అమెరికాతో తెలుగు ప్రజలకు బలమైన బంధం ఉంది!

👉 అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని… సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


అమెరికాతో తెలుగు ప్రజలకు ఉన్న స్నేహపూర్వకమైన బంధం ఎంతో బలమైంది. అమెరికాలో తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎంతో మంది ఇక్కడి విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవడానికి అమెరికా వెళుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


అమెరికా తెలంగాణల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడాలని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  ఆకాంక్షించారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్ కాన్సూల్ జెనరల్ జెన్నిఫర్ లార్సన్  ఇచ్చిన దౌత్యపరమైన విందులో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ,

అమెరికా – తెలంగాణల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు మరింత మెరుగుపరచడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణను 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తెలంగాణ రైజింగ్ దార్శనికతతో పని చేస్తున్నామని వివరిస్తూ అందుకు అమెరికన్ల మద్దతు కావాలని కోరారు.


👉 “అమెరికాకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ప్రపంచంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం ముందు అమెరికా అనేక సానుకూలతలను ప్రదర్శించింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా, నిరంతరం ఆవిష్కరణలతో ప్రపంచ దృక్కోణాన్ని మార్చింది. 


👉 ఎల్లప్పుడూ బలమైన దేశంగా.. అనేక అంశాల్లో సానుకూల పరిష్కారాలు చూపించడంలో అమెరికా స్ఫూర్తిని ప్రదర్శించింది. అమెరికా స్ఫూర్తికి తెలంగాణ స్ఫూర్తికి మధ్య ఎంతో సారూప్యత ఉంది. స్నేహ బంధాన్ని కోరుకోవడమే కాకుండా దాన్ని మరింత పటిష్టపరుచుకోవడం తెలంగాణ ప్రత్యేకత.


👉 2008 లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి  నేతృత్వంలోని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటైంది. స్వాతంత్రానంతరం భారతదేశంలో ప్రారంభించబడిన మొట్టమొదటి యూఎస్ దౌత్య కార్యాలయం ఇదే కావడం గమనార్హం. భారతదేశంతో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో అమెరికా ఎప్పుడూ నిబద్ధతని ప్రదర్శించింది.


👉 హైదరాబాద్ కాన్సూల్ జనరల్ శ్రీమతి జెన్నిఫర్ లార్సన్  రెండు సంస్కృతుల మధ్య, ప్రజల మధ్య, అలాగే, వాణిజ్యపరమైన సంబంధాలను పటిష్టపరచడంలో, ఇరు దేశాల మధ్య బలమైన వారధిగా నిలుస్తున్నారు. 

👉 ఐటీ, ఫార్మా, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాలకు చెందిన దాదాపు 200 అమెరికా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం పనిచేస్తున్నాయి. జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసం, విలువల ఆధారంగా అమెరికా – భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది.


👉 హైదరాబాద్‌ మరింత పురోభివృద్ధి సాధించాలని, అమెరికాలోని అత్యుత్తమైన వాటిని తెలంగాణకు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నా. ఈ వేడుకలకు థీమ్‌గా నిర్ధేశించిన కోణంలో చెప్పాలంటే.. “ఒక్కటిగా ఉంటే.. మరింత పటిష్టంగా..” ఎదగగలమని నేను విశ్వసిస్తున్నా..” అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. ఈ విందులో హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సూల్ జనరల్ కార్యాలయ ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.