గిరిజనుల కోసం కొత్త పథకానికి సీఎం  రేవంత్ రెడ్డి  శ్రీకారం !

👉 ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ఆవిష్కరించిన సీఎం !


J.SURENDER KUMAR,

తెలంగాణలోని గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే సరికొత్త పథకానికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 2,30,735 మంది గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాలకు భూ యాజమాన్యపు హక్కులు కల్పించే “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకానికి సంబంధించి “నల్లమల డిక్లరేషన్” ను ముఖ్యమంత్రి  ఆవిష్కరించారు.

👉 నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన  ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహచరులతో కలిసి గ్రామంలోని  సీతారామాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులతో కలిసి నల్లమల డిక్లరేషన్‌ను విడుదల చేశారు.

👉  అనంతరం ముఖ్యమంత్రి  మాట్లాడుతూ, “తెలంగాణను దేశానికే ఆదర్శంగా, నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పదిహేడు నెలల్లో నిరూపించాం. ఇది సరిపోదు. ఇంకా ఎంతో ముందుకు వెళ్లాలి. అందుకు ప్రజలందరూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. డిక్లరేషన్‌లో ప్రకటించిన అంశాలను అమలు చేసి చూపిస్తాం.

👉 ప్రతి రైతుకు సోలార్ పంపుసెట్టు ఇవ్వడం ద్వారా విద్యుత్ అవసరం లేకుండా స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అచ్చంపేటలో చేసిన తరహాలో తెలంగాణ రాష్ట్రంలో చేయడానికి ప్రణాళికలు రూపొందించాలి.

👉 నల్లమల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రత్యేకమైన ప్రణాళికలు రచించాలి. ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేస్తుంది. ఈ ప్రాంతానికి సాగునీరు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. పోడు భూములకు హక్కులు కల్పించి పంట భూములుగా మార్చి గిరిజనులను ఆత్మగౌరవంతో బతికే అవకాశం కల్పించాం.

👉  అచ్చంపేట నియోజకవర్గాన్ని, ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను స్థానిక రైతులు, గిరిజనులు ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది రైతులు బాధ్యతగా తీసుకోండి. ప్రపంచానికే అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం.

👉 ఈ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, కళాశాల వంటి పనులకు అధికారులు ప్రణాళికలు రూపొందించిన తర్వాత వాటిపై అవసరమైన నిర్ణయాలు తీసుకుంటా.

👉 ఈ ప్రభుత్వం రైతులకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. రుణమాఫీ, బోనస్, రైతు భరోసా, ఉచిత విద్యుత్, 200 యూనిట్ల లోపు గృహ వినియోగంలో ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడమే కాకుండా సన్న బియ్యం అందిస్తున్నాం…” అని ముఖ్యమంత్రి అన్నారు.

👉 ఈ కార్యక్రమంలో మంత్రిమండలి సభ్యులు, పలువురు లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.