J SURENDER KUMAR,
మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడి భారతీయ విద్యార్థులు సురక్షితంగా ఇండియాకు సోమవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ లోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసరించి, తెలంగాణ ప్రభుత్వం
మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని నిశితంగా పర్యవేక్షిస్తూ, ప్రభావిత ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే తెలంగాణ పౌరులకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుంది.
తెలంగాణ భవన్‌కు చేరుకున్నా ఆరుగురు విద్యార్థులలో, నలుగురు ఇరాన్ నుంచి, ఇద్దరు ఇజ్రాయెల్ నుంచి వచ్చారు.
సోమవారం ఉదయం 5:30 గంటలకు హైదరాబాద్ బయలుదేరే వరకు తెలంగాణ భవన్ సిబ్బంది వారి వెంట ఉన్నారు.
మరో ఏడుగురు తెలంగాణ పౌరులు, ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్‌లోని అమ్మాన్‌కు సురక్షితంగా చేరుకున్నారు. త్వరలోనే న్యూఢిల్లీకి చేరుకోనున్న వీరి కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
ఇజ్రాయెల్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు తలెత్తినప్పటికీ, ఈ సవాళ్లను అధిగమించి, ప్రభావిత పౌరులందరికీ సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సంబంధిత అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతర సమన్వయంతో పనిచేస్తోంది.
స్వదేశానికి వచ్చే ప్రతి తెలంగాణ నివాసికి సకాలంలో సహాయం, సరైన వసతి, తదుపరి ప్రయాణ సౌకర్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.