ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అమలు చేసేది అధికారులు !

👉 సరస్వతి పుష్కరాలు సక్సెస్ లో అధికారులదే కీలక పాత్ర !
👉 పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్ బాబు !


J.SURENDER KUMAR,

ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని,  మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల సరస్వతి పుష్కరాలు విజయవంతం అయ్యాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్ బాబు అన్నారు.


👉 శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన సరస్వతి పుష్కరాలు డే ఆఫ్ థాంక్స్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ .
👉 పుష్కరాలు ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి అలోచన మేరకు జిల్లా యంత్రాంగం 12 రోజులు 24 గంటలు నిర్విరామంగా కష్ట పడ్డారని తెలిపారు. క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే అది అమలు అవుతుందని నిరూపించారని, పుష్కరాలు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినట్లు తెలిపారు.

👉 రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని  సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని నిర్బహించినట్లు తెలిపారు.

👉 పుష్కరాలను   అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ₹40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నిజానికి పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదని,  ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదని పేర్కొన్నారు.

👉 శాసనమండలి  ఎన్నికల కోడ్ అమల్లో ఉంది పనులు చేయడానికి ఆటంకం ఏర్పడింది, అయినా ఇంజినీరింగ్ అధికారులు పనులను.పూర్తి చేశారని అభినందించారు. 

👉 చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది అయినా మీరంతా కష్టపడి ఒకరికొకరు సమన్వయం చేసుకుని… ఒక టీం వర్క్ లా పనిచేసి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించారని హర్షం వ్యక్తం చేశారు.

👉 సుమారు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి… ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకున్నారంటే అందుకు కారణం మీరేనని,  మీరు పడిన శ్రమ మీరు చూపిన చొరవ విజయానికి కారణం అయ్యాయన్నారు.

👉 జిల్లా కలెక్టర్, ఎస్పీ మార్గ నిర్దేశనంలో 33 శాఖలకు చెందిన  అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ మూడు నెలలు చాలా  కష్టపడ్డారని,  పుష్కరాలను విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి  హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

👉 భద్రత, నీటి సరఫరా, అన్నదానం, మెడికల్ సౌకర్యాలు, శౌచాలయాలు, విద్యుత్, పారిశుధ్యం, మీడియా కవరేజి ఇలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేశారన్నారు.

👉 యంత్రాంగం కృషి వల్లే తెలంగాణలో తొలిసారిగా కాశీ పండితుల చేతుల మీదుగా ప్రతి రోజు సాయంత్రం నిర్వహించిన ‘‘సరస్వతి నవరత్న మాలా హారతి‘‘ కార్యక్రమం మొత్తం పుష్కరాలకే ప్రధాన ఆకర్షణగా నిలిచిందన్నారు.

👉 ఈ పుష్కరాల ద్వారా ఆర్టీసీకి సుమారు 10 కోట్ల ఆదాయం వచ్చిందని,  ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశాన్ని వినియోగించుకొని లక్షలాది మంది సోదరీమణులు పుష్కరాలకు విచ్చేశారని అన్నారు. 12 రోజుల పాటు దాదాపు 9 వేల ట్రిప్పులు బస్సులు నడిచాయని తెలిపారు.

👉 కొందరు సరస్వతి పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని,  చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారని, అయినా భక్తులు అవన్నీ ఏమి పట్టించుకోకుండా లక్షలలో పుష్కర స్నానాలు చేశారని అన్నారు.

👉 మీడియా మిత్రుల సహకారం గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలని,  ఎప్పటి కప్పుడు పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు తెలియజేసి విజయవంతంగా కావడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు. స్వచ్ఛంద సంస్థల కృషి ప్రశంసనీయం. వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు.

👉 ఇది మొదటి అడుగు మాత్రమేనని రానున్న గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా నిర్వహించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ఈ విషయంలో అసలు రాజీ పడబోమని,  ఈ పుష్కరాల్లోని లోటుపాట్లను గుర్తించి అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందని అన్నారు.

👉 ముఖ్యంగా యంత్రాంగం యొక్క పాత్ర చాలా కీలకమని ప్రభుత్వం మీ వెంట ఉంటుందని  రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందించారు

👉 కాళేశ్వరానికి వెళ్లే జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్సు డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడతామని అన్నారు.

👉 ఓవైపు అభివృద్ధి… మరోవైపు సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే తొలిస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

👉 అందులో భాగంగానే ఉచిత బస్సు, 200 లోపు యునిట్లు ఉచిత విద్యుత్,  రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి లాంటి అనేక ప్రతిష్ఠాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామని, అయినా… కొందరు పనిగట్టుకొని మేం ఏమి చేయడం లేదంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

👉 ఈ పుష్కరాల స్ఫూర్తితో అధికారులు మరింత జోష్ తో… టీం వర్క్ తో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆలోచనలు, ప్రాధాన్యాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అభినందించారు.

👉 ప్రమాదంలో మరణించిన కొమరవెల్లి గ్రామస్థులకు  లక్ష రూపాయలు ఎక్సగ్రేషియా ప్రకటించారు.  అలాగే వడదెబ్బకు గురై మరణించిన  పారిశుద్ధ్య కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

👉 భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు,ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , ఎస్పి కిరణ్ ఖరే ఈ సమావేశంలో మాట్లాడారు. అనంతరం పుష్కరాల విధులు నిర్వహించిన  జిల్లా  అధికారులను, సిబ్బందిని శాలువా, మెమెంటో తో అభినందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సింగరేణి జిఎం    రాజేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ వరంగల్ ఆర్ ఎం   విజయభాను, ఆర్డిఓ రవి, ఎస్పి నరేష్ తదితరులు పాల్గొన్నారు.