👉 నేడు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో..
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించనున్న నివేదిక !
👉 2018 తర్వాత (6 సంవత్సరాల) తొలిసారి తెలంగాణ సీఎం హాజరుకానున్నారు !
J.SURENDER KUMAR,
తెలంగాణలో 2047 నాటికి సాధించదల్చుకున్న లక్ష్యాలు, సుపరిపాలన విధానాలతో పాటు సమగ్రాభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై శనివారం ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు.
👉 రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ విజన్‌తో ముందుకు సాగుతున్న తీరును, 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడానికి నిర్ధేశించుకున్న లక్ష్యాలను సమగ్రంగా వివరిస్తారు.
👉 ‘వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ 2047’ ఎజెండాతో ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. 2018 తర్వాత తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశాని కి హాజరుకానున్నారు.
👉 ముఖ్యంగా ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్‌లో ముందున్న తెలంగాణ వాటిల్లో మరింత వేగంగా ముందుకు పోయేందుకు చేపడుతున్న చర్యలను వివరించనున్నారు.
👉 తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన, సమగ్రాభివృద్ధిలో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు (RRR), రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీసీలుగా మార్పు, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో యూనివర్సిటీల ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న చొరవను గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముందు వివరిస్తారు.
👉 వ్యవసాయ రంగం అభివృద్ధికి చేసిన రుణమాఫీ, వరికి బోనస్, సంక్షేమంలో భాగంగా అందిస్తున్న సన్న బియ్యం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పథకం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా, ₹ 500 కే సిలిండర్ సరఫరా వంటి రాష్ట్రంలో నిరుపేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేస్తారు.
👉 సామాజిక సాధికారతలో భాగంగా ఎస్సీ కులాల ఉప వర్గీకరణ, కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానించిన అంశాలనూ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు.