👉 కేంద్ర సమాచార మాజీ కమిషనర్, నల్సార్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్!
J.SURENDER KUMAR,
ప్రశ్నించే తత్వాన్ని పౌరసమాజం అలవర్చుకోవాలని కేంద్ర సమాచార మాజీ కమిషనర్, నల్సార్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు.
గజ్వేల్ ప్రెస్ క్లబ్ 25 ఏళ్ల వేడుక సందర్భంగా జగదేవపూర్ మండల కేంద్రంలోని కేశిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గార్డెన్స్ లో “జర్నలిస్టులు-విలువలు-పౌర సమాజం పాత్ర” అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…
ఏకే-47 తుపాకి కాలిస్తే చావడం లేదా చంపడం మాత్రమే జరుగుతుందని, ఒక ప్రశ్న కోట్లాది మందిని ఆలోచింపజేస్తుందని తెలిపారు. చచ్చిపోవడానికి సిద్ధమైన వాడు సైనికుడైతే… పౌర సమాజ సైనికుడు జర్నలిస్టు అని అన్నారు. సమాచార కమిషనర్ గా 25 వేల ప్రశ్నలకు జవాబులు ఇచ్చానని, జర్నలిస్టుగా ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వార్తలు రాశానని గుర్తు చేశారు.
తెలంగాణ కోసం 75 ఏళ్ల పోరాటం ఫలించడంలో తన పాత్ర కూడా ఉందని, రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్-3ని కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేసింది తానేనని చెప్పారు. తెలంగాణ సిద్దించిన పేట సిద్దిపేట అని, 70 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన ఘనత ప్రజలదేనన్నారు.
దేశంలో సమాజం ముఖ్యం… దేశంలో సమాజం ఉందా..? అని ప్రశ్నించారు. ఫస్ట్ ఎస్టేట్, రెండవ ఎస్టేట్ ను కలిపి మూడో ఎస్టేట్ ద్వారా ప్రపంచాన్ని నడుపుతున్నారని విమర్శించారు. 4వ ఎస్టేట్ పునాదులు కదులుతున్న సందర్భంలో ఐదవ స్థభం అయిన సమాజం నాలుగవ స్థంబం అయిన జర్నలిజాన్ని నిలబెట్టాలని అన్నారు.
డబ్బుతో గెలిచే ఎన్నికలు ఉన్నప్పుడు ఏ ఎస్టేట్ ఉండదని, ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ చేస్తున్నాయన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లక్షల కోట్ల రూపాయల విరాళాలు తీసుకోవడానికి వీలు లేదని, సుప్రీం కోర్టు విరాళాల సేకరణను తప్పుబట్టిందన్నారు. ఉద్యమం నుంచే పౌర సమాజం వచ్చిందని, పౌరసమాజం నుంచే హక్కుల సాధన జరుగుతోందన్నారు.
👉 అనేక మంది అభాగ్యులకు అండగా గజ్వేల్ ప్రెస్ క్లబ్ విరాహత్ …..

గజ్వేల్ ప్రెస్ క్లబ్ అనేక మంది అభాగ్యులకు అండగా నిలిచిందని, 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఎందరో గొంతులేని ప్రజలకు గొంతుకగా నిలిచిందని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా విరాహత్ అలీ అన్నారు.
ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను ప్రజలు ఆదరిస్తారని, ఈ నిజం జగదేవపూర్ సదస్సుతో నిరూపితమైందన్నారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ విలువలతో కుడింది కాబట్టే 25యేండ్ల వేడుకలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. జర్నలిజం వృత్తి పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో చర్చ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు.
రైతుల ఆత్మహత్యల ఘోషను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి గజ్వేల్ ప్రెస్ క్లబ్ అవిశ్రాతంగా కృషి చేసిందన్నారు. అనేక అంశాల్లో రాష్ట్రానికే ఆదర్శంగా గజ్వేల్ ప్రెస్ క్లబ్ నిలుస్తుందన్నారు. 37 ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాంత విలేఖరిగా పనిచేసిన తాను టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదగడం వెనక గజ్వేల్ ప్రెస్ క్లబ్ అందించిన ఉద్యమ స్ఫూర్తియేనని విరాహత్ స్పష్టం చేశారు.
మాజీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర్ రావు చెప్పిన విధంగా గతంలో జర్నలిజమనే తులసి వనంలో అక్కడక్కడా గంజాయి మొక్కలు ఉంటే, ప్రస్తుతం గంజాయి వనంలో తులసి మొక్కలను వెతకాల్సి వస్తుందన్నారు.
నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు తమ సంఘం అండగా ఉంటుందని, దోపిడి కోసం మాత్రమే జర్నలిజం వృత్తిలోకి ప్రవేశిస్తున్న శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని విరాహత్ స్పదతం చేశారు.
సోషల్ మీడియా వద్దనే హక్కుఎవరికీ లేదని, అది భావప్రకటన స్వేచ్ఛకు వేదిక అని ఆయన అన్నారు. ప్రధాన మీడియా తన భాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తిస్తే సోషల్ మీడియాకు పెద్దగా పట్టింపు ఉండది కాదన్నారు. అయితే వికృత చేష్టలతో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే హక్కు సోషల్ మీడీయాకు లేదన్నారు. మీడియా, సమాజం, మానవత్వం తెలియని వ్యక్తులు సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని, నిజమైన జర్నలిస్టులను సమాజం కాపాడుకోవాలని ఆయన కోరారు.

సమాజంలో జరుగుతున్న పెడ దోరణులను గుర్తించి అణచివేయడానికే గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఈ సదస్సులు నిర్వహిస్తోందని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ అన్నారు. సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులను ప్రజలు గుర్తించి కాపాడుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాంరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రఘువీరారెడ్డి, ఫాక్స్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీపీ బాలేషం, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు సురేందర్, మధుసూదన్ రెడ్డి, నాయిని యాదగిరి, దాసరి కృష్ణ, మునీర్, నర్సింహా, బాల్ నర్సయ్య, పరశురాం, పరమేశ్వర్, కిరణ్, శ్రీకాంత్, బాలకృష్ణారెడ్డి, చిన్ని కృష్ణ, నర్సింలు, ఎల్లం, నాగవెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.