పేదలకు సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ !

J SURENDER KUMAR,

పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యమనీ, దివ్యాంగులకు అండగా ఉంటానని పేదలకు సేవ చేసే భాగ్యం మంత్రి పదవి ద్వారా లభించడం అదృష్టంగా భావిస్తున్నానని  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ అన్నారు .

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం మంత్రి లక్ష్మణ్ కుమార్  విస్తృతంగా పర్యటించారు. ముందు సాయిబాబా ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.  తర్వాత అంబేద్కర్ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఇటీవల వినాయక విగ్రహ తయారీ కేంద్రం వద్ద జరిగిన విద్యుత్ ప్రమాదంలో మరణించిన ఇద్దరి బాధిత కుటుంబాలకు ఏసుకొని గుట్ట వద్ద విద్యుత్​ శాఖ అధ్వర్యంలో మంజూరైన  ₹ 5 లక్షల చొప్పున పరిహారం చెక్కులను మంత్రి అందజేశారు. అదే విధంగా మంత్రి స్వయంగా గాయపడ్డ బాధితులను ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఏలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.

సోషల్ వెల్ఫేర్​ బాలుర వసతిగృహంలో మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలని, బియ్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

పేద విద్యార్థులకు ఏ ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత హస్టల్​ అధికారులు, సిబ్బందేనని స్పష్టం చేశారు. హాస్టల్​ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటిని చూసుకుంటున్నట్లు చూడాలని సిబ్బందికి సూచించారు. మహిళ శిశు సంక్షేమ వయోవృద్ధుల, దివ్యాంగ, ట్రాన్స్ జెండర్ల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ లబ్ధిదారులకు  స్వయం ఉపాధి కోసం ₹ 50 వేల రూపాయలు చెక్కును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు.

దివ్యాంగులు ప్రభుత్వం కల్పిస్తున్న చేయూతతో ఆర్థికంగా ఎదగాలని, సకలాంగులకు ధీటుగా రాణించాలని మంత్రి సూచించారు. పేదల సేవ చేసే భాగ్యం కలుగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మొదట పేదల సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.

త్వరలో దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పేదలు ప్రభుత్వ, సంక్షేమ అభివృద్ధి పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని, సర్కారు లక్ష్యం కూడా అదేనని తెలిపారు.

ఆయా కార్యక్రమాట్లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్​కుమార్​, జిల్లా కలెక్టర్​ సత్యప్రసాద్, జువ్వాడి నర్సింగారావు, డీఎస్​సీడీఓ రాజ్ కుమార్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ బీ నరేష్.  విద్యుత్ శాఖ అధికారి ఎస్ ఈ  సుదర్శన్ , సీడీపీఓ మణెమ్మ, ఎఫ్​ఆర్​ఓ కొండయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.