నక్సలైట్ ఉద్యమంలో వెలుగు రేఖ నారాయణ సార్ మృతి !

J.SURENDER KUMAR,


ఉత్తర తెలంగాణ జిల్లాలో తొలి తరం నక్సలైట్ నాయకులలో కీలక ఉద్యమ నిర్మాత, వేలుగు రేఖ, కల్లూరి నారాయణ సార్ ( పండుగ నారాయణ సార్ ) గురువారం మృతి చెందారు.
గత కొన్ని నెలలుగా అనారోగ్య బారిన పడిన ( కాలేయం అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో,  జాండిస్ వ్యాధితో )
ఉత్తర తెలంగాణ జిల్లాలో విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగు రేఖ కల్లూరి నారాయణ సార్ జగిత్యాల జైత్రయాత్ర ను ముందుండి నడిపిన సారథి, 

ప్రజా ఉద్యమాలకు సిద్ధాంతాన్ని అందించిన లెక్చరర్ గా నక్సలైట్ ఉద్యమంలో  కీలక నాయకుడిగా ఆయన నిలిచారు. విద్యావంతుల్లో , పౌరహక్కుల ఉద్యమ నిర్మాతల్లో ఆయన చేసిన ఉద్యమాల జ్ఞాపకాలు చెరిగి పోనివి.


ఉత్తర తెలంగాణను భూస్వామ్య పెత్తందారీతనం నుండి విముక్తి చేయడానికి జరిగిన పోరాటంలో నారాయణ సార్,  గొప్ప గురువుగా అభిమానం పొందారు. అజ్ఞాతంలో అరణ్యాలలో, జైలు లోపల కూడా సిద్దాంత అధ్యయన తరగతులు నిర్వహించారు.


  ప్రజల చైతన్యం కోసం నిరంతరం తపించిన ఆయనను అందరూ ప్రేమగా “నారాయణ సార్” అని పిలిచేవారు.
పల్లెమీది నారాయణ, కల్లూరు  నారాయణ అని కూడా పిలుస్తారు.


1950లో కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం సర్పరాజ్‌ పల్లెలో జన్మించిన పండుగ నారాయణ విద్యార్థి దశ నుండే  చైతన్యాన్ని ఆయన జీవితాంతం ఉద్యమంగా మలిచారు.
తొలుత ఒక ప్రైవేటు పాఠశాలను నడిపిన ఆయన, 1968లో ప్రజల పక్షాన నిలిచారు.

నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో వ్యాపిస్తున్న సమయంలో ఆయన ఒక సిద్ధాంత కర్తగా, ప్రజలను చైతన్యపరిచే వాగ్ధాటి కలిగిన వక్తగా గ్రామీణ గుండెల్లో  నిలిచిపోయారు. జైలు జీవితం అనుభవించినప్పటికీ, అక్కడ కూడా మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనలను బోధిస్తూ ఉద్యమానికి బలమైన పునాదులు వేశారు.


1978 లో జరిగిన జగిత్యాల రైతు కూలీ మహాసభ, ఆ తర్వాత చరిత్రలో నిలిచిపోయిన జగిత్యాల జైత్రయాత్రకు ఆయన ప్రధాన కీలక వ్యక్తులు  ఒకరు. ఈ యాత్ర తెలంగాణ గ్రామీణ ప్రజల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాట స్ఫూర్తిని రగిలించింది. విద్యార్థులు, యువకులు గ్రామాల్లో నిర్వహించిన చైతన్య కార్యక్రమాలతో రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో భాగస్వాములు చేసిన కృషిలో నారాయణ పాత్ర కీలకం.


👉 సీతారామయ్య నిలదీసిన ధీరుడు !


పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై నారాయణ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారు
నక్సలైట్ ఉద్యమ ఉధృతి, విస్తరణకు కీలక నాయకత్వ బాధ్యతలు స్థానిక ఉద్యమ నాయకులకు అప్పగించాలని ఆయన వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య ను నిలదీసిన ధీరత్వం ఆయనది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాల్ పూర్ భూస్వామి పై దాడి హత్య సంఘటనలో నారాయణ సార్ ఆ దళంలో పాల్గొన్నారు.


స్థానిక ప్రజలతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు చేయాలన్న ఆయన ఆలోచనలకు విరుద్ధంగా పార్టీ గెరిల్లా పోరాటాలకు ప్రాధాన్యత ఇచ్చింది. రహస్య మార్గాల కంటే ప్రజలతో మమైకమే చేసే  పోరాట పద్ధతుల వైపు ఆయన మొగ్గు చూపేవారు.


పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి గా మల్లోజు కోటేశ్వరరావు, సాయినీ ప్రభాకర్, బాధ్యత లు పార్టీ అప్పగించినప్పుడు ఈ వివాదం నారాయణ సార్ కొండపల్లి సీతారామయ్య మధ్య జరిగినట్లు నాడు నక్సలైట్ ఉద్యమంలో అంతర్గత విభేదాల కథనాలు.


ఈ విభేదాల కారణంగానే 1982లో జైలు పాలై,1984లో జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు.
పార్టీని వీడినా, కేసులు కొట్టేయ బడినా, భూస్వాముల పాత పగలు ఎక్కడ వెంటాడతాయోనని, కొంత కాలం రహస్య జీవితాన్నే ఎంచుకుని, కుటుంబంతో కలిసి, నారాయణ హైదరాబాద్ వెళ్ళి,  సిటీ బస్ కండక్టర్ గా కుశాయి గూడ బస్ డిపోలో మూడో నెంబర్ రూట్ పై పని చేసి రిటైర్డ్ అయ్యారు.


నేటి పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీకి తొలి బీజాలు వేసి చరిత్ర సృష్టించిన కార్య కర్తగా, నాయకుడిగా, మార్గదర్శిగా,
నారాయణ సార్ విప్లవ చరిత్ర గుర్తుంచు కుంటుంది.
నేటి మావోయిస్టు ఉద్యమానికి, పీపుల్స్ వార్‌కు ఆయన నాటిన విప్లవ బీజాలే మూలం. జగిత్యాల జైత్రయాత్ర చరిత్రలో నిలిచి ఉన్నంత కాలం, పల్లె మీది నారాయణ , ( నారాయణ సార్ ) తర తరాలకూ గుర్తుండి పోతారు.