ధర్మపురి జాతర అన్నదాన ఆదాయం ఎవరి ఖాతాలోకి  ?

J. SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలలో భక్తుల విరాళాలతో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన అన్నదాన 2025 & 2024 సంవత్సరాల మిగులు ఆదాయం మొత్తం ₹ 2,91,728 /-( రెండు లక్షల 91 వేల  ఏడు వందల ఇరువది ఎనిమి ) ఆలయ ఖాతాలో డిపాజిట్ చేశారా ? అధికారుల అనుమతితో నిర్వాహకుల పేరిట డిపాజిట్ చేశారా ? అనే చర్చ భక్తులలో జరుగుతున్నది.

👉 వివరాలు ఇలా ఉన్నాయి..

2025 మార్చిలో  శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జాతరకు వచ్చే భక్తజనంకు స్థానిక రైస్ మిల్లర్స్, వర్తక, వ్యాపారుల, స్వచ్ఛంద సేవకుల ఆధ్వర్యంలో భక్తుల, దాతల విరాళాలతో  అన్నదానం నిర్వహించారు.

👉 జాతర అన్నదాన నిర్వహణకు దాతలు విరాళంగా ఇచ్చిన మొత్తం, జరిగిన ఖర్చు వివరాలను ఆలయ కార్య నిర్వహణ అధికారికి ఏప్రిల్ చివరి వారంలో నిర్వాహకులు వివరించారు.

👉 2025 లో దాతల విరాళాల మొత్తంలో ఖర్చులు పోగా ₹ 1,77,738/- ( ఒక లక్ష 77 వేలే, ఏడు వందల ముప్పది ఎనిమిది ).నగదు మొత్తం నిల్వ ఉందని గణాంకాలతో ఈవోకు వివరించారు. అయితే మిగులు నగదు మొత్తం ను 2026 లో జరగనున్న  జాతర ఉత్సవాలలో అన్నదాన నిర్వహణకు  ముగ్గురి పేరిట బ్యాంకులో  డిపాజిట్ చేయనున్నట్లు నిర్వాహకులు ఈ వోకు వివరించినట్టు సమాచారం.

👉 దీంతోపాటు 2024 జాతర ఉత్సవాలలో దాతల సహకారంతో నిర్వహించిన అన్నదానంలో ఖర్చులు పోగా మిగులు మొత్తం ₹ 1,13, 990 /- ( ఒక లక్ష 13 వేల  తొమ్మిది వందల తొంబై ) నగదు ఓ వ్యక్తి వద్ద నిల్వ ఉన్నట్టు వివరించి, 2024 నాటి లెక్కలు సైతం ఆలయ కార్య నిర్వహణ అధికారికి  వారు వివరించినట్టు తెలిసింది.

👉 2024 నాటి మిగులు ఆదాయం, ₹ 1,13,990/- 2025 సంవత్సర కాలానికి బ్యాంకు వడ్డీ తో కలిపి  ఆలయ అధికారికి తెలిపారా ?  లేదా 2024 నాటి నిలువ మొత్తం నగదు తెలిపారా ? అనే అంశంలో స్పష్టత లేదు.

👉 ఇది ఇలా ఉండగా శ్రీ లక్ష్మి స్వామి ఆలయంలో నిత్యం వందలాది మంది భక్తజనంకు ఆలయ పక్షాన అన్నదానం కొనసాగుతున్నది.  ఆలయ అన్నదాన ట్రస్ట్ కు దాతలు ఇచ్చిన విరాళాల మొత్తం దాదాపు కోటి రూపాయలకు పైగా ఆలయం పేరిట బ్యాంకులో డిపాజిట్ అయింది. డిపాజిట్ పై వచ్చే వడ్డీ డబ్బులతో అన్నదానం కొనసాగిస్తున్నారు. దాతల విరాళాలతో డిపాజిట్ మొత్తం పెరిగితే అదనంగా భక్తుల సంఖ్య  అన్నదానానికి పెంచే నిబంధనలు ఉన్నాయి.

👉 స్థానిక దేవుడి జాతర పేరిట జరిగిన అన్నదానం కోసం భక్తులు, దాతలు, ఇచ్చిన విరాళాల మిగులు నగదు మొత్తం ఆలయ అన్నదాన పథకం ట్రస్ట్ ఖాతాలో డిపాజిట్ చేయాలని భక్తులు కోరుతున్నారు.

👉 ఇదిలా ఉండగా  2023 సంవత్సరంలో జాతర ఉత్సవాలలో దాతల సహకారంతో నిర్వహించిన ఉచిత అన్నదాన కార్యక్రమంలో  ఖర్చులు పోగా నిలువ నిధులు మొత్తం దాదాపు లక్ష రూపాయల నాటి అన్నదాన నిర్వహకులు ఆలయ అధికారులకు అప్పగించినట్టు సమాచారం.

👉 అయితే గత రెండు సంవత్సరాలుగా జాతర అన్నదాన ఆదాయ మిగులు మొత్తం నిర్వాహకులు ఆలయ ఖాతాలో జమ చేయడం లేదు. ఆ నగదు మొత్తం నిర్వాహకుల  వద్దనే భద్రంగా ఉంది.  ఈ అంశంలో  పలు రకాల చర్చలకు అవకాశం ఏర్పడింది.

👉 ఆలయ అధికారులు,ధర్మకర్తల మండలి  చైర్మన్, ధర్మకర్తలు  2024 & 2025 సంవత్సర అన్నదాన మిగులు మొత్తం ఆలయ అన్నదాన ట్రస్ట్ ఖాతాలో డిపాజిట్ కోసం చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

👉 స్పందించని  ఈవో !

అన్నదాన మిగులు ఆదాయం ఆలయ ఖాతాలోనా  ? నిర్వాహకుల పేరిట డిపాజిట్ చేశారా ? అనే విషయంపై ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించగా  స్పందించలేదు.