బనకచర్లను అడ్డుకోవడానికి ప్రధానమంత్రి తో సహా అందరినీ కలుస్తాం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం బాధ్యతగా రాజకీయ, న్యాయ పోరాటం చేస్తుందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  చెప్పారు. గోదావరి నుంచి రాయలసీమకు నీటిని తరలించాలని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రధానమంత్రి తో సహా అందరినీ కలుస్తామని అన్నారు. నీటి వాటాపై తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.


👉  కృష్ణా, గోదావరి జలాలపై హక్కులు, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపడుతున్న బనకచర్ల లింక్ ప్రాజెక్టు, దాని పర్యవసనాలు, తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష ఎంపీల సమావేశం నిర్వహించారు.

👉  ఈ సమావేశంలో ఎంపీలు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి , అనిల్ కుమార్ యాదవ్ , మల్లు రవి , సురేష్ షెట్కర్ , చామల కిరణ్ కుమార్ రెడ్డి , పోరిక బలరాం నాయక్ , కుందూరు జయవీర్ రెడ్డి , రామసహాయం రఘురామి రెడ్డి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ , బీజేపీ ఎంపీలు డీకే అరుణ , రఘునందన్ రావు , బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర  హాజరయ్యారు.

👉  గోదావరి, కృష్ణా జలాల వినియోగం, పోలవరం – బొల్లెపల్లి రిజర్వాయర్ నుంచి ప్రతిపాదిత బనకచర్ల (Banakacharla)  రెగ్యులేటర్ వరకు నీటిని తరలించే ప్రాజెక్టు వివరాలను ఇంజనీరింగ్ నిపుణులు సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి  బనకచర్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ముందుముందు అనుసరించబోయే వైఖరిని సమావేశంలో స్పష్టంగా వివరించారు.

👉  గోదావరి జలాలను పోలవరం నుంచి బనకచర్ల ద్వారా తరలించడానికి కడుతున్న ప్రాజెక్టు విషయంలో కేంద్ర జలశక్తి మంత్రి ని కలిసి ఇప్పటికే అభ్యంతరం తెలియజేశాం. ప్రధానమంత్రి ని కూడా కలుస్తాం. ప్రాజెక్టుకు వివిధ సంస్థలు నిధులు సమకూర్చే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని, అలాగే ప్రాజెక్టుకు అనుమతించరాదని పర్యావరణ శాఖ మంత్రి ని.. ఇలా సంబంధించిన శాఖలన్నింటినీ కలిసి అభ్యంతరాలను తెలియజేశాం.

👉  తెలంగాణ ప్రయోజనాలను కాపడటంలో ప్రభుత్వం బాధ్యతతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఒక పద్ధతిలో ముందుకు వెళుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఈ విషయంలో అన్ని పార్టీలూ సహకరించాలి. రేపు ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ని కలిసి తెలంగాణకు జరగబోయే నష్టంపై మరోసారి వివరిస్తాం.

👉  రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. అన్ని వ్యవస్థల వద్దకు వెళుతున్నాం. న్యాయం కోసం ఎవరినైనా కలుస్తాం. రివర్ మేనేజ్మెంట్ బోర్డు, పర్యావరణ, జలశక్తి వంటి వ్యవస్థలన్నింటితోనూ సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. అప్పటికీ న్యాయం దక్కకపోతే కోర్టును ఆశ్రయిస్తాం.

👉  పోలవరం నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ వరకు మొత్తంగా 300 టీఎంసీ తరలించుకుపోవడానికి ప్రణాళికలు వేశారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీ, కృష్ణా జలాల్లో 558 టీఎంసీలపై చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి. వరద నీటిని వినియోగిస్తామన్న వాదన.. తెలంగాణ హక్కులను కాలరాసినట్టే. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్ధమైన హక్కులు కల్పించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కట్టుకునే ప్రాజెక్టులపై ఎలాంటి అభ్యంతరం ఉండదు.

👉  బనకచర్ల ప్రాజెక్టు వివాదం ఆకస్మికంగా తెరమీదకు వచ్చింది కాదు. 2016 లో కేంద్ర జలశక్తి మంత్రి గారి సమక్షంలో జరిగిన సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి  గోదావరి జలాల్లో 3 వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు.

👉  2019 లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల మధ్య పలు దఫాలుగా జరిగిన సమావేశాల్లో గోదావరి జలాలను రాయలసీమకు తరలించడానికి అభ్యంతరం లేదని చెప్పడం.. ఇప్పుడు తెలంగాణకు గుదిబండలా మారింది. ఇరు రాష్ట్రాల సీఎంలు తీసుకున్న నిర్ణయాల పరిణామ క్రమంలోనే బనకచర్లకు బీజం పడింది.. అని కూలంకుషంగా ముఖ్యమంత్రి  సమావేశంలో వివరించారు.

👉 అనంతరం ముఖ్యమంత్రి  మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “అన్ని పార్టీల ఎంపీలతో నిర్వహించిన ఈ సమావేశం రాజకీయాలకు తావులేదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో చర్చించాం. సహకరించాలని అన్ని పార్టీలను కోరాం..” అని చెప్పారు.