శ్రీ వేంకటేశ్వర కళాశాల ఛైర్మెన్ గా బీఆర్ నాయుడు!

J. SURENDER KUMAR,

టిటిడి ప్రతిష్టను మరింత పెంచేలా ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలను రూపొందించాలని అధికారులను టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు కోరారు.
తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో టిటిడి ఈవో జె. శ్యామలరావు, గవర్నంగ్ బాడీ సభ్యులతో సోమవారం 155వ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎస్వీ కళాశాల గవర్నింగ్ బాడీ ఛైర్మెన్ గా  బీఆర్ నాయుడు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గవర్నింగ్ బాడీ ఛైర్మెన్ గా ఎంపికైన టిటిడి ఛైర్మెన్  బీఆర్ నాయుడును గవర్నింగ్ బాడీ సభ్యులు అభినందించారు.


ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా టిటిడి నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అవసరమైన మౌళిక సదుపాయాల పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని టిటిడి ఛైర్మెన్  బీఆర్ నాయుడు సూచించారు. ఎస్వీ కళాశాలలో తెలుగు విద్యార్థులకు అడ్మిషన్ల కోటాలో ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఉత్తరాది వైపున ఉన్నటిటిడి ఆలయాలలో, ఢిల్లీలోని ఎస్వీ కళాశాలకు ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ ఈఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో  జె. శ్యామలరావుకు టిటిడి ఛైర్మెన్ సూచించారు. ఎస్వీ కళాశాలలో విద్యార్థులకు ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.


విద్యార్థులకు ఉపాధికి అవకాశం ఉన్న వృత్తిపరమైన కోర్సులను ప్రవేశ పెట్టాలని సూచించారు. కళాశాలలో పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు నిర్వహణ, ఇంజనీరింగ్ మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. కాలం చెల్లిన భవనాల స్థానంలో భవనాల పునర్మానం, ఆడిటోరియం మరమ్మతులు, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నూతన టెక్నాలజీతో కళాశాల ప్రవేశంలో మరింత ఆకర్షణీయంగా ఉండేలా మార్పులు చేర్పులు చేపట్టాలన్నారు.

కళాశాలకు సంబంధించిన పలు అంశాలను ప్రిన్సిపాల్ డా. వఝల రవి టిటిడి ఛైర్మెన్, ఈవోల దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్న గవర్నింగ్ బాడీ సమావేశం నాటికి కళాశాల అభివృద్ధి పనులపై పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను ఛైర్మెన్ కోరారు.


ఈ సమావేశంలో టిటిడి బోర్డు సభ్యులు డా. పనబాక లక్ష్మీ,  ఎస్. నరేష్ కుమార్, ఎండోమెంట్ కమీషనర్  కె. రామచంద్ర మోహన్, ఎప్.ఏ అండ్ సీఏవో ఓ. బాలాజీ, సీఈ టివి సత్యనారాయణ, టిటిడి డీఈవో వెంకట సునీల్, పలువురు గవర్నింగ్ బాడీ ప్రతినిధులు, టిటిడి అధికారులు పాల్గొన్నారు.