ధర్మపురి  నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా  నిలుపుదాం !

👉 తాగు, సాగు నీటికి  ఇబ్బందులు రావద్దు !

👉 పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి !

👉 నిధులు మంజూరు బాధ్యత నాది !

👉 ప్రజా సమస్యల పరిష్కారానికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి !

👉 సంక్షేమ హాస్టళ్లకు అందించే బియ్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలి !

👉 ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధి సమీక్ష సమావేశంలో !

👉 అధికారులకు  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశం  !


J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులు  అధికారులు సత్వరమే పూర్తి చేయించాలని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అధికారులను ఆదేశించారు.

అలాగే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అటు రైతులకు ఇటు ప్రజలకు తాగు సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

👉 శనివారం ధర్మపురి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి గార్డెన్ లో శనివారం ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనులపై జగిత్యాల జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్ లతా వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు.

👉 ప్రత్యేకంగా మంత్రి సాగునీరు, తాగునీరు, విద్యా, వైద్యం పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, సివిల్ సప్లైస్, వ్యవసాయం, సంక్షేమ హాస్టళ్ల పనితీరు, విద్యుత్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా మంత్రి సమీక్ష నిర్వహించారు.

👉 ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులు.. కంప్లీట్ అయిన అభివృద్ధి పనులు.. రాబోయే రోజుల్లో చేపట్టే కార్యాచరణ ప్రణాళిక.. అభివృద్ధి.. వివిధ పనులు పెండింగ్లో ఉండడానికి గల కారణాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

ధర్మపురి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. పెండింగ్ పనులు అన్నీ సత్వరమే పూర్తి చేయాలని, ఎక్కడా ఇబ్బందులున్న తన దృష్టికి తీసుకురావాలని, పనులు పూర్తి చేయించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.

👉 ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతతో సాగునీటిపారుదల అధికారులు పూర్తి చేయించాలని ఆదేశించారు. అదేవిధంగా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.

👉 ధర్మపురి నియోజకవర్గంలో 95% వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తారని, అటు సాగునీరు ఇటు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమీక్షలో అధికారులు తెలిపిన సమస్యలు తొందరగా పరిష్కారం మార్గాలు అన్వేషించి పరిష్కరించుకోవాలని సూచించారు. మళ్లీ నిర్వహించే సమీక్ష సమావేశం వరకు వాటి పెండింగ్ లో పెట్టవద్దని మంత్రి అన్నారు.

👉 రోళ్ళ వాగు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అటవీ శాఖ అనుమతులు వచ్చేలా అధికారులు కృషి చేయాలని, ఇందుకు తాను ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి అధికారులతో మాట్లాడతానని తెలిపారు.
వీటితో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల  నిర్మాణ పనులకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఏ ఒక్క సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

👉 సంక్షేమ హాస్టళ్లకు బియ్యం పంపిణీ చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు బియ్యం నాణ్యతను పరిశీలించాలని పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, టాయిలెట్స్, మరుగుదొడ్లు లేని చోట త్వరగా నిర్మించాలని ఆదేశించారు.

👉 వర్షాకాలం వ్యవసాయ సీజన్ లో రైతులకు విత్తనాలు, ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని తెలిపారు.

👉 విద్యుత్ పరంగా కూడా గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. రాబోయే వర్షాకాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు..

👉 సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని, అదేవిధంగా ప్రజలకు సైతం నాణ్యమైనవి అందించాలని అధికారులకు సూచనలు చేశారు.

👉 అభివృద్ధి పనులు..సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి, జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలని సలహా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

👉 జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ…

ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను స్పీడుగా కంప్లీట్ చేయాలని సూచించారు.

👉 అధికారులు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, అభివృద్ధి పనుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

👉 ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి విషయంలో యాక్టివ్ గా ముందుకు సాగాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు సమస్యలను అధిగమించుకుంటూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డిఓ మధుసూదన్, ఇరిగేషన్ సీఈ సుధాకర్ రెడ్డి, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.