J.SURENDER KUMAR,
ఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
👉 సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించిన అంశాలు !
పహల్గాంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. 1971లో శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వంలో పాకిస్థాన్ ను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చిన చరిత్రను గుర్తు చేశారు.
👉 2047 నాటికి మన భారత దేశాన్ని సూపర్ పవర్ గా, నెంబర్ వన్ గా నిలబెట్టాలన్న మోదీ సంకల్పాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. ‘వికసిత భారత్’ ప్రణాళికను రూపొందించడం అభినందనీయమన్నారు.
👉 అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందని, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని సీఎం ప్రకటించారు.
👉 ‘తెలంగాణ రైజింగ్ విజన్ లోని నాలుగు కీలక అంశాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తామన్నారు.
👉 తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన, బీసీలకు 42% రిజర్వేషన్‌లు, ఎస్సీల ఉప వర్గీకరణకు ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు.

👉 తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసి కార్యాచరణలో పెట్టినట్లు చెప్పారు.
👉 అభివృద్దిలో, సంక్షేమంలో ఆయా వర్గాలకు న్యాయమైన వాటా ఇవ్వాలన్నది తమ సంకల్పమన్నారు. అందుకే తెలంగాణలో సామాజిక, ఆర్ధిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన చేపట్టాం. బీసీలకు విద్య, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ.. ఈ రెండు చరిత్రాత్మక నిర్ణయాలను దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ అమలు చేయడం గర్వంగా ఉందన్నారు.
👉 దేశవ్యాప్త కుల గణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. కులగణనలో తెలంగాణ అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు.
👉 2028 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యాన్ని ప్రకటించారు.
👉 తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర ఉండేలా విధానాలు రూపొందించినట్లు సీఎం ప్రకటించారు. మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం, ₹.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు, మహిళా సంఘాలకు పాఠశాలల నిర్వహణ, శిల్పారామంలో 100 స్టాళ్లతో మహిళా బజార్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. సోలార్ పవర్ జనరేషన్ లోనూ భాగస్వామ్యం కల్పించి మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు చేశామన్నారు.
👉 మన దేశ భవిష్యత్తు మన యువత. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువతదే కీలక పాత్ర. అందుకే యువత ఆశయాల సాధనకు అనుగుణంగా యూత్ పాలసీ అమలు చేస్తున్నాం. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం, ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
👉 ఒకవైపు మానవ వనరులకు డిమాండ్ పెరుగుతున్నా మరోవైపు నిరుద్యోగ సమస్య నెలకొంది. నైపుణ్యాల కొరతే ఈ అంతరానికి కారణమని గుర్తించాం. అందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్, ఐటీఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరించి స్కిల్ శిక్షణ ఇస్తున్నామని సీఎం వివరించారు.
👉 తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటికి అడ్డుకట్ట వేయటంలో139 దేశాల్లో తెలంగాణ నెంబర్-1 స్థానం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.
👉 రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ₹.5 లక్షల స్వయం ఉపాధి పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభిస్తామన్నారు.
👉 దేశానికి రైతే వెన్నెముక అని, ఆ వెన్నెముక కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

👉 రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం. వారిని అప్పుల ఊబి నుండి బయటకు తేవడం, తిరిగి ఆ ఊబిలోకి జారిపోకుండా నిలబెట్టాలన్న లక్ష్యాలతో పని చేస్తున్నామన్నారు.
👉 తెలంగాణలో 25.35 లక్షల మంది రైతులకు, ₹ 20,616 కోట్ల రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తులను చేశాం. సాగు కోసం రైతు మళ్లీ అప్పుల పాలు కాకూడదన్న ఉద్దేశంతో ఎకరాకు ₹ 12 వేల రైతు భరోసా సాయం చేస్తున్నాం. బియ్యానికి మద్ధతు ధరకు అదనంగా క్వింటాల్ కు ₹ 500 చెల్లించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నాం. రైతుకు చేదోడుగా ఉండే వ్యవసాయ కూలీకి ₹12 వేల ఆర్థిక సాయం చేస్తున్నాం.
👉 ఈ రోజు వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచాం. ఈ నేపథ్యంలో రైతుల కోసం చేసే వ్యయాన్ని సంక్షేమ కోణంలో కాక… ఆహార సంపద సృష్టికి పెడుతున్న పెట్టుబడిగా చూడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
👉 2047 నాటికి ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా విషయంలో అంతర్జాతీయ నగరాల సరసన తెలంగాణను నిలబెట్టే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ ఎంచుకున్నట్లు చెప్పారు.
👉 ఈ లక్ష్య సాధనలో తొలి అడుగుగా.. ఏడాదిన్నర కాలంలో అమెరికా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, దావోస్ (స్విట్జర్ లాండ్) దేశాలలో పర్యటించి ₹ 3 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని అన్నారు.
👉 తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగాణగా విభజించి వృద్ధి సాధిస్తామన్నారు.
👉 తెలంగాణలో కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభాగాల్లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, మెట్రో రైల్ సెకండ్ ఫేజ్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మాన్యూఫాక్చరింగ్ హబ్, అగ్రిబేస్డ్ పరిశ్రములు ఏర్పాటు చేస్తామన్నారు.
👉 సబర్మతీ రివర్ ఫ్రంట్, గంగా పునరుద్ధరణ ప్రాజెక్ట్ మాదిరిగా తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందని, మెట్రో సెకండ్ ఫేజ్, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులు ప్రస్తుతం డీపీఆర్ ల స్టేజ్ లో ఉన్నాయి. రేడియల్ రోడ్ల నిర్మాణం. తెలంగాణ ప్రతిపాదిత డ్రై పోర్ట్ నుండి మచిలీపట్నం పోర్టుకు ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం తెలంగాణ అభివృద్ధిలో కీలకమవుతాయన్నారు.
👉 గుడ్ గవర్నెన్స్ తో అత్యున్నత ప్రమాణాలతో పౌర సేవలను అందిస్తామని , ఇందులో భాగంగా BUILD NOW యాప్ ద్వారా నిర్మాణ రంగానికి వేగం పెంచినట్లు సీఎం తెలిపారు.
👉 హైదరాబాద్‌ను డేటా సెంటర్ హబ్‌గా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. విద్య, వైద్యంలో అంతర్జాతీయ ప్రమాణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
👉 ’వికసిత భారత్ లక్ష్య సాధన మనందరి ఆశయం. అందులో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని మా ఆకాంక్ష.
👉 “నేషన్ ఫస్ట్ – పీపుల్ ఫస్ట్” అన్న ప్రాధాన్యతతో ముందుకు వెళుతున్నాం. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య. కేంద్రం సహాయ సహకారం మద్దతు లేకుండా తెలంగాణ రైజింగ్ విజన్ అమలు చేయలేం. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సహకరించండి, వికసిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో ఉంటుందని మాట ఇస్తున్నాను..’ అని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.