సీపీఎస్ యూ 7 వేల ఎకరాల భూ సమస్యను పరిష్కరించండి!

👉 నష్టపరిహారం చెల్లించకుండా ప్రైవేట్ కు బదలాయిస్తే రాష్ట్రానికి నష్టం !

👉 ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని కోరిన మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ యూ) లకు కేటాయించిన 7 వేల 182 ఎకరాల 93 గుంటల భూముల సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు

బుధవారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ‘1960లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపక్కల, ఇతర ప్రాంతాల్లో విలువైన భూములను రాయితీ ధరకు హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ (324.87 ఎకరాలు), హిందుస్తాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్ (126.33 ఎకరాలు), ఐడీపీఎల్ (551.03 ఎకరాలు), హెచ్‌ఎంటీ (888.05 ఎకరాలు) సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  (2,272.85 ఎకరాలు),  ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (3,020 ఎకరాలు) తదితర సంస్థలకు కేటాయించింది’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.


‘ప్రస్తుతం రాష్ట్రంలోని సీపీఎస్ యూల్లో కొన్ని మూతపడ్డాయి. మరికొన్నింటిలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా ఆ పరిశ్రమలకు కేటాయించిన భూములు నిరుపయోగంగా మారాయి.
కొన్ని సంస్థలు ఈ భూములను వాణిజ్య పరంగా వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలకు బదలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి’ అని చెప్పారు.


‘సరైన పరిహారం చెల్లించకుండా భూములను ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు భంగం కలగకుండా నిరుపయోగంగా ఉన్న సీపీఎస్ యూ భూముల వినియోగానికి మార్గదర్శకాలు రూపొందించాలి’ అని కోరారు.


ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే ఈ సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లుగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.