👉 వరుస ఎన్కౌంటర్ లు, ఎదురుకాల్పులు, లొంగు బాట్లతో నక్సలైట్ పార్టీ ఉక్కిరిబిక్కిరి !
👉 నన్ను బహిష్కరించడం ఏందిరా ? ఓ సందర్భంలో కొండపల్లి సీతారామయ్య !
👉 హోం మంత్రి అమిత్ షా టార్గెట్ 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్ !
👉 పద్మక్క ఎన్కౌంటర్ నేటికీ 23 సంవత్సరాలు !
J.SURENDER KUMAR,
నక్సలైట్ ఉద్యమానికి గుండెకాయ ఉత్తర తెలంగాణలో గత దశాబ్దన్నర కాలంగా ఆ పార్టీ కదలికలు లేవు. దండకారణ్యం నుంచి నేపాల్ కారిడార్ వరకు విస్తరించిన మావోయిస్టు పార్టీ ప్రస్తుతం విలవిల లాడుతూ అగ్రనాయకత్వం స్వీయ రక్షణలో కొట్టుమిట్టాడుతున్నది. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల కేశవరావు ఎన్కౌంటర్ లో హతమై నెలరోజులకు పై అవుతున్న ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిని నియమించాము, అని ప్రకటించుకోలేని పరిస్థితుల్లో ఉంది.
దీనికి తోడు వరుస ఎన్కౌంటర్ లు అగ్ర నాయకుల హతం, లొంగుబాట్లు తో నక్సలైట్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నది. కాల్పుల విరమణ, శాంతి చర్చలకు నక్సలైట్ పార్టీ భేషరతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేసిన, చేస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఆ పార్టీ పరిస్థితిని అంచనా వేయవచ్చు. దీనికి తోడు హోం మంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్ టార్గెట్ కార్యాచరణ నేపథ్యంలో నక్సలైట్ ఉద్యమమా తేలిపోయే మేఘమా ? అనే చర్చకు అవకాశం ఏర్పడింది.
👉 మావోయిస్టు పార్టీ పుట్టుపూర్వోత్తరాలు !
ఉత్తర తెలంగాణ జిల్లాలలో 1976 – 1977 లో ఉద్యమం మొదలైంది. పల్లెలలో పాలేర్ల జీతాలు పెంపు నినాదంతో మొదలుపెట్టి సంవత్సర కాలంలోనే రైతు కూలీ సంఘాలుగా ఆవిర్భవించింది. ఆ సమయంలో దేశంలో ఎమర్జెన్సీ ఉంది. ఆ తరువాత జరిగిన ఎన్నికలను బహిష్కరించమని పీపుల్స్ వార్ నక్సలైట్ పార్టీ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య పిలుపు ఇవ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ( ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో) జన్నారంలో కొండపల్లి సీతారామయ్య నివాసం. జన్నారం సమీపంలోని తపాలాపూర్ గ్రామ భూ స్వాములను కాల్చి చంపటం సంచలనం సృష్టించడంతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు రైతు కూలీ సంఘం కార్యకలాపాలు విస్తరించాయి. పాలేరులు,రైతు కూలీలు ,జీతాలు పెంచాలని పల్లెల్లో ప్రచారం నిర్వహించి, జగిత్యాల పట్టణంలో ఏర్పాటుచేసిన జగిత్యాల జైత్రయాత్ర పేరిట జరిగిన భారీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా దాదాపు లక్ష మంది తరలిరావడం నేటికీ రికార్డుగా చెప్పుకోవచ్చు.
👉 పీపుల్స్ వార్ గా పురుడు పోసుకొని..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లోని ఓ గ్రామ శివారు జొన్న చేనులో కొండపల్లి సీతారామయ్య తో పాటు కొందరు 1980 ఏప్రిల్ చివరి మాసంలో, సిపిఐ ఎంఎల్, పీపుల్స్ వార్ పార్టీగా నామకరణం చేశారు. అనుబంధ సంఘాలుగా పల్లెల్లో రైతు కూలీ సంఘం, విద్యార్థుల కోసం విద్యాసంస్థలలో రాడికల్ స్టూడెంట్ యూనియన్, సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో సికాస ( సింగరేణి కార్మిక సంఘం ) ఏర్పాటు చేసి ఉద్యమాన్ని బలోపేతం చేస్తూనే భూస్వాముల హత్యలకు శ్రీకారం చుట్టింది. సిరిసిల్ల, జగిత్యాల తాలూకా లోని ప్రాంతాలను నాటి ప్రభుత్వం కొల్లోలితో ప్రాంతంగా ప్రకటించింది.

👉 నిషేధం ..
1984 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వం పీపుల్స్ వార్, ఆర్ ఎస్ యు, సికాస పై తొలిసారి నిషేధం విధించింది. 1989 లో ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నిషేధం ఎత్తివేసారు. 1991 లో మళ్లీ నిషేధం సడలింపు. 1992 లో అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి నిషేధం విధించారు.
1995 లో తెలుగుదేశం పార్టీ నిషేధం ఎత్తివేసింది. 1996 లో పీపుల్స్ వార్ తో సహా ఆరు ప్రజాసంఘాలపై మళ్లీ నిషేధం. 2024 లో పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్టు పార్టీగా పేరు మార్పు. 2024 జూలై చివరి వారంలో శాంతి చర్చల కోసం నిషేధం ఎత్తివేత. 2005 ఆగస్టులో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో పాటు అనుబంధ సంఘాలపై నిషేధం విధించింది. 2009 జూన్ నుంచి విప్లవ సంస్థలపై దేశవ్యాప్తంగా నిషేధం అమలులోకి వచ్చింది .
2004 సెప్టెంబర్ లో గణపతి నాయకత్వంలో పీపుల్స్ వార్ బీహార్ లోని విప్లవ పార్టీలతో కలసి మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది.
👉 నన్ను బహిష్కరించడం ఏందిరా ? కొండపల్లి సీతారామయ్య !
పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు, కొండపల్లి సీతారామయ్య ఓ సందర్భంలో ‘ నన్ను పార్టీ నుంచి బహిష్కరించడం ఏందిరా ? పార్టీ పెట్టిందే నేను అన్నారు. కృష్ణాజిల్లాలో అరెస్టు బెయిల్ పై బయటికి వచ్చిన కొండపల్లి సీతారామయ్య, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో స్వర్గీయమాజీ స్పీకర్ నారాయణరావు సోదరుడు కిషన్ రావు ఇంట్లో మాట్లాడారు. ఆ గ్రామానికి చెందిన ప్రముఖ తునికి ఆకు కాంట్రాక్టర్ శ్యామంతుల కిష్టయ్యకు సీతారామయ్య స్నేహితుడు.
ఈ నేపథ్యంలో కొండపల్లి సీతారామయ్య 1995 లో తిమ్మాపూర్ కు వచ్చారు. ధర్మపురి పాత్రికేయుల బృందంను కాంట్రాక్టర్ కిష్టయ్య, తిమ్మాపూర్ లో రాత్రి కొండపల్లికి పరిచయం చేశారు .
ఈ సందర్భంలో సార్ మిమ్మల్ని పీపుల్స్ వార్ పార్టీ నుంచి బహిష్కరించారా ? అని అడిగాను. నన్ను బహిష్కరించడం ఏందిరా ? పార్టీ పెట్టిందే నేను అన్నారు. ఉద్యమాన్ని పారిశ్రామిక రంగం వైపు తీసుకువెళ్లాలని గణపతి (ముప్పాల లక్ష్మణరావు) నల్ల ఆదిరెడ్డి, తదితరులు ప్రశ్నించారట కదా అన్నాను.
అసహనంగా నా వైపు, కాంట్రాక్టర్ కిష్టయ్య వైపు కొండపల్లి చూశారు.
నక్సలైట్ ఉద్యమం, ఆంధ్ర ప్రాంతానికి విస్తరించాలని, పార్టీ నాయకత్వం బడుగు బలహీన వర్గాల వారికి అప్పగించాలని సమావేశంలో చర్చలు జరిగాయట కదా సార్ అన్నాను. సీతారామయ్య అసహనం వ్యక్తం చేస్తూ
గణపతి, వాళ్ల అనుచరులు ఎంచుకున్న విధానం తప్పు అని త్వరలో తెలుసుకుంటారు. ప్రజలు కూడా తెలుసుకుంటారు. అంటూ కొండపల్లి సీతారామయ్య నీది ఏ పేపర్ ? అని అన్నారు. ఇంతలో కాంట్రాక్టర్ కిష్టయ్య కల్పించుకొని తర్వాత అన్నిమాట్లాడదాం అన్నారు.
ఈ దశలోనే సీతారామయ్య తన చేతి వాచ్ ను జర్నలిస్టులకు చూపిస్తూ జైల్లో ఉన్నప్పుడు పరిటాల రవి నాకు ఇచ్చాడు ఇప్పుడు వాడు మంత్రి అని అన్నారు. ( చర్చ పక్కదారి పడుతుందని కాంట్రాక్టర్ కిష్టయ్య అందరం టీ తాగుదాం అన్నారు) అనడంతో వార్తలు పంపడానికి మేము పరుగు పరుగున ధర్మపురికి చేరుకున్నాము.

👉 పీపుల్స్ వార్ పార్టీ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య తో..( కుడి వైపు నుండి ) మురళి (ఆంధ్రజ్యోతి) రామకృష్ణయ్య ( ఆంధ్రభూమి) సురేందర్ కుమార్ (ఉదయం ) కొండపల్లి సీతారామయ్య , నరహరి రావు (ఆంధ్రప్రభ) నరసయ్య (ఈనాడు)
👉 కీలక నేతలు హతమయ్యారు
A .K 47 ఆయుధం వెలుగు చూసింది ఇక్కడే !
కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఉద్యమాన్ని విస్తరింపచేసిన గణేష్ అలియాస్ పులి రాములు 1987 లో జగిత్యాల శివారులో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు . అతడి వద్ద ఏకే 47 ఆయుధం పోలీసులకు దొరికింది. దీంతో వార్ నక్సలైట్లు అత్యాధునిక ఆయుధాలు వినియోగిస్తున్నట్టు పోలీసు వర్గాలకు తెలిసింది. 1983 లో కోరుట్ల మండలం మాదాపూర్ లో మొదటి ఎన్కౌంటర్ జరిగింది . కీలక నాయకులు అంకం నారాయణ వాసం గజేందర్ లు మృతి చెందారు. 1985 కరీంనగర్ మండలం మల్కాపూర్ శివారు ఎన్కౌంటర్లో జిల్లా కార్యదర్శి సాయిని ప్రభాకర్ తో పాటు మరో ఇద్దరు మతమయ్యారు.
1991 జిల్లా కార్యదర్శిగా పనిచేసిన శీలం నరేష్ కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ 2000 సంవత్సరంలో కొయ్యూరు ఎన్కౌంటర్ లో నల్ల ఆదిరెడ్డి ,ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి లతో హతమయ్యాడు. 1985 లో జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ప్రసాద్ అలియాస్ సందే రాజమౌళి అనంతపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. 1988 లో జిల్లా కార్యదర్శి దగ్గు రాయలింగం, వరంగల్ దుర్గా కాలనీలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఆశ్రయము ఇచ్చిన ఇంటి యజమాని కూడా ఈ కాల్పుల్లో మృతి చెందాడు. ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా కొనసాగిన అనుపురం కొమురయ్య ( ఏకే) 2000 సంవత్సరంలో కరీంనగర్ వరంగల్ జిల్లా సరిహద్దు లో జరిగిన ఎన్కౌంటర్ లో హతమయ్యాడు.
2007 లో కార్యదర్శి సోమన్న వరంగల్ ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. ఉత్తర తెలంగాణ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్న పద్మక్క అలియాస్ న్యాలకొండ రజిత, 2002 జులై 2 న ధర్మపురి మండలం నేరెళ్ల సమీప గుట్టలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందింది. ఆమెతో పాటు సాగర్, మానస, విక్రం హతమయ్యారు. 2005 లో కార్యదర్శిగా కొనసాగుతున్న రమేష్ అలియాస్ గంగుల వెంకటస్వామి, మానాల ఎన్కౌంటర్ లో హతమయ్యాడు ఆయనతోపాటు మరొక తొమ్మిది మంది నక్సల్స్ హతమయ్యారు.
👉 ప్రయోగశాల..
వర్గ శత్రువు నిర్మూలన పేరిట ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను టార్గెట్ చేస్తూ 1985 జూలైలో సాయిద కానిస్టేబుల్ కోమల్ రెడ్డిని ధర్మపురిలో కాల్చి పోలీస్ హత్యలకు శ్రీకారం చుట్టారు.
ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా ముద్రపడిన పోలీస్ అధికారులను సామూహికంగా హతమార్చడానికి ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిసారి 1989 లో మందు పాతర టెక్నాలోజీ తో బీర్పూర్ ఘాట్ రోడ్ లో నక్సల్స్ ప్రయోగం వికటించి జీపులో ప్రయాణిస్తున్న 15 మంది అమాయక పౌరుల ప్రాణాలు బలిగొన్నారు.
ఇన్ఫార్మర్ల పేరిట నక్సలైట్లు ప్రజా కోర్టులు నిర్వహించి నరసింహులపల్లి , కొలువాయి ఉమ్మడి సారంగాపూర్ మండలంలో అమాయకులను హతమార్చారు.
👉 కౌంటర్ అటాక్ – కోవర్టు ఆపరేషన్ !
దళ సభ్యుడు కత్తుల సమ్మయ్య తో కోవర్టు ఆపరేషన్ నిర్వహించి హుస్నాబాద్ భూపతి దళాన్ని హతమార్చారు. జడల నాగరాజు తో జిల్లా కార్యదర్శి విజయ్ ను హతమార్చారు.
👉 మావోయిస్టులతో చర్చలు లేవు ఎరివేస్తాం !
నిజాంబాద్ పర్యటనలో ఆపరేషన్ కగార్‌పై అమిత్ షా కీలక ప్రకటన చేశారు. బహిరంగ సభలో మాట్లాడుతూ. మావోయిస్టులను అంతం చేయాలా ? వద్దా.? .మీరే చెప్పండి అన్నారు. మావోయిస్టులు హత్యాకాండ విడిచి తక్షణం ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలి అన్నారు.
గత నెల చత్తీస్గడ్ పర్యటనలో అమిత్ ష బహిరంగంగా ” ఏటా వర్షా కాలంలో భద్రతా దళాల ఆపరేషన్లకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ఉపయోగించుకొని మావోయిస్టులు విశ్రాంతి తీసుకునేవారు. కానీ, ఈసారి వర్షాకాలంలోనూ వారిని నిద్రపోనివ్వం. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకెళ్తాం” అన్నారు.
👉 ఏడు రాష్ట్రాల డీజీపీలతో సమావేశం !
ఛత్తీస్ గఢ్ తోపాటు మావోయిస్టుల ప్రాబల్య మున్న ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికా రులతో అమిత్ షా రాయపూర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలోనూ మావో యిస్టులపై భద్రతా దళాల ఆపరేషన్ ఉద్ధృతంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఏరివేత ఆపరేషన్లు కొనసాగిస్తామని వారితో చర్చలు జరపబోమని ఉద్ఘాటించారు.
👉 పోలిటీ బ్యూరో కేంద్ర కమిటీ లో…
మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన సమయంలో పొలిటి బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు కలిపి 36 మంది ఉండేవారు. వీరు రాజకీయ, మిలటరీ వ్యూహాలు అమలు చేయడంలో ప్లీనరీ సమావేశాలు ఈ కమిటీలదే కీలక పాత్ర, ప్రస్తుతం ఆ సంఖ్య 12 మంది కే పరిమితమైనట్టు చర్చ.
దీనికి తోడు గత సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో ఛత్తీస్గడ్ దండకారణ్యంలో కేంద్ర కమిటీ సభ్యుడు బల్మూరి నారాయణరావు ను ( బీర్పూర్ ) ఒక్కడినే భద్రతా దళాలు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంవత్సరం జనవరి నుంచి కీలక నాయకులు, కేంద్ర కమిటీ , బ్యూరో సభ్యులు ఎదురు కాల్పుల్లో హతమవుతూనే ఉన్నారు. దళాలకు దళాలు భద్రత దళాలకు జనజీవన స్రవంతిలోకి పోతున్నారు. నాలుగున్నర దశాబ్దాలు నక్సలైట్ ఉద్యమ చరిత్రలో ఇంతటి దుర్బరైద్యమైన పరిస్థితిని ఎదుర్కోలేదని చెప్పవచ్చు.

ఇలాంటి పరిస్థితులలోనక్సలైట్ ఉద్యమం తేలిపోయే మేఘంలా అగుపిస్తున్న, ఆ ఉద్యమం రానున్న రోజులలోఎలాంటి రూపంలో పురుడుపోసుకుంటుందో ? జనజీవన స్రవంతిలో కలుస్తారో ? శాంతి చర్చలు మొదలవుతాయో లేదో. చూడాల్సిందే