న్యాయవాద దంపతుల హత్యకేసులో సుప్రీం తుది తీర్పు ఆగస్టులో !

👉 2021 లో నడిరోడ్డుపై న్యాయవాద దంపతులు గట్టు వామనరావు నాగమణి దంపతుల హత్య !

👉  సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన తండ్రి  కిషన్ రావు !

J.SURENDER KUMAR ,

దారుణ హత్యకు గురి అయిన న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల హత్య కేసులో సుప్రీం కోర్ట్ ఆగస్టులో  తుది తీర్పు ఇవ్వనున్నది.

మంగళవారం సుప్రీంకోర్టులో ఈ కేసు పై న్యాయమూర్తులు ఇదే తుది వాయిదా అని, ఇకముందు ఎలాంటి వాయిదాలకు తావివ్వకుండా ఆగస్టులో తుది ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ రాజేశ్ బిందల్ తో కూడిన ధర్మాసనం మంగళవారం పేర్కొంది.

హత్యకు గురి అయిన న్యాయవాద దంపతులు (ఫైల్ ఫోటో)

మంగళ వారం సుప్రీంకోర్టులో న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణకు వచ్చింది. ట్రయల్ కోర్టు వద్ద ఉన్న మరణ వాంగ్మూల వీడియో రికార్డు తమకు వచ్చిందని, దాన్ని విశ్లేషించి అఫిడ విట్ దాఖలు చేయడానికి చివరగా  కొంత సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. అందుకు న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్ అంగీకరించారు. కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టుకు వాయిదా వేసింది.

హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ న్యాయవాది వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు 2021 , నవంబర్ లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2021లో జరిగిన ఈ హత్యకు సంబంధించి పుట్టా మధూకర్ ప్రధాన పాత్ర పోషించినట్లు మరణ వాంగ్మూలంలో వామనరావు స్పష్టంగా చెప్పారు. అయినా రాష్ట్ర పోలీసులు ఉద్దేశపూర్వకంగా అతడిని నిందితుల జాబితా నుంచి తప్పించారు. అందువల్ల ఈ కేసు నిష్పాక్షిక విచారణ కోసం సీబీఐకి అప్పగించండి” అని వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు 2021 నవంబరు నుంచి విచారిస్తున్నది.

సీబీఐ లేదా సీఐడీ సహాయంతో తిరిగి విచారణ జరపడానికి రాష్ట్రం నుండి ఎటువంటి అభ్యంతరం లేదని, విచారణ లో ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో నిందితులను ప్రతివాదులు గా చేర్చి, వారికి నోటీసులు అందజేయాలని సుప్రీంకోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది.

హత్య కేసులో ఉన్న ఏడుగురు నిందితులు ప్రస్తుతం బెయిల్‌ పై ఉన్నారు. సిఐడి  లేదా సిపిఐ దర్యాప్తుకు  స్పందించాలని కోరుతూ నిందితులకు నోటీసులు అందాయి.

ఇదిలా ఉండగా, కేసుకు సంబంధించిన ఇతర సంబంధిత పత్రాలతో పాటు సీడీలను అందించడానికి పిటిషనర్‌కు సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో అనుమతి ఇచ్చింది.

👉 పట్టపగలు నడి రోడ్డుపై హత్య !

న్యాయవాద దంపతులను నడిరోడ్డుపై నరికి చంపుతున్న దృశ్యం తెరిచి ఉన్న కారు డోర్ ( ఫైల్ ఫోటో)

మంథని కోర్టులో ఫిబ్రవరి 17, 2021 న  ఓ కేసులో వాదించడానికి హాజరై తిరిగి హైదరాబాదుకు కారులో . న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, వి నాగమణి లు వెళుతున్నారు.

వారు ప్రయాణిస్తున్న కారును  రామగిరి మండలం కల్వచర్లలోని మంథని – పెద్దపల్లి రహదారిపై నిందితులు అడ్డుకొని దంపతులను కారులోంచి బయటకి లాగి పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే.