👉 ధర్మపురి అభినందన సభలో…
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR ,
నాకు వచ్చిన క్యాబినెట్ మంత్రి, ఎమ్మెల్యే, విప్ పదవులు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల, నాయకుల కార్యకర్తల కష్టార్జితం, నా బలం, బలగం కార్యకర్తలే అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉద్వేగబరితంగా అన్నారు.
మంత్రిగా లక్ష్మణ్ కుమార్ ప్రమాణ స్వీకారం అనంతరం మంగళవారం ఆయన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు.
ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు, ఆయనను శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఫంక్షన్ హాలులో మంత్రి లక్ష్మణ్ కుమార్ ను గజమాలు,పూలమాలలు, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ఉద్వేగ భరితంగా మాట్లాడుతూ…

2009 నుంచి 2023 వరకు వరుసగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తూ ఓటమి చెందిన ధర్మపురి నియోజకవర్గ ప్రజలు నన్ను తమ కడుపులో దాచుకొని, అభిమానించి ఆదరించి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 22 వేల ఓట్ల మెజార్టీతో సిట్టింగ్ మంత్రిపై గెలిపించిన ధర్మపురి నియోజకవర్గ ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తిన తీర్చుకోలేనని మంత్రి అన్నారు.
నాటీ అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకుల బెదిరింపులు, దాడులు, తప్పుడు పోలీసు కేసులు నమోదు చేస్తూ, ఆర్థికంగా, మానసికంగా నా వెంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను వేధించినా ,ఇబ్బంది పెట్టినా ,కాంగ్రెస్ జెండా వదలకుండా, నా గెలుపుకు రాత్రి పగలు కష్టపడిన మీ కష్టార్జితమే నాకు ఈ మంత్రి హోదా, ఈ ప్రోటోకాల్, హంగు ఆర్భాటాలు అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు !
నాలుగు దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ జెండా నీడలో ఎదిగిన సామాన్య కార్యకర్త అయిన నాకు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మంత్రి పదవి కట్టబెట్టడం నా పూర్వజన్మ సుకృతం అని, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన సోనియా గాంధీ, పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కు, ఎఐసిసి జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్, రాష్ట్ర పరిశీలకులు మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు మంత్రి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
అనేక సందర్భాల్లో నన్ను వెన్నంటి ధైర్యం చెబుతూ, నీకు మేమున్నాము అంటూ నన్ను ప్రోత్సహించిన మంత్రి శ్రీధర్ బాబుకు, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డికి ప్రత్యేకంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
👉 నా శ్రీమతి కాంత కుమారికి ప్రత్యేక అభినందనలు !
కష్టసుఖాలలో ఓటమి చెందిన ప్రతి సందర్భంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలతో మమేకమై ఉన్న నీకు విజయం తప్పదు అంటూ నా భార్య కాంత కుమారి, నన్ను ప్రోత్సహిస్తూ మనోబలాన్ని, విజయపథం మార్గాన్ని చూపిన ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు అని సభా వేదికపై మంత్రి లక్ష్మణ్ కుమార్ హర్షద్వానాల మధ్య అన్నారు.

ఈ అభినందన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, ధర్మపురి ఆలయ పాలకవర్గ చైర్మన్, ధర్మకర్తలు, వివిధ కుల సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యులు,

ధర్మపురి పట్టణ ప్రెస్ క్లబ్ సభ్యులు,
వర్తక వ్యాపారులు, మహిళా సంఘాలు, మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు తదితరులు మంత్రి లక్ష్మణ్ కుమార్ ను, ఘనంగా సన్మానించారు.