

👉 స్వచ్ఛందంగా భూమిని సర్వే చేసుకునే రైతులకు సంబంధించి పాసుబుక్ లో మ్యాపులను పొందుపరుస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో భూమికి సంబంధించిన సర్వే మ్యాప్ ను కూడా పొందుపరుస్తామన్నారు.
👉 భవిష్యత్తులో భూ సమస్యలు రాకుండా కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
👉 జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని ఇందులో భాగంగా 10956 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులను కేటాయిస్తామని తెలిపారు.
👉 డిసెంబర్ 31 కి భూమి అమ్మకాలు..కొనుగోలు సంబంధించి పక్కాగా లెక్కలు తీసేలా భూభారతి చట్టంలో రూపొందించామని తెలిపారు.
👉 భూ భారతి చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రజలు మెప్పు పొందే చట్టమని, అద్భుతమైన భూభారతి పథకాన్ని రైతులంతా చక్కగా వినియోగించుకోవాలని తెలిపారు. రెవెన్యూ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టకుండా భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు.