సౌదీలో నరకయాతన పడుతున్న తెలంగాణ వాసి !

👉 స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 

J.SURENDER KUMAR,

ఎడారిలో శ్వాస తీసుకోవడం కూడా కష్టం అయ్యే పరిస్థితుల్లో… ఖర్జూర చెట్ల మధ్య వడగాలిలో నిలబడి, స్వదేశంలోని కుటుంబాన్ని చేరాలని ఏడేళ్లుగా తపన పడుతున్న ఒక వలస జీవి తెలంగాణ వాసి మానవీయ గాథ ఇది.

సౌదీ అరేబియాలోని ఎడారిలో  ఖర్జూరాలను పండించే ఒక తోటలో వ్యవసాయ కూలీగా పనిచేసే ఒక గల్ఫ్ కార్మికుడి జీవితం చేదుగా మారిన సంఘటన.

👉 వివరాలిలా ఉన్నాయి.

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్,  2017 మే నెలలో సౌదీ అరేబియాకు వెళ్ళాడు. మొదట హౌస్ డ్రైవర్‌గా పనిచేశాడు. కొద్ది నెలల్లోనే పని కోల్పోయి నిరాశ్రయుడయ్యాడు. మండే ఎండల్లో, ఆశలు చల్లారిపోకుండా తన బిడ్డల భవిష్యత్ కోసం ఖర్జూర తోటలో కూలీగా చేరి అక్కడే చిక్కుకుపోయాడు.

ఈశ్వర్ భార్య లత, ఇద్దరు కూతుళ్లతో కలిసి హైదరాబాద్‌ ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ కౌంటర్ లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి , మంత్రి పొన్నం ప్రభాకర్ లను వేడుకుంటూ వినతిపత్రం సమర్పించారు.

ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి స్వయంగా వారి వెంట ఉండి మార్గదర్శనం చేశారు. విషయం తెలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ జిఏడి ఎన్నారై అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

అఖామా, వీసా గడువు ముగిసిపోయి, పాస్ పోర్ట్ సౌదీ అధికారులవద్ద ఉంది.  ఈశ్వర్‌ను స్వదేశానికి పంపించడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడానికి  కరీంగర్ కు చెందిన సామాజిక కార్యకర్త మొహమ్మద్ జబ్బార్, సహాయాన్ని ఆర్థించామని లత తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదించి ఈశ్వర్‌ను స్వదేశానికి రప్పించాలని లత విజ్ఞప్తి చేశారు.