హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు !

👉 సంచలన తీర్పు ఇచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి !

👉 నేరం చేసిన వారు శిక్ష నుండి తప్పించుకొలేరు
జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ !

J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించిన హత్య కేసులో జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి  సంచలన తీర్పు ఇచ్చారు.
ఈ హత్య కేసులో ఏడుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఆమె తీర్పు వెలువరించారు.


👉 వివరాలు ఇలా ఉన్నాయి.

2021, జూన్ 15వ తేదీ రాత్రి సుమారు 9:40 గంటలకు ఒక వివాహ కార్యక్రమం సందర్భంగా జరిగిన వాగ్వాదం ఈ దారుణ ఘటనకు దారితీసింది. ఏ1 సుంకే రమేష్ తన పరువుకు భంగం కలిగిందని భావించి, పడాల రాజారెడ్డిని చంపాలని నిర్ణయించుకున్నాడు.


మృతుడు పడాల రాజారెడ్డి, గాయపడిన పడాల చిన్న రాజారెడ్డి అందరూ ఒకే గ్రామానికి చెందిన మున్నూరుకాపు కులస్థులు.
ఏ1 సుంకే రమేష్ మరియు ఏ2 సుంకే రాజు పార, కర్రలతో పడాల రాజారెడ్డిపై దాడికి పాల్పడగా, మిగిలిన నిందితులు వారిని రెచ్చగొట్టి, దాడికి సహకరించారు.


ఈ ఘటనలో తొలుత నిందితులు చంపాలనే ఉద్దేశ్యంతో పడాల రాజారెడ్డిపై దాడి చేశారు. అక్కడే ఉన్న పడాల రాజారెడ్డి తమ్ముడు, పడాల చిన్న రాజారెడ్డి ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, అతనిపై కూడా విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వారిని వెంటనే మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో ఆర్మూర్ వద్ద అదే రోజు రాత్రి  పడాల రాజారెడ్డి మరణించారు.


మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
సుంకే రమేష్, 2 – సుంకే రాజు, 3 – సుంకే రంజిత్, 4 – సుంకే సురేష్ ,5 – సుంకే లక్ష్మి,  6 – సుంకే రాజేశ్వరి, 7 – సుంకే దశరథ్) వీరందరూ ఇబ్రహీంపట్నం గ్రామం, మండలం వాసులు.
జిల్లా న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి  ఏడుగురు నిందితులకు జీవిత ఖైదీతో పాటు
ఏ1 నుండి ఏ6 వరకు ఉన్న నిందితులకు ఒక్కొక్కరికి ₹ 3500/- చొప్పున జరిమానా, ఏ7కు ₹ 4000/- జరిమానా విధించారు.


👉 నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు : ఎస్పీ అశోక్ కుమార్ !


పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని, చేసిన నేరానికి  శిక్షలు తప్పవని అందరూ గమనించాలని ఎస్పి అన్నారు.


ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె. మల్లికార్జున్ ,దర్యాప్తు అధికారులు అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. వెంకట్రావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్. శ్రీను, CMS ఎస్.ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్  T. రంజిత్  మరియు CMS కానిస్టేబుల్  కిరణ్ కుమార్ , లను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు