ప్రభుత్వ పథకాల అమలు లో కలెక్టర్ లు కీలక పాత్ర పోషించాలి !

👉 ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి !


👉 ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ శాఖ పై  కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలకపాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ శాఖ  వంటి పలు అంశాల పై మంగళవారం  సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణా రావు  హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి  అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.

👉 సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….

గతం కంటే దాదాపు 22 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ  తక్కువ సమయంలో కొనుగోలు  పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి అభినందించారు.

👉 90 శాతం పైగా రైతులు ధాన్యాన్ని విక్రయించి సంతోషంగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి రుతు పవనాలు ముందుగా వచ్చిన కారణంగా కల్లాల వద్ద  ధాన్యం తడిసిపోవడంతో కొంత మంది రైతులు ఇబ్బందుల్లో ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అన్నారు.

👉 గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు 48 గంటల్లో చెల్లింపులు పూర్తి చేశామని అన్నారు.  10 లక్షల 50 వేల మంది రైతుల దగ్గర్నుంచి 64 లక్షల మెట్రిక్ టన్నుల పైగా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేశామని, ప్రభుత్వం చేసిన మంచి పనిని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

👉 ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు బలంగా జరుగుతున్నాయని, వీటిని తిప్పికోట్టాల్సిన అవసరం మనందరి పై ఉందని అన్నారు.  జిల్లాలో వచ్చే వ్యతిరేక వార్తలలో సత్యాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ల పై ఉందని అన్నారు.

👉 గత 3 సంవత్సరాల ధాన్యం కొనుగోలు వివరాల తో కలెక్టర్ రెగ్యులర్ గా సర్క్యులేట్ చేయాలని సీఎం ఆదేశించారు.

👉 జిల్లాలో ఉన్న రైస్ మిల్లులను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా రైతులకు అన్యాయం చేయాలని మిల్లర్లు చూస్తే వెంటనే  యాక్షన్ తీసుకోవాలని సీఎం సూచించారు.

👉  అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల పరిహారం అందించేందుకు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి తెలిపారు.

👉 వర్షాలు ముందుగా రావడం వల్ల వ్యవసాయ శాఖ తన ప్రణాళిక లలో మార్పులు చేసుకోవాలని, రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా అందుబాటులో ఉండాలని అన్నారు. 

👉 విత్తనాల, ఎరువులు అక్రమ స్టాక్ ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నకిలి విత్తనాల అమ్మే వారి పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అన్నారు.

👉 భూ భారతి చట్టం ముందస్తుగా 4 పైలెట్ మండలాలను ఎంపిక చేసుకున్నామని, అనంతరం  ప్రతి జిల్లాలో ఒక మండలానికి పైలట్ గా ఎంపిక చేసుకొని రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ప్రజల నుండి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరించాలని సీఎం తెలిపారు.

👉 గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ  ప్రజలను భూతం లా పీడించిందని,  భూ భారతి చట్టం పేదలకు చుట్టంలా పని చేస్తుందని సీఎం తెలిపారు.

👉 పైలెట్ మండలాలో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు.

👉 జూన్ 2 నుంచి జూన్ 20 వరకు  3వ విడత భూ భారతి రెవెన్యూ సదస్సుల నిర్వహించాలని, దీనికి కార్యాచరణ సిద్దం చేయాలని అన్నారు. రెవెన్యూ సదస్సులలో ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించడంతో పాటు భూ భారతి చట్టం పై అవగాహన కల్పించాలని ‌అన్నారు.

👉 ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ప్రభుత్వ పనితీరు కనిపిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.  జిల్లా కలెక్టర్ లు పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు పర్యవేక్షించాలని అన్నారు.

👉 మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలను కలెక్టర్లు నియమించాలని, మేస్త్రీ చార్జిలు, నిర్మాణ పరికరాల ధరల నియంత్రణ ఉండాలని, అడ్డుగోడలు ధరలతో పేదలను మోసం చేయకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.

👉 ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్దిదారులకు టోకెన్ జారీ చేసి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని అన్నారు. అక్రమ ఇసుక రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రోత్సహించే ఆస్కారం లేదని, ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక దోపిడీ జర్గకుండా జాగ్రత్త వహించాలని సీఎం సూచించారు. 

👉 మహిళా సంఘాలు, యువత ద్వారా ఇటుక సెంట్రింగ్ యూనిట్ల తయారీ కేంద్రాల ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు.

👉 తక్కువ ధరతో నాణ్యమైన ఇండ్లు నిర్మాణం చేసేందుకు అనేక కొత్త పద్ధతులు, సాంకేతికత వచ్చాయని , వీటిని లబ్ధిదారులకు తెలియజేయాలని సీఎం తెలిపారు.

👉 మండల కేంద్రాలు నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారుల పరిశీలించేలా కార్యక్రమాలు రూపొందించాలని సీఎం తెలిపారు.

👉 జిల్లా కలెక్టర్లు, ఇంచార్జి మంత్రులు మే 29,30 తేదీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి  వానాకాలం సాగు ఏర్పాట్లు,  నకిలీ విత్తనాలు, ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్ల, భూ భారతి పై రిపోర్టు తయారు చేసి   జూన్ 1 నాటికి సమర్పించాలని అన్నారు. 

👉 జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో   అడిషనల్  కలెక్టర్ బిఎస్ లత, జెడ్పిసిఓ గౌతమ్ రెడ్డి, ఆర్డీవోలు జగిత్యాల్ కోరుట్ల మెట్పల్లి  డిఆర్డిఓ రఘువరన్, హౌసింగ్ పీడీ ప్రసాద్,  డిపిఓ  డిఎస్ఓ డి ఎం  ఎస్ ఆర్ ఎస్ పి అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.