👉 ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచన మేరకు…
👉 సమస్య పరిష్కారానికి CMO ప్రజావాణి ఇంచార్జి చిన్నారెడ్డి హామీ !
J.SURENDER KUMAR,
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని దుబాయికి బతుకుదెరువు కోసం వెళ్లిన జగిత్యాల జిల్లావాసి తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో జైలు పాలయిన సంఘటన ఇది.
జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు మధుకర్ (27) అనే యువకుడు, ఎవరో తన బ్యాంకు ఖాతాను దుర్వినియోగం చేసి లావాదేవీలు జరిపినందున అజ్మాన్ లోని కోర్టు అతనిపై ప్రయాణ నిషేధం (ట్రావెల్ బ్యాన్) విధించింది.
మధుకర్ తల్లిదండ్రులు మల్లవ్వ, అంజయ్యలు మంగళవారం హైదరాబాద్, బేగంపేట లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతి పత్రం ఇచ్చారు. ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచన మేరకు ప్రజాభవన్ కు చేరుకున్న యువకుడు తల్లిదండ్రులను ఎన్నారై అడ్వయిజరీ వైస్ చైర్మన్, మంద భీంరెడ్డి సహకరించారు.

సీఎంఓ ద్వారా ప్రత్యేక శ్రద్ధతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజావాణి ఇంచార్జి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు.
గల్ఫ్ దేశంలో జైలు పాలయిన మధుకర్ కు కాన్సులర్ (దౌత్య) సహాయంతో పాటు న్యాయవాదిని సమకూర్చి ఉచిత న్యాయ సహాయం అందించి ఇండియాకు తిరిగి రప్పించాలని వారు అభ్యర్తించారు.
న్యూ ఢిల్లీ లోని భారత విదేశాంగ శాఖతో, దుబాయి లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి తన కుమారుడిని ఆదుకోవాలని వారు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. వినతి పత్రం ప్రతిని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (న్యాయ సేవాధికార సంస్థ) కు సైతం పంపించారు.