పైలెట్ ప్రాజెక్టు గా బుగ్గారం మండలం ఎంపిక !

👉 ఈ నెల 5 నుంచి 20వ వ‌ర‌కు రెవెన్యూ సదస్సులు !


J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం బుగ్గారం మండలం  రెవెన్యూ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక అయ్యింది.  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మండలంలో భూ సమస్యలు, పెండింగ్ దరఖాస్తులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదించారు.

👉 పకడ్బందీగా..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో గత ప్రభుత్వంలో ‘ ధరణితో ‘  ఇబ్బందులు పడ్డ ప్రతి రైతుకు న్యాయం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ముందస్తుగా 28 జిల్లాలలో  28 మండలాలను పైలెట్ ప్రాజెక్టులగా ఎంపికకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 28 మండలాలలో బుగ్గారం మండలం ఒకటి.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం  చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణ రావుతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ లు, ఎస్.పి లతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

👉 ఈ నెల 5 నుంచి 20 వ వ‌ర‌కు రెవెన్యూ సదస్సులు !

పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన బుగ్గారం మండలంలో ఈనెల 5 నుండి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. భూ సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు తాసిల్దారులు, అదనపు రెవెన్యూ సిబ్బంది అక్కడి భూ సమస్యలకు 15 రోజులుగా పరిశీలించి ఈ నెల 31 లోగా పరిష్కరిస్తారు. పరిష్కరించే వీలుకాని దరఖాస్తులను సైతం కారణం తెలుసుకొని నివేదిక ఇస్తారు.

భూ భారతి  అమలు తీరులో సాధక బాధలు గుర్తించడం కోసం ముందస్తుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి ప్రభుత్వం ఈ నెల 30 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. అదే తరహాలో ప్రతి జిల్లాలో ఓ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.

👉 ప్రభుత్వ భూముల సమాచారం ..

రెవెన్యూ సదస్సులలో ప్ర‌భుత్వ భూముల వివ‌రాల‌ను, ఎప్ప‌టిక‌ప్పుడు   రికార్డుల‌లో న‌మోదు చేయాల‌ని, అసైన్డ్ ల్యాండ్‌ల‌కు సంబంధించి పొజిష‌న్ మీద ఉండి ప‌ట్టా లేనివారు, ప‌ట్టాఉండి పొజిష‌న్ మీద లేనివారి వివ‌రాల‌ను సేక‌రించాల‌ని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

👉 ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు !

బుగ్గారం మండలాన్ని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక సందర్భంగా బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల సుభాష్,  ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.  పైలెట్ ప్రాజెక్టుతో మండల రైతుల భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం కానున్నట్టు సుభాష్ సంతోషం వ్యక్తం చేశారు.