తెలంగాణలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ఏర్పాటుచేయాలి !

👉 కేంద్రమంత్రి జయంత్ చౌదరి !

J.SURENDER KUMAR,

తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి కి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి  జయంత్ చౌదరి సూచించారు.
హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి  నివాసంలో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో పలువురు ఉన్నంతధికారులు పాల్గొన్నారు.

ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉపయోగపడుతుంద‌ని కేంద్ర మంత్రి  సూచించగా, తెలంగాణలో తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసి, దానిని ఐటీఐలతో అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి  తెలిపారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అభినందించారు. జాతీయ నైపుణ్య శిక్షణ కింద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి  విజ్ఞప్తి చేశారు.

ఐటీఐల‌న్నింటికీ ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాల‌ని కేంద్ర మంత్రి  కోరగా, రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వెంటనే అధికారులను ఆదేశించారు.

ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని, ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి  అధికారులను ఆదేశించారు.