J.SURENDER KUMAR,
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి తెలంగాణ రైజింగ్ – 2047 దార్శనికతతో ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ లేఖ రాశారు.
👉 ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయిర్ తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆ సందర్భంగానే తెలంగాణ రైజింగ్ (Telangana Rising 2047) విజన్ గురించి ముఖ్యమంత్రి వివరించారు.

👉 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడం, పెట్టుబడులను ఆకర్షించడం, రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యతనిస్తూ, మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ, ఇతర రంగాల్లో లక్ష్యాలు, వాటిని సాధించుకునే మార్గాలను వివరించారు.
👉 ఈ భేటీ సందర్భంగానే తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, అమలుకు సంబంధించి టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్ (TBIGC) సంస్థతో తెలంగాణ ప్రభుత్వం (లెటర్ ఆఫ్ ఇంటెంట్) ఒక ఒప్పందం చేసుకుంది.
👉 తెలంగాణ రైజింగ్ విజన్‌లోని స్పష్టత, నిర్దేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయంటూ తాజాగా రాసిన లేఖలో టోనీబ్లెయిర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అభినందనలు తెలియజేశారు. తెలంగాణ విజన్‌కు అనుగుణంగా లక్ష్యాల సాధనకు భారతదేశంలోని TBIGC ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరిస్తారని తెలిపారు.

👉 తదుపరి కార్యాచరణపై ముందుకు వెళ్లడానికి ఏవైనా సందేహాలుంటే తెలంగాణ అధికారులు TBIGC భారత ప్రతినిధిని సంప్రదించవచ్చని ఆ లేఖలో టోనీబ్లెయిర్ పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.