హైదరాబాద్ జనాభా అవసరాలకు అనుగుణంగా పాలసీ సిద్ధం చేయండి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,

పెరుగుతున్న హైదరాబాద్ నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులకు సూచించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్రమైన పాలసీని తయారు చేయాలని ఆదేశించారు.


👉 నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు.


👉 కోర్ అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  సూచించారు.


👉 H-CITI అభివృద్ధి పనులకు సంబంధించి వివరాలను అధికారులు తెలియజేయగా, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలను తయారు చేయాలన్నారు.


👉 ప్రస్తుతం జీహెచ్ఎంసీ (GHMC)పరిధిలో కొనసాగుతున్న తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల్లో ప్రస్తుత పరిస్థితిని అధికారులు వివరించారు. అసంపూర్తిగా ఉన్న పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పారు. ముఖ్యంగా నగరంలో పారిశుధ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని, వర్షాకాలంలో డెంగ్యూ, చికున్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.