👉 మౌలిక సదుపాయాల కోసం ₹ 1.50 కోట్లు విడుదల !
👉 మంత్రి దామోదర రాజనర్సింహ !
J.SURENDER KUMAR,
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలోని మాతా శిశు కేంద్ర వినియోగానికి అవసరమైన నిధులు కేటాయిస్తానని, మౌలిక సదుపాయాల కల్పన కోసం తక్షణం ₹ 1.50 కోట్ల నిధులు విడుదల చేస్తున్నానని, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ఆదివారం స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , తన నియోజకవర్గంలో వైద్యశాలలు, మాతా శిశు కేంద్రంలో సిబ్బంది నియామకం, ఫర్నిచర్, ఆస్పత్రిలో పోస్టుమార్టం గది, కిడ్నీ పేషెంట్లకు, నిరంతర డయాలసిస్ సౌకర్యం, పాశిగాం సమీపంలో 200 ఎకరాల ప్రభుత్వ భూమి లో ట్రామా సెంటర్ ఏర్పాటు తదితర వైద్య పరమైన సమస్యలు మంత్రికి వివరించారు.
దీంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ధర్మపురిలో ఏర్పాటు చేసిన మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి నిర్మాణానికి అప్పటి పాలకులు పరిపాలన అనుమతులు మాత్రమే తీసుకువచ్చారని, పూర్తిస్థాయిలో నిధులు కేటాయింపు, సిబ్బంది నియామకం,చేపట్టలేదని ఫర్నిచర్, వైద్య పరికరాలకు సంబంధించిన నిధులను కేటాయించలేదని దాంతో ఆస్పత్రి ప్రజలకు అందుబాటులో లేదని ఎమ్మెల్యే మంత్రి దామోదర రాజనర్సింహకు తెలిపారు .
👉 మంత్రి స్పందిస్తూ..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, మెడికల్, నర్సింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బంది నియామకంతో పాటు అన్ని ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
గత ప్రభుత్వంలో ఆసుపత్రులను ఏర్పాటు చేసి..సిబ్బందిని నియామకం చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆసుపత్రికి, హెచ్ఆర్ సిబ్బందికి మధ్య అవగాహన లేకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బందిగా మారిందన్నారు.
రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో అన్ని శాఖల్లో కలిపి 56 వేలకు పైగా ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేయడం జరిగిందని, రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అవసరం మేరకు ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని, గోల్డెన్ అవర్ లో పేషెంట్ ను ఆసుపత్రికి చేరెచ్చేలా సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామని, రాష్ట్రంలో మొదటి దశలో 24 ట్రామా సెంటర్లను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.