👉 ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించండి !
👉 కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరిన మంత్రి శ్రీధర్ బాబు !
J.SURENDER KUMAR,
రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షలు తెలంగాణలోని తయారీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.
బుధవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ప్రత్యేకంగా సమావేశమై వినతి పత్రం సమర్పించారు.
👉 “ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కి అవసరమైన రేర్ ఎర్త్ మాగ్నెట్లు, కీలక ముడి పదార్థాలు, రసాయనాలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి.
👉 ఈ తరహా పదార్థాల ఎగుమతులపై ఆ దేశం తాజాగా ఆంక్షలు విధించింది. ఆ ప్రభావం ఎలక్ట్రానిక్స్, ఈవీలు తయారు చేసే పరిశ్రమలపై పడింది. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా తెలంగాణలో తయారీ రంగంపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది’ అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

👉 ఎలక్ట్రానిక్స్, ఈవీ తయారీ పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా వాస్తవ పరిస్థితిని సమీక్షించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
👉 పారిశ్రామిక రంగం బలోపేతానికి సహకరించండి !
రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
👉 ముఖ్యంగా హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-బెంగళూరు మరియు హైదరాబాద్-విజయవాడ ఇండస్ట్రీయల్ కారిడార్ల అభివృద్ధి వివరాలు వివరించారు.
జహీరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ₹ 400 కోట్ల నిధులు పీఎం గతిశక్తి పథకం కింద మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
👉 ఫ్యూచర్ సిటీ అభివృద్ది !
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ (HWIC) నిలిచిపోయిందని కేంద్రమంత్రికి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఇందులో భాగంగాఉన్న ఫార్మా సిటీని ప్రభుత్వం ఇప్పుడు ‘ఫ్యూచర్ సిటీ’గా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఇందుకు సహకరించాలని కోరారు. అలాగే వరంగల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి సహా పలు నోడ్స్‌కు కేంద్రం నిధులు విడుదల చేసేలా చొరవ చూపాలని కోరారు.
కేంద్రం ప్రతిపాదించిన 100 పారిశ్రామిక పార్కుల పథకం కింద తెలంగాణలో పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని, ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ అభిప్రాయాలు పంపినట్లు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులకు తగిన నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.

👉 హైదరాబాద్‌లో జాతీయ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయండి !
దేశంలో డిజైన్ రంగాన్ని ఉద్ధరిస్తూ, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల ద్వారా గ్లోబల్ గుర్తింపు సాధించేలా హైదరాబాద్‌లో జాతీయ డిజైన్ సెంటర్ (NDC) ఏర్పాటు చేయాలని రాష్ట్రం ప్రతిపాదించిందన్నారు. ఇది దేశవ్యాప్తంగా డిజైన్ థింకింగ్‌కు కేంద్రంగా మారుతుందన్నారు.
👉 వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో తెలంగాణ భాగస్వామ్యం !
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తోందని, కేంద్రంతో కలిసి వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధనలో రాష్ట్రం ముందుంటుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.