స్వరాష్ట్ర సాధనలో అమర వీరులందరికీ నివాళులు !

👉 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా…

👉 ప్రభుత్వ విప్  అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను అని ధర్మపురి ఎమ్మెల్యే
ప్రభుత్వ విప్  అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోమవారం ప్రభుత్వ ప్రతినిధిగా జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి పోలీస్ యంత్రాంగంతో గార్డ్  ఆఫ్ ఆనర్ స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన చేస్తున్న పథకాలను తన ప్రసంగంలో వివరించారు.
ఎందరో అమర వీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశదిశలా వెలుగులు విరజిమ్ముతోంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వ పడుతున్నాను. అని అన్నారు.


ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమ కారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ప్రణామాలు తెలిపారు.


తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్-2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశంలో వెల్లడించారు. అని పేర్కొన్నారు.

👉 తెలంగాణ రైజింగ్-2047 కీలకాంశాలు !

తెలంగాణ రైజింగ్-2047 విజన్ లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు అని అన్నారు.

👉 ఆడ బిడ్డలకు అండదండలు !

ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే, రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంటగ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ళు వంటి పథకాలతో పాటు, సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది అని అన్నారు.

👉 రైతులకు రుణవిముక్తి !

దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో 25 లక్షల 35 వేల 964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతుకు పెట్టుబడి సాయం పెంచి, రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమచేయడం జరుగుతోంది. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు అని అన్నారు.

👉 ఎస్సీవర్గీకరణతో సామాజిక న్యాయం!

సంక్షేమంతోపాటు సామాజిక న్యాయంలో సయితం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. పారదర్శకంగా కులగణన నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

👉 యువతకు ఉపాధి, ఉద్యోగాలు !

ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ, యువత ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ప్రయివేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. రాజీవ్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం అన్నారు.

👉 ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం !

రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నాం. రాష్ట్రంలో 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే గృహనిర్మాణాలు ప్రారంభించడం జరిగింది. నిర్మాణ దశలను బట్టి లబ్దిదారుల ఖాతాలలో నగదు జమ చేస్తున్నాం.

👉 విశ్వ వేదికపై తెలంగాణ !

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాలలో పర్యటించి బారీగా పెట్టుబడులు సాధించాం.

👉 జగిత్యాల జిల్లాలో..

జగిత్యాల జిల్లాలోని 7 వేల 596 స్వయం సహాయక సంఘాలకు 766.66 కోట్ల ఋణాలను మంజూరు చేశాం. 4 వేల 796 మంది మహిళలకు 77.27 కోట్ల రూపాయల స్త్రీనిధి ఋణాలను ఇచ్చాం. మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3 కోట్ల 11 లక్షల 64 వేల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 121 కోట్ల 47 లక్షల రూపాయల లబ్ధి చేకూరింది.
మన జిల్లాలో 2 లక్షల 89 వేల 725 మంది లబ్దిదారులకు 6 లక్షల 54 వేల 103 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగింది. వాటి విలువ 19 కోట్ల 49 లక్షల రూపాయలు కాగా ఈ సొమ్మును ప్రభుత్వం చెల్లించింది.


👉 జిల్లాలో డీఎస్సీ ద్వారా 375 మంది టీచర్ పోస్టులకు ఎంపికయ్యారు. దీంతో పాటు టి.ఎస్.పి.ఎస్.సి. ద్వారా నిర్వహించిన వివిధ రకాల పోటీ పరీక్షలకు మన జిల్లా నుండి చాలా మంది
అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇటీవలనే 119 మంది గ్రామ పాలన అధికారుల ఎంపికకు రాత పరీక్ష నిర్వహించాం. ఎస్టీ, ఎస్సీ, బీసి మరియు మైనారిటీ స్టడీ సర్కిళ్ల ద్వారా వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు కావాల్సిన పుస్తకాలను ఉచితంగా అందిస్తూ, నిపుణులైన అధ్యాపక బృందంచే ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం.
అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో జగిత్యాల నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను స్థాపిస్తున్నాం. మన జిల్లాలో 279 మంది యువతను లైసెన్స్ డ్ సర్వేయర్లుగా ఎంపిక చేసి నిపుణులచే శిక్షణ ఇవ్వడం ఇస్తున్నాం.


👉 రైతుల సంక్షేమానికి వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జిల్లాలో రైతు ఋణ మాఫీ పథకం కింద మొత్తం 80 వేల 515 మంది రైతులకు 721 కోట్ల 74 లక్షల రూపాయల ఋణాలు మాఫీ చేశాం. రైతు భరోసా పథకం ద్వారా 2024-25 యాసంగి సీజన్ కు గాను ఒక లక్ష 80 వేల 914 మంది రైతులకు 121.78 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశాం. ఈ వానాకాలం వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు 24 వేల 418 మెట్రిక్ టన్నుల నిల్వలను రైతులకు అందుబాటులో ఉంచడం
భూ భారతిని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఇందులో భాగంగా జిల్లాలోని బుగ్గారం మండలాన్ని పైలెట్ గా ఎంపిక చేసి ఆ మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. భూ సమస్యలున్న 865 మంది రైతుల నుండి ఆర్జీలు స్వీకరించి, భూ భారతి పోర్టల్ ద్వారా 199 అర్జీలను శాశ్వత పరిష్కారం చేయడం జరిగింది. మిగతా ధరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తున్నాం.

👉 జిల్లా వ్యాప్తంగా 428 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4 లక్షల 50 వేల 369 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ధాన్యం విక్రయించిన 82 వేల 967 మంది రైతులకు 1,045 కోట్ల రూపాయలను నేరుగా రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది.

👉 జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం ధరఖాస్తు చేసుకున్న వారిలో 11 వేల 641 మంది అర్హులను గుర్తించాం. ఈ ధరఖాస్తులను అధికారులు పారదర్శకంగా పరిశీలించి నూతన రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతోంది. రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల నమోదు చేసుకున్న ధరఖాస్తులను పరిశీలించి సభ్యుల పేర్లు రేషన్ కార్డులో చేర్చి బియ్యం సరఫరా చేస్తున్నాం.

👉 జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 61 వేల 365 మంది ధరఖాస్తు చేసుకున్నారు. ఇందులో జిల్లాకు మొదటి దఫా 7 వేల 328 ఇండ్లు మంజూరు చేశాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్
ఆసుపత్రులలో 19 వేల 611 మందికి 46 కోట్ల 20 లక్షల విలువ చేసే శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించాం. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికి జీరో బిల్లులు జారీ చేశాం. తద్వారా జిల్లాలో సుమారు 2 లక్షల విద్యుత్ సర్వీసులకు గాను 101 కోట్ల 27 లక్షల రూపాయలను సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది.

👉 రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుమల రేవంత్ రెడ్డి కి, మంత్రి వర్యులకు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం, సూచనలు అందిస్తున్న  పార్లమెంటు సభ్యులకు,  శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు,  స్థానిక ప్రజా ప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, ఉద్యోగులకు, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా.. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అని జై హింద్.. జై తెలంగాణ. అంటూ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రసంగం ముగించారు.