సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి ప్రధాని ఆర్థిక మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ !

J SURENDER KUMAR,


సమాఖ్య విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం గౌరవించుకున్నప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి  అన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ శనివారం ముఖ్యమంత్రి ని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

👉 ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం చేపట్టిన, చేపడుతున్న వివిధ పథకాలు, ప్రాజెక్టులతో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ముఖ్యమంత్రి  వివరించారు. కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకరించుకున్నప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెంది తద్వారా దేశం పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.


👉 హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.


👉 “రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవల రంగం అభివృద్ధి కోసం పలు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఆవలివైపున రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తాం. ఔటర్ రింగ్ రోడ్డుకు రీజినల్ రింగ్ రోడ్డుతో  అనుసంధానం చేస్తూ రేడియల్ రోడ్లను ప్రతిపాదించాం” అని మౌలిక సదుపాయాల కల్పనపై వివరించారు.


👉 తెలంగాణ అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపైన ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అధిక శాతం వడ్డీల కారణంగా తిరిగి చెల్లింపులు భారంగా మారి రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోంది. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోంది. అధిక వడ్డీకి తీసుకున్న రుణాలపైన వడ్డీ తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా  పాల్గొన్నారు.