👉 ఎన్నికల ప్రచారం కాదు టీ కొట్టులో ప్రజలతో మాట ముచ్చట !
J.SURENDER KUMAR,
అర్ధాంతరంగా వచ్చిపోయే చోట మోట పదవులను అడ్డుపెట్టుకొని ప్రోటోకాల్ అంటూ అతిగా ప్రవర్తించే కొందరు నాయకుల తీరుకు భిన్నంగా చోటు చేసుకున్న సందర్భం ఇది……
రాయపట్నం కరీంనగర్ రాష్ట్ర రహదారిపై సైరన్ మోగిస్తూ వాహనాల కాన్వాయ్ రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు వద్ద ఆగాయి. ఏం సంగతి లచ్చన్న బాగున్నావా ? చాయ్ తాగిస్తావా ? అంటూ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు దిగి టీ కొట్టులో అడుగు పెట్టారు.
ప్రస్తుతం ఎన్నికలు లేవు, ఎన్నికల ప్రచారం కాదు క్యాబినెట్ మంత్రి హంగు ఆర్భాటం లేకుండా చాయ్ కోసం రావడంతో హోటల్ యజమాని లచ్చన్న, అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానికి గురి అయ్యారు..

👉 వివరాలు ఇలా ఉన్నాయి..
మంత్రి లక్ష్మణ్ కుమార్ క్యాబినెట్ సమావేశంలో పాల్గొనడానికి ధర్మపురి నుండి గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ కు బయలుదేరారు. వెలుగటూరు మండల కేంద్రంలో రోడ్డు పక్కన గుడిసె ముందు మంత్రి కాన్వాయ్ ఆగింది.
మంత్రి లక్ష్మణ్ కుమార్, చాయ్ తాగడానికి సామాన్యుడిలా రావడంతో ఆశ్చర్యపోతు, ‘ అన్న అన్న కుర్చీ తెస్తా ‘ అంటూ లచ్చన్న బయటికి వెళ్లే ప్రయత్నం చేశాడు. మంత్రి లక్ష్మణ్ కుమార్ వారించి ఇక్కడ కూర్చుంటా, అంటూ సిమెంట్ బెంచి పై మంత్రి లక్ష్మణ్ కుమార్ కూర్చున్నారు. లచ్చన్న తో పాటు చాయ్ తాగడానికి వచ్చిన వారు మంత్రితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

👉 వెల్గటూర్ పట్టణానికి మహర్దశ !
మంత్రి చాయ్ తాగుతుండగా , ప్రజలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వెల్గటూర్ పట్టణం లో సెంట్రల్ లైటింగ్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని వారు మంత్రుల లక్ష్మణ్ కుమార్ ను కోరారు. త్వరలో ₹ 15 కోట్ల నిధులు ప్రభుత్వం పక్షాన విడుదల చేయిస్తా అని మంత్రి వారికి హామీ ఇచ్చారు.