👉 జీ తెలుగు న్యూస్ చొరవ అభినందనీయం !
👉 అట్టహాసంగా తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ అవార్డులు-2025 సమావేశంలో..
J.SURENDER KUMAR,
తెలంగాణలో విదేశాలు పెట్టుబడులు పెడుతున్నారంటే ఈ రాష్ట్రం ప్రశాంతంగా.. శాంతిభద్రతలు ఉండడమే కారణం. రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి మా పోలీస్ శాఖ అని గర్వంగా చెబుతున్నా. దేశ సరిహద్దుల్లో దేశ భద్రతను కాపాడే సైనికులు రక్షిస్తున్నారో..
రాష్ట్రంలో అంతర్గత శాంతిభద్రతలను హోంగార్డు మొదలుకుని డీజీపీ వరకు దాదాపు 95 వేల మంది సిబ్బంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కంటికి రెప్పల్లా కాపాడుతున్న తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పౌరుల సేవలో ప్రత్యేకత కనబరుస్తూ.. బాధితులకు న్యాయం చేస్తూ తెలంగాణ పోలీసులు అక్రమార్కులు, నేరస్తులు, దోపిడీదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విశేష సేవలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పోలీస్ రియల్ హీరోలకు జీ తెలుగు న్యూస్ సత్కరించింది.

విధి నిర్వహణలో సాహసానికి ఒడిగట్టి.. నేరస్తులకు శిక్ష వేసి బాధితులకు న్యాయం చేయడంలో విశేష కృషి చేసిన 22 మంది పోలీసులను జీ తెలుగు న్యూస్ ‘రియల్ హీరోస్’ పేరిట అవార్డులను ప్రదానం చేసింది. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన అవార్డుల వేడుకలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
గౌరవాన్ని దక్కించుకుని అవార్డులు పొందిన పోలీసులకు అభినందనలు. ఏ రాష్ట్రమైనా.. ఏ దేశమైనా అభివృద్ది చెందాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యం. ఏ దేశంలో శాంతి భద్రతలు ఉంటాయో.. ఏ దేశంలో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారో ఆయా ప్రాంతాలు అభివృద్ధి పథం వైపు నడుస్తాయి. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచి ప్రపంచస్థాయి పెట్టుబడులు ఆకర్షించడానికి శాంతిభద్రతలే కారణం. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు నూటికి నూరుశాతం ప్రపంచ స్థాయిలో పోటీతో అమలు చేస్తున్నాం కాబట్టే ప్రపంచ రూ.లక్షల కోట్ల పెట్టుబడులు సాధ్యం అన్నారు.
👉 ఉద్యోగ సంఘాలకు సీఎం విజ్ఞప్తి !
ఉద్యోగ సంఘాలు చేపట్టబోతున్న నిరసన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రం మీది.. ఈ ప్రభుత్వం మీది. మీరందరూ కలిసి ఎన్నుకుంటేనే మేమంతా ఇక్కడ ఉన్నాం. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజల సంక్షేమం.. అభివృద్ధి, శాంతి భద్రతలను కాపాడాలి’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
’95 శాతం ప్రజల మీద సమరం ప్రకటించారా. మనం పాలకులం కాదు సేవకులం. హెడ్ కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో మాకు వేరే బాధ్యతలు ఉన్నాయి. అన్ని శాఖలు కలిపితే ప్రభుత్వం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు.. ప్రభుత్వం ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు ఉద్యోగులు సమరం ప్రకటించడం ఎవరిపై చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేయాల్సిన బాధత్యలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలపై లేవా? అని నిలదీశారు.

‘ఇది ప్రజా ప్రభుత్వం. ఇది ప్రజల కోసం ఏర్పటైన ప్రభుత్వం. ₹ 18000 వేల కోట్ల నుంచి ₹.18,500 కోట్లు ఆదాయం వస్తోంది. రాష్ట్రంలో ఉన్న పనులు చేయడానికి ₹ 23,500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ₹ 4 వేల కోట్ల ఆదాయం తక్కువ ఉంది. ₹ 7 వేల కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ₹.5 వేల కోట్లు పోతున్నాయి. ఇక మిగిలే ₹ 6 వేల కోట్లు ఎన్ని సంక్షేమ పథకాలు చెల్లించాల్సి ఉంటుంది?’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
‘ఉద్యోగ సంఘాలు బాధ్యత మరిచి వ్యవహరిస్తామంటే మంచిది కాదు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అప్పు పుట్టడం లేదు. ఎవరూ బజార్‌లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణే దీనికి పరిష్కారం. గౌరవంగా సంసారం నడిపితే పరువును బజార్‌లో పడేస్తే అంటే నేను వద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారు. ‘కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కొత్త కోరికలు కోరుకుని నిరసనలు, ధర్నాలు, బంద్ చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పకూలుతుంది.
ఉన్నది కుప్పకూలుతుందంటే ఇంకా తిరిగి కోలుకోవడానికి ఏం లేదు. ఇంకో దివాళా రాష్ట్రంగా మారుతుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు సహకరించకపోతే నేను ఒక్కడిని ఏం చేస్తాం? మిమ్మల్ని కొట్టం.. తిట్టం. ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెబుతాం’ అని తెలిపారు.
‘మీకోసం పని చేస్తున్నా. మీరు వేరే.. మేం వేరే కాదు. మీరు మేం కలిసి 95 శాతం ప్రజలకు సేవలు చేయాల్సి ఉంది’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల చేతిలో చిక్కుకోవద్దు అని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని.. అస్థిరం చేయాలని చూస్తాయని చెప్పారు.
‘ఆర్టీసీ, సింగరేణి, ప్రభుత్వ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాధ్యతలను మనం నిర్వహించుకుందాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపునకు ఇవ్వవద్దు. ఒక్కరోజైనా ఒక గంట.. ఒక్కరోజైనా సెలవు తీసుకున్నానా? చెప్పండి అని తెలిపారు. వయసు ఉంది.. ఓపిక ఉంది నాతో కలిసి రండి అని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ మీద ఉక్కుపాదం తొక్కండి’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘సమరం కాదు సమయస్ఫూర్తి.. చిత్తశుద్ధి కావాలని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. జీవితకాలం ప్రజలకు ఊడిగం చేసినా ప్రజల రుణం తీర్చుకోలేను’ అని ప్రకటించారు.
తెలంగాణ పోలీస్ దేశంలోనే బాధ్యతలకు స్నేహాపూర్వకంగా ఉంటూ.. నేరస్తులకు గట్టి బదులు ఇస్తోంది. హైదరాబాద్‌కు సంబంధించి బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారు. పోలీస్ శాఖ సక్రమంగా పని చేస్తే పెట్టుబడులు, పర్యాటకులు, విద్య అవకాశాలు మెరుగవుతాయి’ అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
‘పౌరులు ప్రశాంతంగా.. ఆనందంగా పండుగలు చేసుకునేందుకు పోలీసులు తమ పండుగను త్యాగం చేస్తారు. నార్కోటిక్స్, డ్రగ్స్, శాంతి భద్రతలతోపాటు పౌరుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఇండియా జస్టిస్ రిపోర్టు తెలంగాణ పోలీస్ నంబర్ వన్ అని చెప్పింది. ఇది తెలంగాణ పోలీసులు ఏవిధంగా పని చేస్తుందో చాటిచెప్పింది’ అని తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు.
జీ తెలుగు న్యూస్ ఏపీ, తెలంగాణ స్టేట్ డైరెక్టర్ ఉమేశ్ షరాఫ్ మాట్లాడుతూ.. ‘భారతదేశంలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో.. నక్సలిజంపై పోరాటం.. ఇప్పుడు ప్రజలను రక్షించడంలో బాధ్యతలో కూడా తెలంగాణ పోలీస్ మారుపేరుగా నిలుస్తోంది. తెలంగాణ పోలీస్ మరింత ఉన్నత స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నా’ అని తెలిపారు.
👉 అంతకుముందు జీ తెలుగు ఎడిటర్ భరత్ మాట్లాడుతూ.

పోలీస్ శాఖలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన మార్పులను వివరించారు. “రెండు మూడు విషయాలు సూటిగా చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా అంటే లోపాలను ఎత్తిచూపడమే కాదు. మంచి జరిగినప్పుడు దాన్ని కూడా చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో హోమ్ మినిస్టర్‌గా కూడా ఆయన ఉన్నారు. కాబట్టి మంచి ఏం జరిగింది నా అబ్జర్వేషన్‌లో మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
చట్టం ముందు అందరూ సమానమే అని మీరు ఒకటి రెండు సందర్భాల్లో ప్రూవ్ చేశారు. మిగతా వాళ్ళు అటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. చట్టం ముందు రాజు లేదు.. పేదా లేదు చట్టం ఎవరికీ చుట్టం కాదు. పెద్ద వాళ్ళైనా పేద వాళ్ళయినా ఎవరికీ చుట్టం కాదు అందరూ సమానమే అని మీరు చాటి చెప్పారు. ఇప్పుడు ఆ సందర్భానికి నేను పోదలుచుకోలేదు మీకు అందరికీ అర్ధం అర్థమై ఉంటుంది. హోం మినిస్టర్ మీరే.. ముఖ్యమంత్రి మీరే.. ఒక క్లియర్ మెసేజ్ పంపించారు. చట్టం ముందు ఎవరూ గొప్ప కాదు తప్పు చేస్తే ఎవరైనా సరే దానికి వారు అనుభవించాల్సిందే అని మీరు స్పష్టంగా చెప్పారు.
పోస్టింగ్స్‌లో మెరిట్ మెరిట్ ఆధారంగా పోలీసులకు పోస్టింగ్స్ ఇచ్చారు. గత 15, 20 సంవత్సరాల్లో అది లోపించింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధుల నుంచి ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. పోస్టింగ్స్ విషయంలో రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. గతంలో 3/4 మెజారిటీ ఉన్నవాళ్ళు కూడా చేయని విధంగా మీరు పోస్టింగ్స్‌లో మెరిట్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
మూడో విషయం.. డ్రగ్స్‌కు సంబంధించినది. పంజాబ్‌లాంటి పరిస్థితి తెలంగాణలో వచ్చింది. ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో జాయిన్ చేయాలంటే భయపడుతున్నారు. 8th, 9th క్లాస్ కూడా డ్రగ్ కల్చర్ వచ్చింది. దీన్ని ఎవరు దృష్టి పెట్టలేదు. మీరు వచ్చిన తర్వాత దాన్ని దృష్టి పెట్టారు. ఈ సిస్టంలో ఉన్న లోపాలు మార్చే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు.” అని భరత్ అన్నారు.
👉 ‘ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ తెలుగు అవార్డుల కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జీ తెలుగు సరిగమప విజేత దాసరి మేఘన నాయుడు ఎంతో హృద్యంగా దేశ భక్తి పాటలను ఆలపించారు. కూచిపూడి నృత్యంతో చిన్నారులు శుభగిరి కొఠారి, శాన్వీ ఠాగూర్ కోఠారి ఆకట్టుకున్నారు. చిన్నారులు అద్భుతంగా నృత్యం చేసి ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీసులను సేవలపై జీ తెలుగు న్యూస్ రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ విశేషంగా ఆకట్టుకుంది.
👉అవార్డులు అందుకున్న తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ వీరే..
కేవీఎం ప్రసాద్, సైబరాబాద్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీ
ఎం. నర్సింగ రావు, డీఎస్పీ, తెలంగాణ ఐసీసీసీ
తావిటి రవి కుమార్, CI-మహేశ్వరం జోన్
వి. ఉపేందర్ రావు, రామగుండం టాస్క్ ఫోర్స్ ఎస్సై
జే.ప్రవీణ్, ఎస్సై సీసీఎస్ భద్రాద్రి కొత్తగూడెం
జి.విష్ణు వర్ధన్ గిరి, హెడ్ కానిస్టేబుల్, సీసీఎస్ నల్గొండ
సీహెచ్ శ్రీనివాస్, తెలంగాణ ఎస్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్
మర్రి వెంకట రెడ్డి, వీరస్వామి, ప్రదీప్ రెడ్డి, మాదాపూర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుళ్లు
వై.రాం రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఐటీ సెల్
డి. రమేశ్ బాబు, హెడ్ కానిస్టేబుల్, ట్రాఫిక్ -ఐటీ సెల్
తాళ్లపల్లి మహేందర్, కానిస్టేబుల్, టీజీఎస్‌పీ, యూసుఫ్ గూడ
పి.శంకర్ విక్రమ్ కుమార్-ఏఆర్‌పీఎసీ-ఐటీ సెల్ నల్గొండ
బి.శ్రవణ్ కుమార్, ట్రాఫిక్ కానిస్టేబుల్, పంజాగుట్ట
ఎం. నరేశ్ కుమార్, కానిస్టేబుల్, సత్తుపల్లి
మంత్రి ఈశ్వరయ్య, హోంగార్డ్, మహేశ్వరం
జి.గోపీనాథ్, సీఐ, భైంసా
ఎస్.శ్రీకాంత్, ఎస్సై, సారంగాపూర్-నిర్మల్ జిల్లా
హరి ప్రసాద్, ఏసీపీ, పంజాగుట్ట ట్రాఫిక్
బిల్లా కోటేశ్వరరావు, సీఐ