J.SURENDER KUMAR
తెలంగాణలో ఆధార్ శాశ్వత కేంద్రాలను నడపాలంటే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్వహించే పరీక్షలో 65% మార్కులు సాధించాలి.
గత 10 సంవత్సరాలుగా కేంద్రాలు నిర్వహిస్తున్నవారు కూడా ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సిందే. ఇన్-హౌస్ మోడల్ విధానంలోకి అన్ని కేంద్రాలు మారడమే ఇందుకు కారణం.
ఈ విధానం మూడేళ్లుగా అమలులో ఉంది, కానీ కొందరు నిర్వాహకులు వేతనాలకు బదులు కమీషన్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించడంతో అమలు ఆలస్యమైంది. ఇటీవల హైకోర్టు సయోధ్యతో ఈ సమస్య పరిష్కారమైంది. ఇన్-హౌస్ మోడల్ కేంద్రాలకు ₹1.50 లక్షల విలువైన సామగ్రి (ల్యాప్‌టాప్‌తో సహా) అందించేందుకు డిపాజిట్ చెల్లించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
అవకతవకలకు పాల్పడిన నిర్వాహకులను తొలగించి, తాత్కాలికంగా కొత్తవారికి కేంద్రాలను అప్పగిస్తారు. బాధ్యులపై చట్టపరంగా క్రిమినల్ కేసులతో పాటు కఠిన చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో 1,151 ఆధార్ కేంద్రాలు ఏర్పాటు కాగా, 424 మూతపడ్డాయి. ప్రస్తుతం 727 కేంద్రాలు పనిచేస్తున్నాయి.
కొత్త విధానంతో అన్ని కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి.
పేరు, పుట్టిన తేదీ, చిరునామా, సెల్ నంబర్ వంటి వివరాలను కార్డుదారులు ఆన్‌లైన్‌లో స్వయంగా మార్చుకోవచ్చు. ఇన్-హౌస్ కేంద్రాల్లో వేలిముద్రల నవీకరణ, నూతన కార్డుల జారీ మాత్రమే జరుగుతాయి. మీ-సేవ వంటి ఆన్‌లైన్ కేంద్రాల్లో కూడా పేరు, చిరునామా మార్పిడి సేవలు అందుబాటులోకి వస్తాయి.