ఎమ్మెల్సీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా యోచనలో కవిత?

👉 తండ్రి కెసిఆర్ బాటలో కవిత ..!

👉 కారు క్యాడర్ లో కలవరం !

J.SURENDER KUMAR,

త్వరలో సొంత పార్టీ ఏర్పాటు చేయనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తన ఎమ్మెల్సీ పదవికి, టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి సొంత పార్టీని ప్రకటిస్తుందా ? జాగృతి సంస్థను బలోపేతం చేస్తుందా ? అనే మిస్టరీ కొన్ని  రోజులలో బట్టబయలు కానున్నట్టు చర్చ మొదలైంది.

ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాష్ట్ర సాధకుడు,  తన తండ్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మే 2 న రాసిన లేఖ  అందులో అంశాల, ఎపిసోడ్ తెలిసినవే. అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఎమ్మెల్సీ కవిత విమానాశ్రయంలో మీడియా సమావేశంలో తన తండ్రికి రాసినట్టు వెలుగు చూసిన ఆ లేఖ తాను రాసిందే అంటూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ లేఖ బయటకు ఎలా వచ్చింది అంటూ మీడియా  అడగగా. కెసిఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి, వారే లీక్ చేసి ఉండవచ్చు అంటూ ఆమె వివరించిన విషయము జగమెరిగిన సత్యం.
రెండు రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత ఆత్మీయులు, వారి సామాజిక వర్గం కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లి  ఆమెతో రాజి కోసం ప్రయత్నించినట్టు ప్రచార సాధనాలో ఆ అంశాలు  విస్తృతస్థాయి లో ప్రచారం జరిగింది వాస్తవమే.

ఈ నేపథ్యంలో జాగృతి సంస్థ బలోపేతం కోసం కోల్ బెల్ట్  ప్రాంతంలో బాధ్యులను నియమిస్తూ ఆమె పత్రికా ప్రకటన జారీ చేయడంతో పాటు ఆ ప్రాంత బాధ్యులు కొందరితో సుదీర్ఘ చర్చలు జరిపిన విషయం బహిరంగ రహస్యం.
చర్చల సందర్భంగా జాగృతి సంస్థకు చెందిన సీనియర్లు కొందరు, సొంత పార్టీ ప్రకటనకు ముందు బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవి గూర్చి, ప్రతిపక్షాలు, స్వపక్షం లో వచ్చే విమర్శల గూర్చి వివరిస్తుండగా, నాకు తెలుసు ఏం చేయాలో ? ఎలా చేయాలో ? మీరు చెప్పేది నాకు అర్థమైంది అంటూ ఆ చర్చను ఎమ్మెల్సీ కవిత కట్ చేసినట్టు జాగృతి శ్రేణులు చర్చ మొదలైంది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నాడు హైదరాబాద్  జలవిహార లో పార్టీ ప్రకటన కు ముందు తన డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఎమ్మెల్సీ కవిత కార్యాచరణ కు రంగం సిద్ధం చేసినట్టు జాగృతి సంస్థలో చర్చ మొదలైంది.

జూలైలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి పక్షాన వార్డు సభ్యులు మొదలు సర్పంచ్, జెడ్పిటిసి, ఎంపీటీసీ, కౌన్సిలర్, సింగల్ విండో డైరెక్టర్ పదవులకు పోటీకి ఎమ్మెల్సీ కవిత కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చర్చ. పార్టీ ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేయాలా ? జాగృతి సంస్థ పక్షాన పోటీకి దిగాలా ? అని తర్జనభర్జన  జరుగుతున్నట్టు తెలిసింది.

స్థానిక సంస్థలలో ఓటు బ్యాంకు అంచనా తో పాటు గ్రామస్థాయిలో సైతం తమ పెట్టబోయే పార్టీకి, ఎమ్మెల్సీ కవిత కు విస్తృతస్థాయిలో ప్రచారం వస్తుందనేది వారి చర్చల్లో ఈ అంశం పై విస్తృతంగా చర్చించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో జాగృతి సంస్థ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ కవిత కు నమ్మకస్తులు గత నాలుగు రోజులుగా పాత్రికేయులు, ఇతరులు వారికి ఫోన్ చేసినా ,వాట్సప్ కాల్ చేయండి అంటున్నారు.

ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ ప్రభుత్వంలో రాజకీయ ఆధిపత్యం చలాయించిన కొందరు నాయకులు,  పార్టీలో కొనసాగడమా ? ఎమ్మెల్సీ కవిత పక్షాన చేరడమా ? అనే కలవరం వారిలో మొదలైంది.

ఇది ఇలా ఉండగా
అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖను ముందస్తుగానే పార్టీ అధినేతకు పంపించిందని, ఈ నేపథ్యంలోనే రాజీనామా వద్దు, అంటూ రాజీ యత్నాలకు ఆ పార్టీ నాయకులు కవిత ఇంటికి వచ్చి మంతనాలు జరిపినట్టు చర్చ సైతం మొదలైంది. రాజి చర్చలలో ఏమి జరిగింది ? వాళ్ళు ఎందుకు  వచ్చారు అనే చర్చల సారాంశం ఎమ్మెల్సీ కవిత స్వయంగా వివరిస్తే తప్ప వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదు.

ఇదిలా ఉండగా పార్టీ ప్రకటనకు ముహూర్త బలంతో పాటు శ్రావణమాసం ఎంచుకున్నట్టు సమాచారం. లిక్కర్ కుంభకోణంలో కొన్ని నెలలపాటు జైలు లో గడిపిన ఎమ్మెల్సీ కవిత కోర్టు లో   శేషప్ప కవి రాసిన ధర్మపురి నరసింహ శతకం పుస్తకం కావాలని న్యాయమూర్తి నీ న్యాయవాది ద్వారా విజ్ఞప్తి చేసిన విషయం విధితమే. 

జూన్ 1 ఆదివారం  ప్రచార సాధనాలలో ఎమ్మెల్సీ కవిత  సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించనున్నదా ? ఎమ్మెల్సీ పదవి, బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటన చేస్తుందా ? అనే చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కవిత,  అంశం టీ కప్పులో తుఫాన్ లా సమసి పోదు అని జాగృతి శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

రాజకీయ చదరంగంలో ఏ క్షణం ఏం జరగనున్నదో  ? ఎమ్మెల్సీ కవిత తిరిగి పార్టీలో ప్రశ్నిస్తూ కొనసాగుతారా ?  ప్రత్యేకంగా పార్టీని పెడతారా ? ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.