అంబేద్కర్ రాజ్యాంగం అందరికీ ఒక్కటే మరో రాజ్యాంగం ఉండదు !

👉 ఢిల్లీ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అందరికీ ఒక్కటే. వేర్వేరు పార్టీలకు మరో రాజ్యాంగం ఉండదు. రాజ్యాంగానికి లోబడి రిజర్వేషన్లు పెంచాలని అడుగుతున్నాం. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వితండవాదాలకు తావివ్వకుండా తెలంగాణలో అమలు చేయతలపెట్టిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేసుకోవలసిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు

👉 తెలంగాణలో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌తో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్రభుత్వం  కృత‌ నిశ్చ‌యంతో ఉన్నదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  స్ప‌ష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ ఆమోదించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఢిల్లీ వచ్చినట్టు బుధవారం మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

👉 బీసీల‌కు విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లు, అలాగే స్థానిక సంస్థ‌ల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి తెలంగాణ శాస‌న‌స‌భ పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదించిన రెండు బిల్లుల‌ను ఆమోదించ‌డంలో కేంద్ర  ప్ర‌భుత్వం తాత్సారం చేస్తోంద‌ని అన్నారు. రాష్ట్ర హైకోర్టు 90 రోజుల్లో స్థానిక సంస్థ‌లు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, 30 రోజుల్లో రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేయాల‌ని ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పలువురు ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి మాట్లాడారు.

👉 “ఈ రెండు బిల్లుల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత రాహుల్ గాంధీ ని, రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ని కలిసి తెలంగాణ ప్ర‌భ‌త్వం చేప‌ట్టిన సామాజిక‌, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజ‌కీయ, కుల స‌ర్వే (SEEEPC) జ‌రిపిన తీరు, రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రించిన శాస్త్రీయ విధానాల‌ను వివ‌రిస్తాం. తర్వాత ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలను కలిసి వివరించి వారి మద్దతు కోరుతాం. తద్వారా సమన్వయంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.

👉 బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి తెలంగాణ శాస‌న‌స‌భ‌లో అన్ని పక్షాలు మ‌ద్ద‌తు ప‌లికాయి. తెలంగాణ‌లో 4 ఫిబ్రవరి 2024 రోజున ప్రారంభించి 4 ఫిబ్రవరి 2025 నాటికి సామాజిక‌, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజ‌కీయ, కుల స‌ర్వేను పూర్తి చేశాం. అందుకే ఫిబ్ర‌వరి 4 ను సామాజిక న్యాయ దినోత్స‌వంగా (సోష‌ల్ జ‌స్టిస్ డే) జ‌రుపుతున్నాం. ఈ స‌ర్వేలో తెలంగాణ‌లో 3.55 కోట్ల మంది వివ‌రాలు వెల్లడించారు. 

👉 సర్వే వివ‌రాల‌పై మంత్రిమండలి ఆమోదం తర్వాత శాస‌న‌స‌భలో పూర్తిస్థాయిలో చర్చించాం. దాని ప్ర‌కారం 56.4 శాతం బీసీలు, 17.45 శాతం ఎస్సీలు, 10.08 శాతం ఎస్టీలు, 10.09 శాతం ఉన్న‌త వ‌ర్గాల వారు ఉన్నారు. అలాగే 3.09 శాతం మంది తాము ఏ కులానికి చెంద‌మని ప్ర‌క‌టించారు. తెలంగాణలో ఇదో కొత్త పరిణామం.

👉 సర్వేపై స్వ‌తంత్ర నిపుణుల స‌ల‌హా క‌మిటీని నియమించి ఆ కమిటీకి ఇచ్చాం. వారు దానిపై చ‌ర్చించి నివేదిక‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించారు. ఆ నివేదిక‌ను మంత్రివ‌ర్గంలో చ‌ర్చించి శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెడ‌తాం. స‌ర్వే చేసిన‌ప్ప‌టికీ డేటా ప్రైవసీ చట్టం ప్రకారం వ్య‌క్తిగ‌త వివ‌రాలు వెల్ల‌డించ‌కూడదని ఆ వివరాలను బహిర్గత పరచలేదు.

👉 కుల గ‌ణ‌న విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం దేశానికి దిక్సూచిలా నిలిచింది. తొలుత కుదరన్న కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ రకాల ఒత్తిళ్లతో జన గణననలో కుల గ‌ణ‌న చేర్చింది. తెలంగాణ చేసిన సర్వే ఒక దిక్సూచిలా ఉంటుంది. దేశవ్యాప్తంగా జరిపే కుల గ‌ణ‌న సేక‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ మాడల్‌ను వినియోగించుకోవాలి.

👉 2018 లో పంచాయతీ రాజ్ చట్టంలో రిజర్వేషన్లు 50 శాతం మించడానికి వీలులేదని పరిమితి విధించారు. ఆ పరిమితిని ఎత్తివేసి ఆ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశాం. దానిపై గవర్నర్ గారి కార్యాలయం కోరిన వివరాలను అందించింది. ఆర్డినెన్స్‌కు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధం లేదు.

👉 దేశంలో 10 శాతం మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ఇవ్వడంతోనే 50 శాతం పరిమితి అంశం పక్కకు పోయింది. రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అన్న అంశానికి కాలం చెల్లిపోయింది.

👉 అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వచ్చిన సర్వే ఫలితాల ఆధారంగా 42 శాతం బీసీల రిజర్వేషన్లను  అడుగుతున్నాం. ఇది ఎవరో ఒక వ్యక్తి కోసం కాదు. మొత్తం జాతి కోసం అడుగుతున్నాం. వందేళ్ల తర్వాత కుల గణన జరిగింది. రిజర్వేషన్లను సాధించుకోవడానికి మేమంతా సిద్ధమై వచ్చాం. మేం దీనిపై పోరాటం చేస్తాం..” అని వివరించారు.

👉  మీడియా సమావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు మహమ్మద్ అలీ ష‌బ్బీర్ , హ‌ర్కర వేణుగోపాల రావు  ఎంపీలు అనిల్ కుమార్ యాద‌వ్ , డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి , పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌ , సురేశ్ షెట్కార్,  చామ‌ల కిర‌ణ్ కుమార్‌రెడ్డి , రామ‌స‌హాయం ర‌ఘురామిరెడ్డి , కుందూరు ర‌ఘువీర్ రెడ్డి, గ‌డ్డం వంశీ కృష్ణ‌ , డాక్ట‌ర్ క‌డియం కావ్య‌ పాల్గొన్నారు.