ఎమర్జెన్సీ సేవలకు 112  నంబర్ కు కాల్ చేయండి !


👉 పోలీస్, 112 …

👉 ఫైర్, 112 …

👉 చైల్డ్. 112 …

J.SURENDER KUMAR,

అన్ని అత్యవసర సేవలకు ఒకటే నంబర్ 112 ను తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా, అన్ని అత్యవసర సేవల కోసం ఒకే నంబర్‌గా ‘డయల్ 112’ అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర డీజీపీ జితేందర్ శనివారం అధికారికంగా ప్రకటించారు.

ఇదివరకు పోలీస్ (100), అగ్నిమాపక (101), వైద్య సహాయం (108), మరియు పిల్లల భద్రత (1098) వంటి వేర్వేరు సేవలకు భిన్నమైన సంఖ్యలు ఉండేవి. ఇకపై.. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా.. ప్రజలు కేవలం 112కు ఫోన్ చేస్తే సరిపోతుంది.
ఈ వ్యవస్థ ప్రజలకు సహాయాన్ని చేరువ చేయడమే కాకుండా.. అత్యవసరసమయాల్లో వేగవంతమైన రెస్పాన్స్‌ను అందిస్తుంది. ఇది రాష్ట్ర భద్రతా వ్యవస్థలో ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది.


ఇది కేవలం ఒక ఫోన్ నంబర్ మాత్రమే కాదు, అత్యవసర కాల్స్‌ను ఒకే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సమన్వయం చేసే సమగ్ర సాంకేతిక వేదిక. ఈ వ్యవస్థలో GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ట్రాకింగ్ సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుంది.

ఎవరైనా 112కు ఫోన్ చేసిన వెంటనే, వారి ఖచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించి, సమీపంలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలను తక్షణమే సంఘటన స్థలానికి పంపేలా ఈ వ్యవస్థను రూపొందించారు.

ఇదివరకు ఉన్న డయల్ 100 ద్వారా పట్టణ ప్రాంతాల్లో సగటున 10 నిమిషాల్లో చేరుకుంటుండగా. 112తో ఈ సమయాన్ని 8 నిమిషాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ మార్పు ప్రజలకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. అత్యవసర సమయంలో వివిధ నంబర్‌లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.

ఏ రకమైన ఆపద వచ్చినా.. ఒకే నంబర్‌కు కాల్ చేయడం ద్వారా పోలీసులు, అగ్నిమాపక దళం, వైద్య సిబ్బంది, ఇతర సంబంధిత అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇది ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో కీలకమైన సమయాన్ని ఆదా చేస్తుంది.

తెలంగాణ పోలీస్ శాఖ ఈ నూతన వ్యవస్థపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. సోషల్ మీడియా మాధ్యమాలు, ఇతర ప్రసార సాధనాల ద్వారా ‘ Dial 112 ’ ప్రాముఖ్యతను, వినియోగాన్ని వివరిస్తారు. ట్రాఫిక్ కూడళ్ల వద్ద, మరియు ప్రజా సమూహాలు ఉండే ప్రదేశాల్లో పోస్టర్లను, బ్యానర్లను ఏర్పాటు చేస్తారు.

అంతేకాకుండా.. పోలీసు అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బందికి ఈ వ్యవస్థపై ప్రత్యేక శిక్షణను అందిస్తున్నారు. తద్వారా వారు నూతన సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోగలరు.

👉 అనుసంధానం చేశారు

ప్రస్తుతానికి.. పాత నంబర్లకు (ఉదాహరణకు 100) కాల్స్ చేసిన.. ‘112’కు అనుసంధానం చేయబడతాయి. ఇది ప్రజలు కొత్త వ్యవస్థకు అలవాటు పడటానికి తగిన సమయాన్ని కేటాయిస్తుంది.
విపత్తు నిర్వహణ, నేర నియంత్రణలో ఇది ఒక బలమైన సాధనంగా నిలుస్తుంది.

భవిష్యత్తులో ఈ వ్యవస్థను మరింత ఆధునీకరించి, అత్యాధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా డిజిపి జితేందర్ ప్రకటనలో పేర్కొన్నారు.