విద్యా వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చెయ్యాలి సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన తరగతి గదులను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. ఉన్నత ప్రమాణాలతో  తెలంగాణ‌లో విద్యా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని చెప్పారు.


👉 విద్యా శాఖపై ముఖ్యమంత్రి  తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాల్లో అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని ఈ సందర్భంగా ఆదేశారు జారీ చేశారు.


👉 ఈ ఏడాది ప్రైవేటు పాఠశాల‌ల నుంచి 48 వేల మంది విద్యార్థులు ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో చేరార‌ని అధికారులు సీఎంకు వివ‌రించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్య‌కు అనుగుణంగా నూత‌న గ‌దులు నిర్మించాల‌ని ఈ సందర్భంగా  ఆదేశించారు. ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న పిల్ల‌ల‌కు అందుకు అనుగుణంగా పాఠశాలల్లో వ‌స‌తులను  క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.


👉 మ‌ధ్యాహ్న భోజ‌నం త‌యారీకి సంబంధించి గ్యాస్‌, క‌ట్టెల పొయ్యిల బాధ‌ల నుంచి మ‌ధ్యాహ్న భోజ‌నం త‌యారు చేసే మ‌హిళ‌ల‌కు విముక్తి క‌ల్పించాల‌ని, అందుకు సోలార్ కిచెన్లు ఏర్పాటుపై త‌క్ష‌ణ‌మే దృష్టి సారించాల‌ని చెప్పారు.


👉 ప‌దో త‌ర‌గ‌తిలో ఉత్తీర్ణుల‌వుతున్న విద్యార్థుల సంఖ్య‌కు, ఇంట‌ర్మీడియ‌ట్‌లో న‌మోదు అవుతున్న విద్యార్థుల సంఖ్య‌కు మ‌ధ్య వ్య‌త్యాసం ఎక్కువ ఉండ‌డంపై ముఖ్య‌మంత్రి  అధికారుల‌ను ప్ర‌శ్నించారు. ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా క‌చ్చితంగా ఇంట‌ర్మీడియ‌ట్‌లో చేరేలా చూడాల‌ని సూచించారు.


👉 ఇంట‌ర్మీడియ‌ట్ అనంత‌రం జీవ‌నోపాధికి అవ‌స‌ర‌మైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్ష‌ణ పొంద‌వ‌చ్చ‌ని, త‌ద్వారా వారి భవిష్యత్తుకు ఢోకా ఉండ‌ద‌ని ముఖ్యమంత్రి  అభిప్రాయ‌ప‌డ్డారు.