న్యాయం కోసం తిరిగి విసిగి విషం తాగి మృతి చెందాడు !

👉 రైతు మృతికి పరోక్ష కారకుల పై పది రోజులైనా చర్యలు శూన్యం !

👉 పోలీస్ విచారణ  నత్త నడక పై విమర్శలు !

J.SURENDER KUMAR,

తాత ముత్తాతల కాలం నుండి అనుభవిస్తున్న తమ భూమి, తమది కాదని, సమస్యలు సృష్టిస్తున్నవారి వేధింపులు భరించలేక, న్యాయం కోసం అధికారులకు  చేసిన  అభ్యర్థనలు, ఆవేదనలు అరణ్య రోదనలుగా మారాయి తప్ప ఆ రైతుకు, అతడి కుటుంబానికి న్యాయం జరగలేదు. ప్రత్యర్థుల అధికార, ఆర్థిక బలం ముందు రైతు అలసిపోయాడు,

ప్రజాస్వామ్య ప్రజా పాలన ప్రభుత్వంలో ఆ రైతుకు న్యాయం జరగలేదు. న్యాయం కోసం తిరిగి తిరిగి విసిగి వేసారి విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. తన మరణ వాంగ్మూలంలో ( వీడియో రికార్డ్ ) తనను తమ కుటుంబ సభ్యులను వేధించి, బెదిరించి, దాడులకు యత్నించిన, వారి పేర్లను  వివరిస్తూ వారి వేధింపులు భరించలేకనే విషం తాగినట్టు వివరిస్తూ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆ రైతు ప్రాణాలు కోల్పోయాడు.

రైతు మల్లారెడ్డి ( ఫైల్ ఫోటో)

రైతు మృతి చెంది 10 రోజులు అయినా  రైతు ఆత్మహత్యకు పరోక్ష కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వైపు  పోలీసులు కనీసం కన్నెత్తి చూడడం లేదని, వారిని అదుపులో తీసుకొని విచారించే సాహసం చేయడం లేదని  మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు.

వివాదం నెలకొన్న స్థలం (ఫైల్ ఫోటో)

👉 వివరాలు ఇలా ఉన్నాయి..

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి పోరండ్ల గ్రామానికి చెందిన పడిగెల మల్లారెడ్డి, అతడి బంధువులకు కొంతకాలంగా ఎకరం ఇరువది (1.20) గుంటల భూవివాదం నెలకొంది. మల్లారెడ్డి , ఆయన కుటుంబ సభ్యులు తమ వ్యవసాయ భూమిలోకి వెళ్లిన, భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించిన   ఆయన బంధువులు భూమి తమది, అంటూ అడ్డంకులు సృష్టించడం,  కర్రలు, ఇతర మారణ ఆయుధాలతో  రైతు పై,  రైతు కుటుంబ సభ్యులపై దాడి చేసిన సంఘటనలో ఉన్నాయి. 

రైతు మల్లారెడ్డి దాడి సమయంలో ( ఫైల్ ఫోటో)

ఈ నేపథ్యంలో  రైతు మల్లారెడ్డి, అధికారులకు మొరపెట్టుకున్న న్యాయం జరగలేదు. తమ సొంత భూమిలో తాను వెళ్లలేని పరిస్థితి, అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై ఫిర్యాదు చేసిన ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడం తో  రైతు విషం తాగాడు. తన మరణ వాంగ్మూలం లోను వేధింపులకు, బెదిరింపులకు పాల్పడ్డ వారి వివరాలు పేర్లు స్పష్టంగా వివరించి చికిత్స పొందుతూ ఈనెల 2 న మృతి చెందాడు. 

విషం తాగి ఆసుపత్రిలో స్థిత పొందుతున్న మల్లారెడ్డి (ఫైల్ ఫోటో)

రైతు మృతికి బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వైపు పోలీస్ యంత్రాంగం కనీసం కన్నెత్తి చూసేందుకే  కలవర పడుతున్నారు ఏమో ?  అనే చర్చ గ్రామంలో జరుగుతోంది.

👉 విచారణను అడ్డుకుంటున్న అదృశ్య హస్తం ఎవరిది ?

పౌరుల సేవలో బాధితులకు న్యాయం చేస్తూ, అక్రమార్కులు, నేరస్తులు, డ్రగ్స్, దోపిడీదారులు, సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదంతో అణచివేస్తూ దేశంలోనే  తెలంగాణ పోలీస్ నెంబర్ వన్  ర్యాంక్  సాధించిన విషయం తెలిసిందే.

అయితే రైతు మృతి సంఘటనలో మాత్రం పోలీసుల విచారణ నత్త నడక తీరు పై విమర్శలు వినిపిస్తున్నాయి.  సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణను అడ్డుకుంటున్న  అదృశ్య హస్తం ఎవరిదో ?  అనే చర్చ నెలకొంది.

👉 ఎస్పీకి ఫిర్యాదు !

తన భర్త మల్లారెడ్డి మృతి చెంది 10 రోజులు అవుతున్న తమను వేధించిన వారిని పోలీసులు అరెస్టు చేయడం లేదని, గ్రామంలో తమ కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తున్నారని మల్లారెడ్డి భార్య పై పడిగెల అనూష సోమవారం జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.

మల్లారెడ్డి భార్య అనూష ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు పత్రం (ఫైల్)


తన భర్త మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి చట్టపరంగా వారిపై కేసు నమోదు చేసి నాకు నా కుటుంబానికి రక్షా కల్పించి న్యాయం చేయాల్సిందిగా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొంది.