J.SURENDER KUMAR,
భారత సాయుధ బలగాలు కొనసాగిస్తున్న ఆపరేషన్ సిందూర్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం నిర్వహించిన నిర్దేశిత దాడులు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రతి పౌరుడు భారత సైనికులకు అండగా సంఘీభావంగా, ఐక్యంగా నిలబడాలని కోరారు.
👉 “ఒక భారతీయ పౌరుడిగా, నేను ముందుగా మన సాయుధ దళాలకు బలంగా అండగా నిలుస్తున్నాను. ఉగ్రవాద నిర్మూలన కోసం భారత సైన్యం చేపట్టిన ఈ ధైర్యవంతమైన చర్య దేశ భద్రతకు నిదర్శనం. ఈ దాడులు మన సైన్యం సామర్థ్యం, ధైర్యాన్ని ప్రపంచానికి స్పష్టంగా చాటాయి. మనమంతా ఒకే గొంతుకై, ఒకే స్వరం వినిపిద్దాం – జై హింద్!” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

👉 ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మరియు ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూహాత్మక కేంద్రంగా ఉండటంతో, తాజా పరిస్థితులపై, తీసుకోవాల్సిన అప్రమత్త చర్యలపై ఆయా విభాగాలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
👉 తాజా పరిణామాల నేపథ్యంలో ప్రజలెవరూ భయభ్రాంతులకు గురికాకుండా, అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఏవైనా అనుమానాస్పద విషయాలు కనిపిస్తే వెంటనే పోలీసు విభాగానికి సమాచారం అందించాలని సూచించారు.