👉 నేడు సంఘటన స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
సంగారెడ్డి జిల్లా, పాశమైలారంలోని పారిశ్రామికవాడలో రసాయన పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, సహాయక కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఆదేశించారు.
ప్రమాదంలో మృతుల పట్ల ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు.
పాశమైలారం ప్రమాద ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, మంత్రులు దామోదర్ రాజనర్సింహ , వివేక్ వెంకటస్వామి , సీఎస్, డీజీపీ లకు అవసరమైన ఆదేశాలు జారీచేశారు.
ఈ ప్రమాద ఘటనను దర్యాప్తు చేయడంతో పాటు, ప్రమాదానికి దారితీసిన కారణాలను సమీక్షించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక సీఎస్ (విపత్తు నిర్వహణ), ప్రిన్సిపల్ సెక్రటరీ (కార్మిక), ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆరోగ్యం), అదనపు డీజీపీ (అగ్నిమాపక సేవలు)లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ కమిటీ పాశమైలారం దుర్ఘటనను పరిశీలించడంతో పాటు, ఇలాంటివి పునరావృతం కాకుండా నిరోధించే మార్గాలపై ఒక నివేదికను కూడా సమర్పిస్తుంది.
పాశమైలారం ప్రమాద ఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు అన్ని విధాల సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శిస్తారు.